విజయశాంతికి పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో
విజయశాంతి నటించిన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. తెలుగులోనే కాదు, హింద రీమేక్ లో కూడా ఘన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాతే చిరంజీవితో సమానంగా కోటిరూపాయలు రెమ్యూనరేన్ తీసుకునే స్థాయికి ఎదిగారు విజయశాంతి.
సూర్య మూవీస్ బ్యానర్ పై వచ్చింది కర్తవ్యం సినిమా. 1990లో వచ్చిన ఈ సినిమాకు మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు. విజయశాంతి, వినోద్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఓ పోలీసాఫీసర్ చుట్టూ తిరుగుతుంది. వైజయంతీ ఐపీఎస్ గా విజయశాంతి తన నటవిశ్వరూపం చూపించారు. సహాయ నటుడిగా వినోద్ కుమార్ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు విజయశాంతి.
ఈ సినిమా విడుదల (జూన్ 29, 1990) టైమ్ లో ఓ గమ్మత్తైన విషయం జరిగింది. మోహన్ గాంధీ డైరక్ట్ చేసిన కర్తవ్యం సినిమాతో పాటు, అతడే డైరక్ట్ చేసిన ఆడది సినిమా కూడా అదే రోజు రిలీజైంది. కర్తవ్యం సినిమా పెద్ద హిట్టవుతుందని, రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదలకు ముందే అంచనా వేశారు. అందుకే ఆడది అనే సినిమాను ఓ వారం రోజులు వాయిదా వేసుకోమని సూచించారు. కానీ ‘ఆడది’ సినిమాను నిర్మించిన నటుడు శివకృష్ణ ఆ మాటలు వినలేదు. కర్తవ్యంతో పోటీకి దించారు. విజయశాంతి హవా ముందు యుమున యాక్టింగ్ నిలవలేకపోయింది. ఆడది సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఈ సినిమా కోసం విజయశాంతి పడిన కష్టం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. మగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా జిమ్ లో ఆమె కసరత్తులు చేసేవారు. ప్రతి రోజూ కనీసం 10 కిలోమీటర్లు పరుగెత్తేవారు. ఆమె వ్యాయామాలు చూసి, మగాళ్లు కూడా ఆశ్చర్యపోయేవారు. అంత ఫిట్ నెస్ తో ఉండేవారు విజయశాంతి. ఆమె కష్టం సినిమాలో అణువణువునా కనిపిస్తుంది. ఆ కష్టమే ఆమెకు జీవితకాల గుర్తింపును తీసుకొచ్చింది. లేడీ అమితాబ్ అనే బిరుదును అందించింది.
రీసెంట్ గా కర్తవ్యం సినిమాకు అరుదైన గుర్తింపు దక్కింది. గతేడాది ఈ సినిమా 30 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేషనల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఎఫ్ఐ) ఈ చిత్రం మొక్క తెలుగు, హిందీ పోస్టర్లను విడుదల చేసింది.
తెలుగులో ‘కర్తవ్యం’ సినిమా 1990లో రిలీజ్ కాగా.. హిందీలో ‘తేజస్విని’ పేరుతో రీమేక్ చేశారు. హిందీలోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తరువాత తమిళంలో కూడా రిలీజై అఖండ విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ.. ‘కర్తవ్యం సినిమా పోస్టర్స్‌ను ఎన్ఎఫ్ఐ’ ట్వీట్ చేయడం తెలుగు సినిమాకు దక్కిన మరో అరుదైన గుర్తింపుగా భావించాలి. విజయశాంతి సాధించిన ఘనతకు ఇదొక ఉదాహరణ.
Must Read ;- బాక్సాఫీస్ ను రఫ్ ఆడించిన మెగాస్టార్ ‘గ్యాంగ్ లీడర్’ @ 30











