హస్తినాపురాన్ని ముట్టడించి అన్నదాతలు కేంద్ర ప్రభుత్వం మీద సాగిస్తున్న పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మద్దతు తెలియజేశారు. రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన 8వ తేదీన భారత్ బంద్ కు తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ భారత్ బంద్ ను విజయవంతం చేయడానికి తెరాస శ్రేణులు ప్రత్యక్షంగా బంద్ కార్యక్రమంలో పాల్గొంటాయని కూడా కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే.. భారత్ బంద్ కు మద్దతుగా నిలుస్తుండడంతో తెలంగాణలో బంద్ విజయవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల మీద అన్నదాతలు సాగిస్తున్న పోరాటానికి తెలుగు రాష్ట్రాలనుంచి మొదటిసారిగా మద్దతు ప్రకటించింది.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు. కాంగ్రెస్ పార్టీ తొలినుంచి ఈ బిల్లులను వ్యతిరేకిస్తూనే ఉంది. జాతీయ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా.. ఇప్పుడే తెలుగురాష్ట్రాల ప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు. వారిని మినహాయిస్తే చంద్రబాబునాయుడు శనివారం నాడు రైతుల దీక్షలు, పోరాటాల మీద గళం విప్పారు. కేంద్రం అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని అన్నారు. అంతే తప్ప.. 8వ తేదీ రైతులు పిలుపు ఇచ్చిన భారత్ బంద్ గురించి ఇదమిత్థంగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో ఆయన చెప్పనేలేదు. ఈలోగా కేసీఆర్ మాత్రం తమ పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొంటాయని తేల్చి చెప్పారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నిజానికి బీజేపీ చేతిలో రెండు కీలక ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత గానీ.. వారికి వ్యతిరేకంగా మరింత క్రియశీలంగా పోరాడాలనే మాట ఆయనకు స్ఫురించినట్టు లేదు. రైతులు 11 రోజులుగా దీక్షలు చేస్తూ ఉంటే.. తెరాస తరఫున అధికారికంగా వారికి మద్దతు ఇవ్వడం ఇదే ప్రథమం.
మిగిలిన పార్టీలు మరీ ఘోరం..
ఏపీలో పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు తమది రైతు బాంధవ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది గానీ.. ఇన్ని రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న రైతుల పోరాటాల విషయంలో ఇప్పటిదాకా నోరు మెదిపింది లేదు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో అనేక కారణాలదృష్ట్యా సత్సంబాధలకు మాత్రమే ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. బీజేపీకి ఇష్టం లేని ఏ మాట మాట్లాడ్డానికి కూడా సాహసించరని, రైతుల దీక్షల గురించి, వ్యవసాయ చట్టాల గురించి మౌనం పాటించడమే ఇందుకు నిదర్శనం అని కూడా విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబునాయుడు.. రైతుల పోరాటాల గురించి మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని, జాతీయ స్థాయిలో వ్యవసాయ బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులు, రైతుసంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలన్నారు. అపోహలను తొలగించాలని పిలుపు ఇచ్చారు. కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్ధత ఉండాలనే రైతుల డిమాండ్‌కు ప్రభుత్వం కూడా దాదాపు సుముఖంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కూడా అదే విషయాన్ని మరోమారు ప్రస్తావించారు. కనీస మద్దతు ధర పొందడం అనేది ఒక విధాన నిర్ణయంగానే కాకుండా రైతుకు చట్టబద్దమైన హక్కుగా ఉండాలని ఆయన అన్నారు.
రైతుల్లోనూ స్పందన కనిష్టం..
నిజానికి తెలుగురాష్ట్రాలు మాత్రమే కాదు, యావత్ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ మూడు వ్యవసాయచట్టాల గురించి స్పందన కనీసంగా కనిపిస్తోంది. ఉత్తరాది రైతులు ఉద్యమించినంత తీవ్రంగా ఇక్కడ ఎవరూ వాటిగురించి పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్రధానంగా చిన్న కమతాలుగల రైతులు ఎక్కువగా ఉండడమే దానికి కారణం అనే మరో వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ.. బీజేపీ చేతిలో పరాభవం తర్వాతనైనా.. కేసీఆర్ స్పష్టమైన పోరాటమార్గం అనుసరిస్తూ రైతులకు అండగా నిలవడం గమనించాల్సిన విషయం.
Also Read: వాటర్ అండ్ పవర్ ఫ్రీ: మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్