గ్రేటర్ ఎన్నికలు తెరాసకు కీలకంగా మారాయి. ఇక దుబ్బాకలో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ నేతలు గ్రేటర్‌లో పాగా వేయగలిగితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు చెక్ పెట్టవచ్చని ఆ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ రెండు పార్టీల పేర్లే గ్రేటర్ ఎన్నికల బరిలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఎంఐఎం పాతబస్తీలోని 40 స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది డివిజన్లు గెలిచేది కష్టంగానే అనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి కీలక నేతల వలసలు కాంగ్రెస్ కు శాపంగా మారాయి. కాంగ్రెస్ లో నాయకత్వ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక టీడీపీ, జనసేన, వామపక్షలు, పోటీ చేస్తే వైసీపీ పార్టీలు ఖాతా తెరుస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
కేసీఆర్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా?
బీహార్ లో బీజేపీ అమలు చేసిన వ్యూహాన్ని కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో జట్టుకట్టిన జనసేనను గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దింపడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని భావించవచ్చు. సెటిలర్లు, ముఖ్యంగా ఆంధ్రావారి ఓట్లు తెరాసకు పడే అవకాశాలు తక్కువ. అందుకే వారి ఓట్లు బీజేపీ ఖాతాలో పడి వారి బలం పెరగకుండా, ఓట్లను చీల్చేందుకు జనసేనను ఒంటరిగా బరిలోకి దింపేలా కేసీఆర్ జనసేన అధినేతను ప్రోత్సహించారనే సమాచారం వస్తోంది.
ఏపీలో ఒక్కసీటుకే పరిమితమైన జనసేన గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా దిగుతామంటూ తొడగొట్టడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. షూటింగుల్లో హడావుడిగా ఉన్న జనసేనాని రెండు రోజులు సినిమా షూటింగులు నిలిపేసుకుని మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం పెట్టుకున్నారు. నిజానికి ఈ సమావేశం ఇప్పట్లో జరగాల్సింది కాదు. హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పడానికే జనసేనాని మంగళగిరిలో అత్యవసర సమావేశం నిర్వహించారని తెలుస్తోంది.
అక్కడ నుంచే గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతున్నామని ప్రకటించారు. ఏపీలో బీజేపీతో కలసి అడుగులు వేస్తున్న, జనసేనాని తెలంగాణలో మాత్రం తెరాసతో కుమ్మక్కయినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా తెలంగాణ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని విశ్లేషణలు హల్ చల్ చేస్తున్నాయి. పాతబస్తీలో ఎంఐఎంతో జట్టుకట్టే తెరాస, సెటిలర్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో జనసేన ఓట్ల చీలిక ద్వారా గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుతీరాలకు చేరాలని పార్టీలోని ప్రతి నేతనూ మోహరించారు.
వనరులు పుష్కలంగా ఉన్న తెరాసకు నిజంగా గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ దుబ్బాకలో ఎదురుదెబ్బలు, హైదరాబాద్ లో ఇటీవల వచ్చిన వరదలు తెరాస అధినేతకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక గ్రేటర్ లో కూడా ఓడిపోతే మాత్రం కారు దూకుడుకు బ్రేకులు పడ్డట్టేనని భావించవచ్చు.
Must Read ;- మేల్కొనకపోతే కాంగ్రెస్ కనుమరుగే..!
దూకుడు మీదున్న బీజేపీ
దుబ్బాక ఫలితాలతో తెలంగాణ బీజేపీ మంచి దూకుడు మీదుంది. గెలిచింది ఒక్క అసెంబ్లీ స్థానమైనా బీజేపీకి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందని చెప్పవచ్చు. తెరాస ఏడేళ్ల పాలనపై ముఖ్యంగా యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించారు. అందుకే దుబ్బాకలో యువతోత్సాహంతోనే బీజేపీ అభ్యర్థి నెగ్గారు. ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలను ఆకర్షించి, ఆ పార్టీ ఓట్లను కొల్లగొడ్డడం ద్వారా బీజేపీ నేతలు కనీసం 51 డివిజన్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేంద్ర బీజేపీ పెద్దల నుంచి కూడా అండాదండా లభించడంతో ఇక తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు భూపేంద్ర యాదవ్ ను అమిత్ షా రంగంలోకి దింపారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలో బీజేపీ గెలుపునకు వ్యూహాలు రచించి విజయవంతంగా అమలు చేసిన భూపేంద్ర యాదవ్ గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారో ఇప్పటికే అర్థమైంది. ఆయన హైదరాబాద్ లో కాలు పెట్టిన రెండు రోజుల్లోనే గ్రేటర్ కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇక టీడీపీ ఓట్లు కూడా బీజేపీ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సెటిలర్లకు సీట్లు ఇవ్వడం ద్వారా వారి ఓటు బ్యాంకు బీజేపీ ఖాతాలో పడేలా చూడాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇక తెలంగాణలోని బీజేపీ నేతలంతా గ్రేటర్ ఎన్నికలు అయ్యే వరకు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని ఆ పార్టీ ఆదేశించింది. బీజేపీ సీనియర్ నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీకి ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉండటంతో ప్రతి ఓటుపై గురిపెట్టారని తెలుస్తోంది.
కాంగ్రెస్ ఆశలు గల్లంతు
తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, తెరాస అధినేత కేసీఆర్ ను ఎదుర్కోవడంలో విఫలం అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరిదారి వారిదే. ఎవరికి వారే గొప్ప నాయకులు. ఒకరిమాట ఒకరు వినే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక ఆ పార్టీలో ఎవరు ఉంటారో? ఎవరు బీజేపీలోకి వెళుతున్నారో అర్థం కాక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయోమయంలో పడిపోయారు. ఇటు గ్రేటర్ ఎన్నికల్లో బిజీగా ఉండాల్సిన కాంగ్రెస్ అధ్యక్షుడు, చివరకు కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీ మారవద్దని బతిమాలు కోవాల్సి దుస్తితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్ పార్టీ పట్టుమని పది డివిజన్లు సాధిస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, తెరాసను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ లో తురుపు ముక్కలు కూడా లేవు. రేవంత్ రెడ్డి లాంటి నేతలు గట్టిగా ప్రశ్నించగలరు. కానీ ఆయనకు ఆ పార్టీ నేతలే బ్రేకులు వేస్తూ ఉంటారు. చివరకు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళుతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఇక తెలంగాణ కాంగ్రెస్ పని అయిపోయినట్టే.
సింగిల్ సీటు వస్తుందా? ఈ పార్టీలకు..
టీడీపీ, జనసేన, వైసీపీ, వామపక్షాలు వీరంతా గ్రేటర్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. టీడీపీ గత గ్రేటర్ ఎన్నికల్లోనే దారుణంగా దెబ్బతింది. మరోసారి అదృష్ణాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక జనసేన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే, అసలు ఆ పార్టీకి గ్రేటర్‌లో ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. లేదంటే సెటిలర్ల ఓట్లు చీల్చి తెరాస పార్టీ అభ్యర్ధులు కొన్ని డివిజన్లలో గెలిచేందుకు సహాయపడుతుంది. ఇక వామపక్షాల జెండా ఎత్తేవారే కరవయ్యారు. ఇక వైసీపీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. వైసీపీని కూడా తెరాస అధినేత రంగంలోకి దింపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు అలాంటివి మరి. ఏది ఏమైనా గ్రేటర్ పోరు ఆ మూడు పార్టీ మధ్యే సాగనుంది.
Also Read ;- గులాబీ బాస్ గ్రేటర్ ప్లాన్.. కమలనాథులకు చెక్