KCR Temple For Sale :
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎందరో అభిమానులు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమకారుడిగా తెలంగాణ జనం గుండెల్లో కేసీఆర్‌కు దేవుడిగా మారిపోయారు. అందులో భాగంగానే ఆయనకే తెలంగాణ తొలి సీఎంగా పట్టం కట్టారు. అయితే టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్‌కు దక్కిన అభిమానం.. సీఎంగా ఆయనకు ఆ స్థాయి అభిమానం దక్కలేదనే చెప్పాలి. పాలన అన్నాక చాలా ఆటుపోట్లు సహజమే. అయితే ఆ ఆటుపోట్లు ఏ స్థాయికి చేరాయంటే.. టీఆర్ఎస్ ను దేవుడిగా పరిగణిస్తూ ఆయనకు ఏకంగా ఓ గుడినే కట్టిన ఓ వీరాభిమాని ఇప్పుడు ఆ గుడిని అమ్మకానికి పెట్టేంతగా. ఆశ్చర్యమనిపించినా.. కేసీఆర్ వీర భక్తుడు గుండ రవీందర్ తాను కట్టిన కేసీఆర్ గుడిని అమ్మేస్తున్నారు.
భక్తుడికి కేసీఆర్ దర్శనమే లేదట
రాజకీయ నాయకులకు, సినీతారలకు గుడులు కట్టడం ఇటీవలి కాలంలో బాగానే పెరిగింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ ఏళ్ల క్రితమే కేసీఆర్‌కు గుడి కట్టేశారు. కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బైండోవర్ కేసులను సైతం ఎదుర్కొన్న రవీందర్.. తన స్వగ్రామంలో 2016లో రూ.3 లక్షలతో కేసీఆర్ కు గుడి కట్టారు. ఆ గుడిలో కేసీఆర్‌తో పాటుగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తూ తన వీరభక్తిని చాటుకునేవారు. అయితే కాలక్రమంలో పరిస్థితి మారింది. సొంత ఊరిలో కేబుల్ నెట్ వర్క్ వ్యాపారం చేసే రవీందర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన వ్యాపారాన్ని ఇతరులు హస్తగతం చేసుకున్నారు. దాంతో తనను ఆదుకోవాలని, న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ అనేక పర్యాయాలు ప్రగతి భవన్ కు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ లను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరికి కేసీఆర్ కు తాను కట్టిన గుడి ఎదుట ధర్నా చేసినా ఫలితం లేకపోయింది. చేసేదిలేక టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
ఇప్పుడు అమ్మకానికి గుడి
తాజాగా కేసీఆర్ గుడిని అమ్మేస్తానంటూ రవీందర్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి సంచలనం రేపారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం మంచి పనిచేస్తున్నావంటూ రవీందర్ ను అభినందిస్తున్నారట. కొన్ని రాజకీయ శక్తులు తన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీశాయని, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు న్యాయం జరగలేదని రవీందర్ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన రవీందర్, తన ఫోన్ నెంబరు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో, కొందరు వ్యక్తులు కేసీఆర్ గుడిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, భవిష్యత్తులో ఏంజరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. అయినా ఇంటినో, వ్యాపార సముదాయాన్నో అమ్మకానికి పెడితే సరే గానీ.. ఇలా ఓ రాజకీయ నేతకు కట్టిన గుడిని అమ్మేస్తానంటే.. ఆ నేతకు చెందిన పార్టీ నేతలు మినహా మిగిలిన వారు ఆసక్తి చూపరు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి టీఆర్ఎస్ కు చెందిన ఏ నేత ఈ గుడిని కొంటారో చూడాలి.
Must Read ;- వీళ్ల పోరు పరువు నష్టం దాకా వెళ్లింది











