మహానటి కీర్తి సురేష్ ని కరోనా వచ్చి ఓటీటీ స్టార్ ని చేసేసింది. మహానటి తర్వాత ఆమెను ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలే వరించాయి. అలాంటి సినిమాల్లో ‘గుడ్ లక్ సఖి’ కూడా చేరుతుంది. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. గత ఏడాది ఆమె నటించిన ‘పెంగ్విన్’ సినిమా ఓటీటీలోనే విడుదలైంది. ఆ తర్వాత ‘మిస్ ఇండియా’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. కాకపోతే ఈ సినిమాలు సక్సెస్ కాకపోయినా కీర్తి సురేష్ ని మాత్రం ఓటీటీ స్టార్ ని చేశాయి.
ఓటీటీ యాజమాన్యాలు కూడా కీర్తి సురేష్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మంచి ఆఫర్లతోనే ఆ సినిమాలు తీసుకున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే కరోనా సమయంలో ఆమెకు సరైన విజయం మాత్రం లభించలేదు. నితిన్ హీరోగా నటించిన రంగ్ దే కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో కీర్తి ఆశలన్నీ ‘గుడ్ లక్ సఖి’ పైనే ఉన్నాయి. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసింది.
జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. దాంతో జీ5 ఓటీటీ ద్వారా ఈ సినిమాని విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో షార్ప్ షూటర్ పాత్రలో ఆమె నటించినట్టు సమాచారం. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది. రజినీ కాంత్ తో నటించిన ‘అన్నాత్తే’ షూటింగ్ దాదాపు పూర్తయింది. గుడ్ లక్ సఖి మాత్రం ఈ నెలలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Must Read ;- ఫస్ట్ డోస్ కోవిడ్ వేక్సిన్ వేయించుకొన్న కీర్తిసురేశ్











