ఏపీలో నిరుద్యోగం పెరుగుతోంది. జగన్ సీఎం అయితే తమకు ఉద్యోగాలు వస్తాయని భావించిన ఏపీ నిరుద్యోగ యువత వైసీపీ గుర్తు ఫ్యాన్ కు ఓట్లేసింది. అయితే జగన్ సీఎం అయ్యాక.. కొత్తగా ఉద్యోగ నియామకాలు లేకపోగా.. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. ఈ క్రమంలో రెండేళ్లునరేళ్లుగా ఉద్యోగాల కోసం వేచి చూసిన యువత.. ఇక ఉద్యోగాలు రావన్న దిగులుతో ఉరేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఆదివారం ఇంకో ఘటన తోడైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన నిరుద్యోగి వీరాంజనేయులు ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని నిరుద్యోగుల పరిస్థితికి అద్దం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన వీరాంజనేయులు.. చదువులో అంత డల్లేమీ కాదు. సర్కారీ బడిలో చదువుకుని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన సరస్వతీ పుత్రుడు. అతడికి చదువు చెప్పిన ఉపాధ్యాయులతో పాటు తోటి విద్యార్థులు కూడా వీరాంజనేయులును సరస్వతీ పుత్రుడుగానే పిలిచేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో మంచి మార్కులతో పాసైన వీరాంజనేయులు ఆ మార్కుల ఆధారంనే ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులోనూ వీరాంజనేయులు మంచి మార్కులతోనే పాసయ్యాడు. ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగంలో చేరిన అతడు.. గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యాడు. అయితే అందులో విఫలమయ్యాడు. మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే జగన్ సర్కారు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఇక తనకు ప్రభుత్వ ఉద్యోగమే రాదేమోనన్న ఆందోళనలో పడిపోయాడు. ఈ ఆందోళన అతడిలో అంతకంతకూ పెరిగిపోగా.. ఇక తనకు సర్కారీ కొలువు దక్కదేమోనని ఓ నిర్ధారణకు వచ్చి ఇంటిలోనే ఫ్యాన్ కు ఆదివారం తెల్లవారుజామున చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో జగన్ సర్కారు అవలంబిస్తున్న అలసత్వం కారణంగా కర్నూలు జిల్లాలో బలవన్మరణం పొందిన యువకుల సంఖ్య రెండుకు చేరింది.
లోకేశ్ ఆగ్రహం
వీరాంజనేయులు ఆత్మహత్య ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. వీరాంజనేయులు ఆత్మహత్య జగన్ సర్కారు చేసిన హత్యగానే ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా లోకేశ్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ‘‘వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది. ఫ్యాన్ కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరం. వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.. పోరాడి ఉద్యోగాలు సాధిద్దాం’’ అంటూ నారా లోకేశ్ జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
Must Read ;- అభాగ్యులకు అండ లోకేశే, జగన్ కాదు