సినిమా థియేటర్లకు ఓటీటీ దెబ్బ బాగానే తగులుతోంది. సినిమా బాగుందన్న టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశాజనకంగా ఉంది. ఇటీవల విడుదలైన గోపీచంద్ ‘సీటీమార్’ నైజాం, ఏపీ కలిపి కేవలం 2.75 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. కంగనా రనౌత్ ‘తలైవి’ పరిస్థితి కూడా అంతే. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు లేవు. ఒక్క తమిళ మార్కెట్ లో మాత్రమే వసూళ్లు బాగున్నాయి. ముఖ్యంగా తలైవి విషయంలో ఓటీటీలో కూడా సమాంతరంగా ఈ సినిమాని విడుదల చేయాలనుకోవడంతో చాలా మల్టీప్లెక్స్ థియేటర్లు ఈ సినిమాను విడుదల చేయడానికి నిరాకరించాయి. కలెక్షన్లు తగ్గడానికి అది కూడా ఒక కారణం.
దాంతో హిందీ మార్కెట్ లో తలైవి పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. ఒక్క తమిళనాడులో మాత్రమే ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించి ‘లాభం’ నుంచి పోటీ ఉన్నా జనం ‘తలైవి’ వైపే మొగ్గుచూపారు. తమిళనాడులో జయలలిత అసాధారణ నాయకురాలు కావడంతో అక్కడి ప్రజలు మాత్రం ఈ సినిమాకి పట్టం కట్టారు. పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఇతర ప్రాంతాల్లో జనాదరణ లభించలేదు. తలైవి మొదటి రోజు షేర్ రూ. 1.25 కోట్లలో రూ. 80 లక్షలు తమిళ మార్కెట్ నుంచే లభించాయి.
కంగనా రనౌత్ నటించిన సినిమా బాలీవుడ్ లో మొదటిరోజు సరిగా ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ వారం తలైవి వసూళ్లకు కీలకం. ఎంత వసళ్లు సాధిస్తుందన్న చూడాలి. ఓటీటీలో ఇంకా విడుదల కాలేదు కాబట్టి కొంతలో కొంత ఊరట కలిగించే అంశం. అతి తక్కువ వ్యవధిలో ఓటీటీలో సినిమాలు విడుదల కావడం కూడా థియేటర్లకు జనం రాకపోవడానిక ఓ కారణంగా భావించాలి. సీటీమార్, లాభం, తలైవి సినిమాలు సాధించిన వసూళ్లు చూస్తుంటే మాత్రం రాబోయే కాలంలో ఓటీటీ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
Must Read ;- తలైవి (రివ్యూ)











