న్యూస్ ఛానల్స్‌లో 2020 జనవరి 2, గురువారం నాడు దిశ చట్టం గురించి లైవ్ వస్తోంది.ఎవరో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడుతోంది.చూడటానికి నార్త్ అమ్మాయిలా ఉంది.. కాని తెలుగు బాగా మాట్లాడుతోంది.ఎవరీ యంగ్ ఆఫీసర్.. హీరోయిన్లా ఉందే అనుకుంటూ అందరూ మాట్లాడుకున్నారు.ఆమె మాట్లాడే తీరు.. ప్రజంటేషన్ ఇస్తున్న స్టయిల్ చూసి.. అందరూ అలా చూస్తుండిపోయారు.దిశ చట్టం అమలుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్‌లను స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసింది.అందులో ఒకరు కృతికా శుక్లా.. చాలామందికి తెలుసు. ఈ రెండో యంగ్ లేడీ ఐపీఎస్ ఎవరా అని అందరూ తెగ సెర్చ్ చేసేశారు.
మన తెలుగు అమ్మాయి
ఆమె పేరు దీపిక ఎం.పాటిల్.దీపిక మండవ పాటిల్.ఇదేంటి మండవ అంటే మన తెలుగమ్మాయి..ఈ పాటిల్ ఏంటి అనుకోకండి. పాటిల్.. ఆమె భర్త ఇంటి పేరు.విక్రాంత్ పాటిల్.ఈ పేరు కూడా చాలామంది వినే ఉంటారు.ఈయనా ఐపీఎస్ ఆఫీసరే. ప్రస్తుతం విజయవాడలో డీసీపీగా చేస్తున్నారు.మేడమ్ పేరులోని పాటిల్ ఈ పాటిల్ సాబ్ దే.ఇక మండవ అనేది తండ్రి విష్ణువర్ధన్ రావు గారి నుంచి వచ్చింది.ఆయనా పోలీస్ బ్యాచే.సార్ జార్ఖండ్‌లో అడిషినల్ డీజీ. అప్పుడే ఆశ్చర్యపోకండి.ఇంకా ఉంది.. మేడమ్ బ్రదర్ హర్షవర్ధన్ కూడా ఐపీఎస్.అరుణాచల్ ప్రదేశ్‌లో ఎస్పీగా చేస్తున్నారు.
అమ్మాయే కదా.. పెళ్లి చేస్తే చాల్లే అనుకోలేదా కుటుంబం. అమ్మాయే కదా.. కాస్త చదివించి.. అత్తారింటికి పంపితే చాలనుకోలేదు ఆ తల్లి తండ్రి. తనకేది ఇష్టమో.. అదే చదివించారు.తనకేం కావాలో అదే ఇచ్చారు.దీని కోసం వారేమీ ఆస్తులు కరగబెట్టుకోలేదు..కేవలం అమ్మాయి ప్రతిభే వారి పెట్టుబడి.అమ్మాయి తెలివితేటలు, పట్టుదలే వారి ఖర్చు. అంతే ఆణిముత్యం లాంటి ఓ పోలీస్ అధికారిణిని మనకు అందించారు.
వారి స్వగ్రామం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంక
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంక మండవ విష్ణువర్ధన్ గారి స్వగ్రామం.అయితే ఆయన ఐపీఎస్ అయ్యాక జార్ఖండ్ క్యాడర్‌గా వెళ్లాల్సి వచ్చింది.అప్పటి నుంచి ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో చేయలేకపోయాననే బాధ ఉండేది.కొడుకు ఐపీఎస్ అయ్యాడు.. ఆయనా అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాల్సి వచ్చింది.దీపిక చదువు పూర్తయింది.పెళ్లి కూడా ఇష్టపడ్డవాడితోనే చేశారు.అయినా అక్కడితో ఇక తన కెరీర్ అయిపోయింది అనుకోలేదు.సివిల్స్ రాసింది.ఫస్ట్ ప్రయత్నంలోనే సక్సెస్ కొట్టింది.ఐపీఎస్ అయింది.ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్ కమాండెంట్‌గా పని చేసింది.ఆ తర్వాత విజయనగరం జిల్లా పార్వతీపురంలో,విజయనగరం జిల్లా కేంద్రంలోనూ పని చేసింది.తర్వాత దిశ స్పెషల్ ఆఫీసర్‌గా అపాయింట్ అయింది.
చదువులో అయినా.. జీవితంలో అయినా..
దీపిక స్పెషాలిటీ ఏంటంటే.. ఫస్ట్ బాల్ లోనే సిక్స్ కొడుతుంది.అవును చదువు అయినా అంతే..తన జీవితంలో నిర్ణయాలు కూడా అంతే.నాన్న పోలీసు అధికారిగా వరుసబెట్టి బదిలీలు అవుతుంటే 13 స్కూళ్లు మారింది.తన ఫ్రెండ్స్ మారారే తప్ప చదువులో మాత్రం ఎక్కడా తేడా రాలేదు.తన జీవితంలో తనతో పాటు ప్రయాణం చేసే జీవిత భాగస్వామి విషయంలోనూ అంతే.సోదరుడు హర్షవర్ధన్,విక్రాంత్ పాటిల్ ఒకటే బ్యాచ్ కావడంతో.. హర్షతో పాటు ఇంటికి వస్తూ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు.విక్రాంత్, దీపికలు ఒకరినొకరు ఇష్టపడ్డారు..దీపిక డిసైడ్ అయింది. తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు ఓకె చెప్పారు..పెళ్లి అయిపోయింది అంతే. ఏ సినిమా ట్విస్టులు లేవు..దీపిక సెలెక్షన్ పై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకం అలాంటిది.తమ కుమార్తె ఎప్పుడూ ఉన్నతమైన నిర్ణయాలే తీసుకుంటుందని వారి నమ్మకం. భర్త సైతం ఆమె కెరీర్ ఆలోచనలకు,ఆకాంక్షలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకున్నాడు.. అందుకే దీపిక సెలెక్షన్ కరెక్టని మరోసారి ప్రూవ్ అయింది.
చిన్నప్పటి నుంచి నాన్న చేతిలో లాఠీ చూసే..
అసలు పోలీస్ ఆఫీసర్ ఎందుకయ్యావు అని అడిగితే ఓ ఇంటర్వ్యూలో దీపిక చెప్పిన సమాధానం ’’నాన్న చేతిలో లాఠీని చిన్నప్పటి నుంచి చూసేదానిని..ఇంట్లోవారందరూ పోలీసు అధికారులే కావడం..ఇవన్నీ నాకు ఆ ప్రొఫెషన్‌పై ఆసక్తిని పెంచాయి. అలాగే నాకు పోలీసు అధికారి కావడం పెద్ద కష్టంగా కూడా అనిపించకుండా చేశాయి.’’
ఆమె ఆసక్తి ఏదున్నా.. ఆమె కుటుంబం ప్రభావం ఎంతున్నా..ఆమె ప్రతిభ ఎంతగా ఉన్నా..మనకు మాత్రం ఓ మంచి లేడీ ఐపీఎస్ అధికారి దొరికారు. ప్రతి తల్లి తండ్రి తమకు ఉన్నంతలో.. లేదా అంతకు మించి అయినా సరే.. ఆడపిల్లలను నామమాత్రపు చదువులకు పరిమితం చేయకుండా.. పెళ్లి చేసి అత్తారింటికి పంపితే చాలని అనుకోకుండా.. వారి ఆకాంక్షలు, తెలివితేటలకనుగుణంగా ప్రోత్సాహాన్ని ఇస్తే ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో మన సమాజానికి అందుతాయి.
Must Read ;- పాఠాలకే గుణపాఠాలు నేర్పిన కుందనపు బొమ్మ.. ఐపీఎస్ చందనా దీప్తి