తెలుగు సినిమా ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో ఈసారి ‘మెగా’పోటీనే నెలకొనబోతోంది. సాధారణంగా ముఖాముఖి పోటీ ఉండే ఎన్నికల్లో ఈసారి మా అధ్యక్ష బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా పెరిగిపోతోంది.
మొదట ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి వచ్చింది. వెంటనే మా అధ్యక్ష పోటీకి మంచు విష్ణు పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఇక్కడితో ఆగలేదు ప్రస్తుత మా ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ కూడా ఈ పదవికి పోటీ పడబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నటి హేమ కూడా బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టమైంది. మా అసోసియేషన్ కు ప్రతి రెండేళ్లకూ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న కార్యవర్గం పదవీ కాలం కూడా ముగిసిపోయింది. వచ్చే సెప్టెంబరులో ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేష్ మనసులో మాట ఇంతవరకూ బయటికి రాలేదు. ఇలాంటి మెగా పోటీలో ‘మెగా’ రాయబారం లేకపోతే ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కష్టమే.
ఇప్పుడు సినిమా రంగంలో పెద్దన్న పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్నారు. ఆయన మద్దతు ఎవరికి ఉంటుందన్నది స్పష్టంగా ఉండదు. కానీ లోపాయికారీగా ఆయన ఎటు మొగ్గుచూపుతున్నారన్నది మాత్రం తెలుస్తూనే ఉంటుంది. సాధారణంగా ఆయన వాయిస్ ఆయన సోదరుడు నాగబాబు రూపంలోనే బయటికి వస్తుంది. ప్రకాష్ రాజ్ ఈ పదవికి పోటీచేస్తున్నానని అన్నప్పుడే నాగబాబు వాయిస్ వచ్చింది. ఆయన ప్రకాష్ రాజ్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో మెగాస్టార్ మద్దతు కూడా ప్రకాష్ రాజ్ వైపే ఉంటుందని అందరూ భావించారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఈ పదవి కోసం గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు.
కాకపోతే ఆయన స్థానికుడు కాదన్న విమర్శ మాత్రం ఉంది. ఇక్కడ నివాసం లేని వ్యక్తి ఈ పదవికి ఎలా పోటీచేస్తారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మంచు విష్ణు విషయానికి వస్తే మోహన్ బాబు కు తనయుడు. చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఒకప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండేవి. ప్రస్తుతం వీరిద్దరి మధ్యా మంచి స్నేహపూరిత వాతావరణమే ఉంది. అలాంటప్పుడు మెగా కుటుంబం వ్యక్తులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా దొర్లినా మోహన్ బాబు కస్సుమనే ప్రమాదం ఉంది.
ఇక జీవిత, హేమ.. ఇద్దరూ మహిళా విభాగం అని చెప్పాలి. వీరిద్దరూ మా అసోసియేషన్ లో కీలక పదవుల్ని నిర్వహిస్తూ వచ్చారు. నిన్నటిదాకా మూడు ముక్కలాటలాగా ఉంటుందనుకున్న మా ఎన్నిక ఇప్పుడు నాలుగు స్తంభాలాటలాగా మారే అవకాశం ఉంది. మహిళా లోకంలో కాస్త స్పీడు ఎక్కువున్న మరో నటి కరాటే కళ్యాణి ఇంకా గొంతు విప్పలేదు. ఆమె కూడా ఏదో ఒక పదవికి పోటీ పడే అవకాశం మాత్రం ఉంది. మా అధ్యక్ష పదవికి పోటీ పడే వ్యక్తుల పేర్లు మరికొన్ని తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
య‘మా’ రసవత్తరం
గత దఫా ఎన్నికలు రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి మరింత రసవత్తరంగా ఎన్నికలు జరుగుతాయని ముందే సంకేతాలు అందుతున్నాయి. తాను మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు నటి హేమ ఈరోజు ప్రకటించారు. గతంలో ఆమె `మా` ఉపాధ్యక్షురాలిగా సంయుక్త కార్యదర్శిగా ఈసీ సభ్యురాలిగా పదవులు చేపట్టారు. అసలు ఈసారి ట్రెజరర్ పదవికి తాను పోటీ చేయాలనుకున్నానని, కానీ ఎందుకో తన ఆలోచన మారి అధ్యక్ష పదవి పైకి తన దృష్టి మళ్లిందని ఆమె చెప్పుకొచ్చారు. ‘పెద్దలంతా ఎలక్షన్ బరిలో దిగుతున్నారని తెలిశాక.. పెద్దల వివాదాల్లో మనమెందుకు చిక్కుకోవాలి.. పోటీపడాల్సిందే’అనుకున్నానన్నారు.
‘నిన్నటి ప్రకటన అనంతరం సినీప్రముఖుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నా. నేను ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు లేడీ సపోర్టర్స్ అంతా నన్ను మెజారిటీతో గెలిపించారు. సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదు.. నువ్వుంటే బావుంటుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలన్నా, అర్ధ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు.. అందుకే నువ్వే కావాలి అని అడుగుతున్నారు.
ఇండిపెండెంట్ గా పోటీ సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికోసం ఈసారి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నా’ అని హేమ వివరించారు. రేపు, ఎల్లుండి కూడా కొన్ని పేర్లు అధ్యక్ష పదవి కోసం తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం చూడటానికి సినిమాలు లేని తరుణంలో వీరే ఇప్పుడు సిని‘మా’ చూపించేస్తున్నారు. మెగా ఆశీర్వాదాలు ఎవరి మీద ఉంటాయో వారే గెలుపు గుర్రం ఎక్కే అవకాశాలు మెండుగా ఉంటాయి.
– హేమసుందర్
Must Read ;- మంచు విష్ణు ప్రపోజల్ కి జీవిత ఓకే చెబుతారా..?