మొన్నటివరకు మద్యం ధరలు.. తాజాగా పెట్రోల్ ధరలు.. దక్షిణాదిలో ఏపీలోనే ఇంధన ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా ఏపీలో వ్యాట్, పన్ను బాదుడుతో ఆ ధరలు మరింత పెరిగాయి. మంగళవారం విజయవాడలో పెట్రోలు ధర రూ.92.18 ఉండగా డీజిల్ రూ.85కి చేరింది. అంతర్జాతీయ విపణిలో అమెరికా డాలర్ తో రూపాయి మారక విలువ, ముడి ఇందన చమురు ధరల్లో వచ్చే మార్పులు రోజూ మారుతుంటాయి. అయితే గతంలో ఎన్నడూ లేని రీతి ఈ సారి ఆల్ టైం రికార్డు సాధించాయి.
బాదుడే.. బాదుడు..
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు విభాగాల్లో పన్నులు పెంచింది. కొత్త పన్నులు విధించింది. బాత్ రూంలకు పన్ను విధించి, ఆస్తిపన్ను, ఇంటిపన్ను, రాష్ట్ర రహదారులకు టోల్ వసూళ్లు ఇలా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న ఏ మార్గాన్నీ విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఏదో ఒక పథకం పెట్టి అకౌంట్ లో నేరుగా డబ్బులు వేస్తున్నట్లు చెబుతున్నా సామాన్యుడి జీవితంతో ముడిపడి ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల్లో పెంపు, ఇంటిపన్ను, ఆస్తి పన్ను ఇలా అన్ని పన్నులు పెంచారని, ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో లాగేస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. ఇక ఏపీలో పెట్రోల్ పై 31శాతం పన్ను, డీజిల్ పై 22.5శాతం పన్నులు వస్తూలు చేస్తోంది ఏపీ సర్కారు. అంతేకాకుండా రోడ్ డెవలప్ మెంట్ సెస్ కూడా వసూలు చేస్తుండడంతో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ముంబై రెండో స్థానంలో నిలిచింది.
Also Read ;- ప్రజలపై కరోనా సెస్సు .. ‘పన్ను’ పీకుతారట!
ఇక దక్షిణాదిలో చూస్తే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. లీటరు పెట్రోల్ లేదా డీజిల్ కు ఇప్పటికే అదనపు వ్యాట్ రూపేణా దాదాపు రూ.4చొప్పున వసూలు చేస్తుండగా రోడ్ డెవలప్ మెంట్ సెస్ తో మరో రూపాయిని వసూలు చేస్తోంది. అంటే లీటరు పెట్రోల్ లేదా డీజిల్ పై రమారమి రూ.5ని వసూలుచేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక లీటర్ డీజిల్ పై ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.24 కాగా పెట్రోల్ పై వచ్చే ఆదాయం రూ.33.5కి చేరింది. ఏపీతో సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలతో పోల్చితే ఏపీ రూ.3నుంచి రూ.5 ఎక్కువగా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు ధరలూ పెరిగాయి. బ్యారల్ ముడి చమురు ధర రూ..2శాతం పెరడంతో 55.75 అమెరికన్ డాలర్లకి చేరింది. డీజిల్ ధర ఏపీకంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నా.. పెట్రోల్ ధర ఏపీలోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ వ్యాట్ 34శాతం ఉన్నా.. ఏపీలో ఇతర పన్నులు ఎక్కువ కావడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.
అక్కడ వంద దాటినా..
ఇక దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.100దాటింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెట్రోల్ సెంచరీ కొట్టింది. అక్కడ బుధవారం ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటేసింది. సాధారణ పెట్రోల్ ధర లీటరుకు రూ.97.73 వద్ద ఉంది. ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా గతంలో పెట్రోల్ ధరలను తగ్గించేందుకు రాజస్థాన్ 4శాతం మేర వ్యాట్ ను తగ్గించింది. ఏపీ కూడా గతంలో 36శాతం ఉన్న వ్యాట్ ను 34కి తగ్గించినా.. తరువాత ఇతర పన్నులు, సెస్సుల కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు. అయితే ఇదే తరహాలో పెరుగుతూ ఉంటే.. పెట్రోల్ ధర సెంచరీ కొట్టడం పెద్ద కష్టం కాదనే చర్చ నడుస్తోంది. గత ఏడాది జూన్ 6వ తేదీ నాటికి ఏపీలో లీటర్ పెట్రోల్ ధర విజయవాడలో రూ.74.21, డీజిల్ ధర రూ.68.15గా ఉంది.
Also Read ;- జగన్ పెద్ద డెకాయిట్.. గాలిమీద కూడా పన్నులు పిండేస్తాడు