పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత తెరమీద కనిపించిన చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ రోజే అభిమానుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ మేరకు అంచనాల్ని అందుకుంది? ప్రేక్షకులకు ఏ రేంజ్ లో కనెక్ట్ అయింది అనే విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
పల్లవి (నివేదా థామస్), జెరీనా (అంజలి), దివ్య (అనన్య నాగళ్ళ) వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి హైద్రాబాద్ లో ఉద్యోగాలు చేస్తూ తమ లైఫ్ ను లీడ్ చేస్తున్న యువతులు. ఒక పార్టీ నుంచి తిరిగి వస్తూ … కార్ బ్రేక్ డౌన్ అవగా.. తెలిసిన కుర్రోళ్ళ సాయం తీసుకోగా…వారు అమ్మాయిల మీద లైంగిక దాడికి ప్రయత్నిస్తారు. వారిలో వంశీ (వంశీ కృష్ణ) అనే యువకుడిని పల్లవి తీవ్రంగా గాయపరుస్తుంది . దాంతో ముగ్గురు అమ్మాయిలు అక్కడి నుంచి వారి ఫ్లాట్స్ కు తిరిగి వెళ్ళిపోతారు. యం.పీ కొడుకైన వంశీ ఆ అమ్మాయిల మీద పగ పెంచుకొని వారిని అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తాడు. అంతేకాకుండా వారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతాడు. దాంతో ఆ ముగ్గురూ చిక్కుల్లో పడతారు. యం.పీ కొడుకు కాబట్టి.. వారి తరపున వాదించడానికి ఏ లాయరూ ముందుకు రాడు. దాంతో ఒకప్పుడు మంచి లాయర్ గా పేరుపొంది.. ప్రాక్టీస్ పక్కన పెట్టిన లాయర్ సత్యదేవ్ ఆ అమ్మాయిల కేసు టేకప్ చేస్తాడు. చివరికి ఆ వకీల్ సాబ్ ఆ అమ్మాయిలకు న్యాయం ఎలా చేస్తాడు అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు:
‘పింక్’ లాంటి క్లాసిక్ మూవీని పవర్ స్టార్ లాంటి హీరోతో రీమేక్ చేస్తున్నారనగానే.. ఒరిజినల్ వెర్షన్ లోని అసెస్స్ దెబ్బతింటుందేమో, పవర్ స్టార్ ఇమేజ్ ఎలివేషన్స్ లో దాని సోల్ మిస్ అవుతుందేమో అనుకున్న వారి సందేహాలు పటాపంచలు చేసే సినిమా వకీల్ సాబ్. మహిళల సాధక బాధకాలు.. సమాజంలో వారి పట్ల చిన్న చూపు చూసే వారికి చెంప పెట్టుగా నిలిచే ఆ కథాంశాన్ని వకీల్ సాబ్ అనే హీరోయిక్ టైటిల్ తో చెడగొడుతున్నారని .. ఈ సినిమా టీజర్ రిలీజైన టైమ్ లోనే మహిళా సంఘాలు గగ్గోలు పెట్టాయి. అయితే పవర్ స్టార్ లాంటి హీరో నటిస్తున్నాడు కాబట్టి.. ఆయన ఇమేజ్ కు తగ్గ రీతిలో ఎలివేషన్స్, బిల్డప్స్ ఉన్నా .. ఒరిజినల్ సోల్ ను ఏ మాత్రం చెడగొట్టకుండా.. దర్శకుడు వేణు శ్రీరామ్ డీల్ చేసిన విధానం మెప్పిస్తుంది.
ఒరిజినల్ లో ఏవైతే సీన్స్ సినిమాకి బలంగా నిలిచాయో.. అవే సీన్స్ మోతాదు ఇందులో కాస్తంత ఎక్కవనిపించినా.. వాటికి ఏ మాత్రం తగ్గకుండా నడిపించిన విధానం అభిమానులచేత విజిల్స్ వేయిస్తుంది. ఇక అమితాబ్ పింక్ లో సెటిల్డ్ గా నటించిన సన్నివేశాలన్నీ.. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ఆవేశంతో చేసినా.. సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అంతేకాదు పవర్ స్టార్ వక్తిగత జీవితానికి, సినిమాలోని సన్నివేశాలకు సింకయ్యేలా పలికించిన డైలాగ్స్ సినిమాకి ఆయువు పట్టుగా నిలుస్తాయి.
ఇక ఈ సినిమాలో కాస్తంత బలహీనంగా అనిపించిన సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే శ్రుతి హాసన్ లవ్ ట్రాక్, రొమాంటిక్ సన్నివేశాలు కాస్తంత బోర్ గా అనిపిస్తాయి. అంతేకాదు .. ఇంటర్వెల్ వరకూ సినిమా కాస్తంత స్లోగా నడిచిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండాఫ్ లో మొదలయ్యే కోర్ట్ సన్నివేశాలన్నీ మెప్పిస్తాయి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాశ్ రాజ్, డిఫెన్స్ లాయర్ పవన్ కళ్యాణ్ నువ్వా నేనా అన్నట్టు గా పెర్మామ్ చేసి.. బద్రి సినిమా సన్నివేశాల్ని గుర్తు చేశారు. మొత్తంగా పవర్ స్టార్ లాంటి హీరోకి తగ్గ చక్కటి కథతో సినిమాను రూపొందించారు. ఇది పవర్ స్టార్ కు బెస్ట్ కమ్ బ్యాక్ అని చెప్పాలి.
ఇక పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే.. మూడేళ్ళ పాటు ఆకలితో ఉన్నట్టుగా స్ర్కీన్ మీద తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఫస్టాఫ్ లో ఆయన నటన సాధారణంగా అనిపించినా..సెకండాఫ్ లో మొదలయ్యే కోర్ట్ సన్నివేశాల్లో చెలరేగిపోయారు. సిన్సియారిటీ తో కూడిన నటనతో అభిమానుల్నే కాకుండా.. సామాన్య ప్రేక్షకుల్ని సైతం మెప్పిస్తారు. ఇక పల్లవి గా నటించిన నివేదా థామస్ నటన గురించి చెప్పాలంటే.. సింప్లీ సూపర్ . ముఖ్యంగా అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. అలాగే.. జరీనాగా నటించిన అంజలి సైతం మంచి నటన కనబరిచింది. ఇంకా కేదార్, సమ్మెట గాంధి నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ గా ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విలక్షణ నటన ఈ సినిమాలో ప్రత్యేకంగా అనిపిస్తుంది.
ఇక తమన్ సంగీతం , నేపథ్య సంగీతం ‘వకీల్ సాబ్’ సినిమాకి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రత్యేకించి పవర్ స్టార్ కనిపించిన ప్రతీ సన్నివేశంలోనూ ఆయన .. మూడ్ కు తగ్గ బీట్ ను అందించి అద్భుతం అనిపిస్తాడు. అలాగే. పి.యస్. వినోద్ ఫోటోగ్రఫీ కూడా బాగుటుంది. మంచి విజువల్స్ తో తెరమీద రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి నిర్మాణ విలువలుగా కూడా బాగున్నాయి. టోటల్ గా వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ కే ప్రత్యేకంగా నిలిచిపోయేలా తెరకెక్కించాడు దర్శకుడు వేణు శ్రీరామ్.
హైలైట్స్ : కోర్ట్ రూమ్ డ్రామా, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ..
నటీనటులు : పవన్‌కల్యాణ్, శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, సమ్మెటగాంధి, కేదార్, వంశీ కృష్ణ తదితరులు.
సంగీతం: ఎస్. ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: పి. ఎస్. వినోద్,
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
డైలాగ్స్: తిరు,
యాక్షన్ : రవివర్మ,
వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్,
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి,
సమర్పణ: బోనీ కపూర్,
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ ,
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
రన్ టైమ్: 2 గంటల 35 నిమిషాలు
విడుదల : ఏప్రిల్ 9, 2021
ఒక్కమాటలో: పవర్ ఫుల్ సాబ్
రేటింగ్: 3.25 / 5
-ఆర్కే
ALSO READ :పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ కు డివైడ్ టాక్