ఏపీ పాలనలో ఎన్నెన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఏ అధికారికి ఏ పని అప్పగించారో, ఏ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు నిదర్శనంగా జగన్ మోహన్ రెడ్డి సర్కారు తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల సమస్యలు, వాటి పరిష్కారం, జర్నలిస్టులకు జారీ చేసే అక్రిడిటేషన్ల కోసం రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీ, జిల్లా స్థాయిల్లో కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీల్లో ప్రభుత్వం తరఫున అధికారులతో పాటు ఆయా మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు జగన్ సర్కారు కొత్తగా ఏర్పాటు చేసిన అక్రిడిటేషన్ కమిటీలో అసలు జర్నలిస్టులకే చోటు దక్కలేదు. ఈ తరహా వింత చర్యపై జర్నలిస్టు సంఘాలు నోరెత్తలేని పరిస్థితులు నెలకొన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఏపీలో వైసీపీ పాలన మొదలై ఇప్పటికే ఏడాదిన్నర దాటిపోతోంది. ఈ ఏడాదిన్నరలో ఓ దఫా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీ అంటూ ఓ ఉత్తర్వును జారీ చేసిన ప్రభుత్వం.. అందులో ఆయా పత్రికలు, టీవీ ఛానెళ్లకు చెందిన జర్నలిస్టులకు చోటు కల్పించింది. అంతేకాకుండా అంతకుముందు పాటించిన పద్దతిలోనే పలు శాఖల అధికారులకు కూడా చోటు కల్పించింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. సదరు కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాకుండానే రద్దైపోయింది. సదరు కమిటీని రద్దు చేస్తున్నట్లుగా జగన్ సర్కారు ఎక్కడా బయటకు చెప్పకుండానే గుట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీ ఇదేనంటూ మంగళవారం ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో కమిటీలో చోటు దక్కిన వారి వివరాలను కూడా పొందుపరచింది. ఈ జాబితాలో ఒక్కరంటే ఒక్క జర్నలిస్టు గానీ, జర్నలిస్టు సంఘాలకు చెందిన నేత గానీ కనిపించలేదు.
ఇక కమిటీలో జర్నలిస్టులు కాకుండా మరెవరు ఉన్నారన్న విషయంలోకి వస్తే… ప్రభుత్వంలోని పలు శాఖలకు చెందిన అధికారులే ఉన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ చైర్మన్ గా కొనసాగుతుండగా… కమిటీలో సభ్యులుగా కార్మిక శాఖ కమిసషనర్, వైద్య ఆరోగ్య శాఖ ఏడీ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, గృహ నిర్మాణ శాఖ పీడీ, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో, సమాచార శాఖ డైరెక్టర్లకు చోటు కల్పించారు. ఇక జిల్లా స్థాయిల్లోని కమిటీల్లో కూడా ఈ శాఖలకు చెందిన అధికారులే సభ్యులుగా ఉంటారని చెప్పిన ప్రభుత్వం… జిల్లా స్థాయి కమిటీలకు కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని పేర్కొంది. ఈ జాబితాలో ఒక్కరంటే ఒక్కరు కూడా జర్నలిస్టులు లేకపోగా… గతంలో కమిటీలో సభ్యుడిగా పోలీసు శాఖను కూడా పక్కన పెట్టేశారు. అయినా జర్నలిస్టుల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు చోటు కల్పించకపోవమేంటో తెలియదం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- సుప్రీంలో సంచలన పిటిషన్.. జగన్ బెయిల్ రద్దేనా?