ఏపీలో ఇప్పుడు నిజంగానే వింత పరిస్థితి నెలకొందని చెప్పాలి. గతంలో ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా… అప్పటిదాకా పూర్తయినా, పనులు కొనసాగుతున్నా… ఆయా ప్రాజెక్టులకు పేర్ల మార్పిడి అంతగా కనిపించేది కాదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ముందూ వెనుకా చూడకుండా అన్ని ప్రాజెక్టులకు కూడా పేర్లు మార్చేస్తోంది. ఈ తరహా ఒరవడిపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నా కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో కొన్నింటికి వైఎస్ఆర్ పేరు పెడుతుండగా, మరి కొన్నింటికి జగనన్న పేరును తగిలించేస్తున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే… అన్నింటికీ వైఎస్ఆర్ పేరే పడిపోతోంది.
బాగానే పేర్ల మార్పిడి
ఇటీవలి కాలంలో ఆయా ప్రాజెక్టుల పేర్ల మార్పిడి బాగానే ఊపందుకుంది. అందులో భాగంగా ఇప్పటికే రెండు ప్రాజెక్టుల పేర్లను జగన్ సర్కారు మార్చి పారేసింది. గుంటూరు జిల్లాలో పౌరుషాల గడ్డగా పేరు గాంచిన పల్నాడు ప్రాంతానికి సాగు, తాగు నీటిని అందించేందుకు ఉద్దేశించిన పల్నాడు ఎత్తిపోతల పథకాన్ని చాలా ఏళ్ల క్రితమే ప్రారంభించారు. అయితే ఆ ప్రాజెక్టు పనులు నాన్ స్టాప్‌గా కొనసాగడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాజెక్టులో కొంతమేర పనులు చేయడం, ఆ తర్వాత మరిచిపోవడం జరుగుతూ వస్తోంది. అయినా ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పేరును మార్చే యత్నం చేయలేదు. ఇప్పుడు అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ పథకం పేరును మార్చి పారేసింది. పల్నాడు ఎత్తిపోతల కాస్తా… వైఎస్ఆర్ ఎత్తిపోతలగా మారిపోయింది.
Also Read ;- నా కారు ఆపుతావా : వైసీపీ మహిళా నేత దాష్టీకం
ఇక కరువు సీమ రాయలసీమ దుర్భిక్షానికి సాక్షిగా నిలుస్తున్న అనంతపురం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగు నీటిని అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పేరును పెట్టింది. పేరూరు కేంద్రంగా కట్టే ఈ ప్రాజెక్టు కోసం తాను బతికుండగా పరిటాల రవి తనదైన శైలిలో పోరాటం చేశారు. పరిటాల సేవలను గుర్తించిన గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆయన పేరునే పెట్టింది. ఇదేమీ పట్టని జగన్ సర్కారు… ఈ ప్రాజెక్టు పేరులోని పరిటాల రవీంద్ర పదాలను తీసేసి… వాటి స్థానంలో వైఎస్ఆర్ పేరును చేర్చేసింది. పరిటాలకు అనంతపురం జిల్లాలోనే కాకుండా యావత్తు తెలుగు నేల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. జగన్ సర్కారు పేరూరు ప్రాజెక్టు పేరులోని పరిటాల రవీంద్ర పేరును తీసేసి వైఎస్ఆర్ పేరును చేర్చిన విషయాన్ని తెలుసుకున్నంతనే వారంతా జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు గుర్తుగా నిలుస్తున్న ప్రాజెక్టుల పేర్లను మార్చుకుంటూ పోతున్న జగన్ సర్కారు… ఎక్కడికక్కడ అశాంతిని రేకెత్తిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- దందాలు ఆగకుంటే కష్టం.. వైసీపీ పెద్దల ఆందోళన!