చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ .. హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నాగబాబు అల్లుడు ‘చైతన్య‘ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే నాగబాబు కూతురు నిహారిక వివాహం చైతన్యతో జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలపై అభిమానులు ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. వాళ్లలో టాలెంట్ ఉండాలేగానీ, చకచకా మార్కులు వేసేస్తుంటారు. కథాకథనాల్లో బలం ఉండాలేగానీ, ఎంతమాత్రం ఆలోచించకుండా సక్సెస్ ను దోసిట్లో పెట్టేస్తారు.

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ .. వివాహం తరువాత పెద్దగా ఆలస్యం చేయలేదు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే తన మనసులోని మాటను ఆయన చిరంజీవికి చెప్పడం .. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడం జరిగిపోయాయి. అందుకు సంబంధించిన పనులు చాలా చురుకుగా జరిగిపోయాయి .. ‘విజేత’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో ‘విజేత’ ఒకటిగా కనిపిస్తుంది. అదే టైటిల్ తో ఆయన చిన్నల్లుడి సినిమా రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ సినిమాతో నటన పరంగా కల్యాణ్ దేవ్ పాస్ మార్కులు సంపాదించుకున్నాడు. త్వరలో ‘సూపర్ మచ్ఛి’తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో నాగబాబు అల్లుడు చైతన్య కూడా నటన పట్ల ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే చిత్రపరిశ్రమలో లభించే క్రేజ్ వేరు .. ఇక్కడ లభించే స్టేటస్ వేరు. అందువలన ఆయన కూడా సినిమాల వైపు రావాలని అనుకుంటున్నాడట. అదే విషయాన్ని ఆయన నాగబాబుతో చెప్పేయడం జరిగిపోయిందట. చైతన్యను దృష్టిలో పెట్టుకుని కథలు వినే పనిలో నాగబాబు ఉన్నాడని అంటున్నారు. నటనకు సంబంధించి చైతన్యకి సూచనలు .. సలహాలు ఇవ్వడానికి నిహారిక – వరుణ్ తేజ్ ఎలాగూ ఉన్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాదిలో చైతన్యను తెలుగు తెరపై హీరోగా చూసెయ్యొచ్చన్న మాట.
Must Read ;- పెళ్లి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిహారిక
https://www.youtube.com/watch?v=4alNaggZ7iE











