గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పార్టీల మధ్య ఫ్లెక్సీల విషయం రచ్చరచ్చ అవుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నగరంలోని అన్ని హోర్డింగ్‌లు , బ్యానర్ స్పేస్‌లను తీసుకుందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ బ్యానర్లు , హోర్డింగ్‌లే కనిపిస్తున్నాయని.. అధికార దుర్వినియోగంతో విపక్షాలు పెట్టుకునేందుకు కనీసం స్పేస్ లేకుండా చేసాయంటున్నారు. కొందరు మంత్రులు ప్రైవేటు కంపెనీలకు హెచ్చరికలు జారీ చేస్తూ మరే పార్టీ హోర్డింగ్‌లు పెట్టుకోకుండా అడ్డుపడుతున్నారంటున్నారు. పథకం ప్రకారమే ముందస్తుగా అన్ని హోర్డింగ్ స్పేస్‌లను కబ్జా చేశారని విమర్శిస్తున్నారు. ముందుగానే యాడ్ ఏజెన్సీలతో మాట్లాడి ఇలా చేయడం ఎంత వరకు సమంజసం అంటున్నారు.
బ్యానర్లు చింపిన ఎంపీ అరవింద్..
ఇక టీఆర్ఎస్ బ్యానర్లపై ఎంపీ అరవింద్ ప్రత్యక్ష పోరుకు దిగారు. ఆయనే స్వయంగా రోడ్డపై దిగి బంజారాహిల్స్‌లో టాయిలెట్స్ పై టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్‌ను చించేశారు. ఎన్నికలు అందరికీ ఉన్నాయని.. అందరూ ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అధికారులు , మంత్రులు ప్రైవేటు కంపెనీలను వార్నింగ్‌లు ఇస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదంటున్నారు. ఇక స్వయంగా రంగంలోకి దిగి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న బ్యానర్లను తొలగిస్తామంటున్నారు . ఏమైనా తాను అండగా ఉంటానని.. టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను ఎదుర్కొనేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన సూచించారు.
భవిష్యత్‌లో అధికారులు కేసులు ఎదుర్కోక తప్పదు..
టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రుల ఆదేశాలకు భయపడి ఇతర పార్టీల హోర్డింగ్‌లు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వని అధికారులు భవిష్యత్‌లో కేసులు ఎదుర్కోక తప్పదని బీజేపీ నేతలు హెచ్చిరిస్తున్నారు. ఎన్నికల సమయంలో టెండర్లను పిలిచి హోర్డింగుల ద్వారా డబ్బులు రాబట్టుకోవాల్సిన జీహెచ్ఎంసీ ఎందుకు అలా ఒక పార్టీకే అన్ని హోర్డింగ్ లను కట్టబెట్టిందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రానున్న రోజుల్లో చట్ట పరంగా పోరాడతామని హెచ్చరిస్తున్నారు. అయితే, ధర్మపురి అరవింద్ బ్యానర్లను చింపడంపై టీఆర్ఎస్ పార్టీ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అరవింద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఎన్నికల నియమావళిని ఉళ్ళగించారని .. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Must Read ;- 100 కోసం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘గులాబీ’ స్కెచ్!











