ఏపీలో వైసీపీ పాలన ఎలా సాగుతోంది? ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని వారిపైనే ప్రయోగిస్తున్నారు. ఐదేళ్లలో ఒక్కసారి విద్యుత్ చార్జీలు పెరిగితేనే గగ్గోలు పెడుతుంటే.. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఐదు సార్లు విద్యుత్ చార్జీలు పెరిగిపోయాయి. అధికార పార్టీ ఆగడాలను విమర్శిస్తే.. దాడులు తప్పవన్నట్లుగా ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటిపైకే దాడులకు తెగబడుతున్నారు. అంతేనా.. తమ దాడిలో గాయపడ్డ బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు శాఖ.. అధికార పక్షానికి కొమ్ము కాస్తూ విపక్షాలపై కేసులు పెడుతోంది. దాడులకు తెగబడిన వారిని వెనకేసుకుని వస్తోంది. అక్కడితో అయినా ఆగకుండా.. అధికార పార్టీ దారుణాలను వెనకేసుకుని వస్తూ.. అధికార పార్టీ దాడులకు వక్ర భాష్యాలు చెబుతోంది. చివరకు అకిల భారత సర్వీసుకు చెందిన ఐపీఎస్ అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వెరసి గతంలో ఎన్నడూ లేని రీతిలో, దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో దుర్మార్గ పాలన సాగుతోందన్న ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహా పాలనపై ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ ఆది నుంచీ తనదైన శైలి పోరాటాన్ని సాగిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని రీతిలతో టీడీపీ ఓ సరికొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘‘ఒక్క మాట.. ఒక్క క్షణం ఆలోచించండి’’ అంటూ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్న టీడీపీ.. జగన్ సర్కారు పాలనా తీరుపై పార్టీ నేతలతో వరుసబెట్టి వీడియోలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన కీలక నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గద్దె రామ్మోహన్ రావు, నక్కా ఆనందబాబులతో బుధవారం ఓ మూడు వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సోమిరెడ్డిదే తొలి వీడియో..
ఈ కొత్త తరహా ఉద్యమంలో భాగంగా తొలి వీడియోగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీడియో విడుదలైంది. ఇందులో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం హోదాలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటిపైకి దాడికి వెళ్లిన వైసీపీ శ్రేణుల తీరును సోమిరెడ్డి వివరించారు. రాళ్లు, కర్రలు కార్లలో వేసుకుని చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్.. చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లానని చెప్పిన తీరును ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులు ఇచ్చిన వివరణను కూడా సోమిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంలో ఉన్న నేతలకు విపక్షాలకు చెందిన నేతలు ఫిర్యాదు చేస్తారా? లేదంటే విపక్ష నేతలకు అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ.. పార్టీ నేతల చేతుల్లో దాడులకు గురైన విపక్షానికి చెందిన కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన వైనాన్ని కూడా సోమిరెడ్డి తూర్పారబట్టారు. ఈ తరహా దుర్మార్గ పాలనను ఏపీ ప్రజలే కాకుండా యావత్తు దేశం కూడా ప్రత్యక్షంగా చూసిందని చెప్పిన సోమిరెడ్డి.. పోలీసులు ఖాకీ డ్రెస్సులు విప్పేసి వైసీపీ కండువాలు కప్పుకుంటే సరిపోతుందేమోనని సెటైర్లు సంధించారు.
Must Read ;- టీడీపీ యువ సత్తాను ఆపతరమా?
విద్యుత్ చార్జీలపై గద్దె విమర్శలు
ఇక టీడీపీ విడుదల చేసిన రెండో వీడియోలో పార్టీ సీనియర్ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విద్యుత్ చార్జీలపై తనదైన మార్కు విశ్లేషణ చేశారు. ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఐదేళ్ల పాలనలో ఒక్కసారి విద్యుత్ చార్జీలు పెంచినా.. ఆ ఐదేళ్లలో పెద్దరచ్చే జరిగేదని ఆయన గుర్తు చేశారు. అయితే జగన్ పాలనలో కేవలం రెండున్నరేళ్ల పాలనలోనే ఏకంగా ఐదు సార్లు విద్యుత్ చార్జీలను పెంచారంటే.. జగన్ పాలన ఏ రీతిన సాగుతుందో అర్థమవుతోందంటూ విమర్శలు గుప్పించారు. గతంలో జుట్టుకు పన్ను విదించిన వైనాన్ని ప్రస్తావించిన గద్దె.. జగన్ పాలనలో విద్యుత్ చార్జీల పెంపునకు ట్రూ అప్ చార్జీలంటూ కొత్త పదం వాడారని ఈ తరహా పెంపు ఎప్పుడూ కనిపించలేదని చెప్పుకొచ్చారు. జుట్టు పన్ను విషయంలోనూ జట్టు పెంచుకుంటే పన్నేస్తారా? జుట్టు కత్తిరించుకుంటే పన్నేస్తారా? గుండు చేయించుకుంటే పన్నేస్తారా? అన్న అయోమయం ఉండేదని.. అలాగే ఇప్పుడు కూడా జగన్ పాలనలో ఏ కారణంతో విద్యుత్ చార్జీలను పెంచుతున్నారో కూడా తెలియడం లేదని కూడా గద్దె రామ్మోహన్ రావు.. జగన్ సర్కారు తీరును తూర్పారబట్టారు.
ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులా?
ఇక మూడో వీడియోలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.. జగన్ సర్కారు నమోదు చేస్తున్న కేసులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఏకంగా ఎస్సీలు, ఎస్టీలపైనే నమోదు చేస్తున్న వైనంపై నిప్పులు చెరిగారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ ను వేధింపులకు గురి చేసి చనిపోయేలా చేసిన జగన్ సర్కారు తీరును, అమరావతి ఉద్యమంలో పాలుపంచుకున్న దళిత, గిరిజన రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసిన తీరుపై ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సొంత జిల్లాలో ఓ ఎస్సీ మహిళను అత్యాచారం చేసి హత్య చేస్తే.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సందర్భం ఏదైనా, కారణం ఏదైనా కూడా తమ చర్యలను ప్రశ్నిస్తున్న వారు ఎవరన్న ప్రస్తావన లేకుండా అందరిపైనా అట్రాసిటీ కేసులను పెట్టిన తీరును ఆనంద్ బాబు దుమ్మెత్తిపోశారు. మొత్తంగా టీడీపీ చేపట్టిన ఈ కొత్త తరహా ఉద్యమం దెబ్బకు అధికార వైసీపీ చేష్టలుడిగిపోయి చూడటం మినహా చేసేదేమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- విద్యుత్ చార్జీల పెంపుతో ఏపీ ప్రజలపై పెను భారం పడింది.











