బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించాక దబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడం, జీహెచ్ఎంసీలో గణనీయమైన స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ తెలంగాణలో స్పీడ్ పెంచింది. విజయశాంతి, స్వామిగౌడ్ లాంటి తదితర నేతలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ మరికొందరు నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెబుతూ.. వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకుంటున్న బీజేపీ స్పీడ్‌కి పాలమూరులో కొంత బ్రేక్ పడిందని చెప్పవచ్చు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలోనే.. పాలమూరు జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ రాజీనామా చేసి సంచలనానికి తెర లేపారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. తన రాజీనామాకు కారణాలను తరువాత చెబుతానని మీడియాతో ఎర్ర శేఖర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శేఖర్‌కు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానమైన టేబుల్‌పై ముఖ్య నేతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడం, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎర్రశేఖర్‌కు అక్కడ స్థానం ఇవ్వకపోవడంతో ఆయన అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందు షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ ప్రెస్ మీట్ ఉంది. అయితే, ఆదివారం షెడ్యూల్ మారింది. ప్రెస్ మీట్ కాన్సిల్ అయింది. ఆ విషయం ఎర్ర శేఖర్‌కు తెలియకుండానే..జిల్లాలో మరి కొందరు నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు.
గతంలోనూ అవమానమే..
బీజేపీలో ఇటీవల అసమ్మతి పెరుగుతోందనే చర్చ మొదలైంది. కమిటీల ఏర్పాటుతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు విషయంపై బండి సంజయ్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులే విమర్శించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే దీనిపై మాట్లాడారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వ్యక్తిగత ఆరోపణలు వచ్చి రాజీనామా చేయడమే తప్ప..జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్నవారెవరూ ఇటీవల రాజీనామా చేయలేదని చెప్పవచ్చు. అలా రాజీనామా చేసింది ఎర్ర శేఖర్ మాత్రమే అని చెప్పవచ్చు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం జిల్లా కమిటీలను బీజేపీ ప్రకటించింది. అందులో పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర శేఖర్ పేరు ఒక్కటే ప్రకటించారు. మిగతా కార్యకవర్గం పేర్లను ప్రకటించలేదు. దీంతో జిల్లాలో ఎవరెవరిని తాను కలుపుకొని వెళ్లాలనే అంశంపై ఎర్ర శేఖర్ సతమతమవుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భావిస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన డీకే అరుణ, జితేందర్‌రెడ్డి లాంటివారు పార్టీలో కీలకంగా ఉన్నారు. వారు చెప్పిన అంశాలకే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని గతం నుంచి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్ర శేఖర్ నొచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తన మాటకు కనీస విలువ లేకపోవడం, పేరుకి పదవి ఇచ్చి..మూలన కూర్చోబెట్టారన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ ఉందో లేదో కూడా సమాచారం ఇవ్వకపోవడం, కనీస పార్టీ ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిచి..
ఇక ఎర్ర శేఖర్ గతేడాదే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మొదట్లో టీడీపీ నుంచి 1995లో ధన్వాడ ఎంపీపీగా పని చేసిన ఎర్ర శేఖర్ దివంగత ఎమ్మెల్యే ఎర్ర సత్యం సోదరుడు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉండగానే ఎర్ర సత్యం మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఎర్ర శేఖర్ గెలుపొందారు. 1999లో, 2009లో ఎమ్మెల్యేగా గెలవగా, 2004, 2014, 2018లో ఓడిపోయారు. 2019 ఆగస్టులో బీజేపీలో చేరారు.
ఇక మొదలేనా..
కాగా ఈ పరిణామాలు రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీలో ఇప్పటి వరకు అంతర్గత కుమ్ములాటలు బయటకు రాలేదు. నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ వర్సెస్ యెండల పోరు నడుస్తోందని చర్చ నడుస్తున్నా బహిరంగంగా ఎక్కడా పార్టీ నాయకులు వ్యాఖ్యానించలేదు. తమ పార్టీలో ఇలాంటి ఇంటి పోరు ఇష్యూలు ఉండవని బీజేపీ చెబూతూ వస్తోంది. ఇతర పార్టీలపైనా ఇదే అంశంపై బీజేపీ విమర్శలూ చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లో ఉన్నట్లే బీజేపీలోనూ కొందరి ఆధిపత్యమే నడుస్తోందనే విమర్శలకు..ఎర్ర శేఖర్ రాజీనామా బలం చేకూర్చుతోంది. మరోవైపు ఎర్ర శేఖర్ పాలమూరు జిల్లాలో ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రానున్న కాలంలో పార్టీకి కూడా నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ విషయంపై పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: కేసిఆర్ పై నిప్పులు చెరిగిన విజయశాంతి