‘నేను ఉన్నాను..నేను విన్నాను..ఇదీ జగన్ ఇచ్చే హామీ.. అయితే ఈ మాటలు వినేందుకు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బాగానే ఉన్నాయి.. కాని ఆచరణలో వైఎస్ జగన్ మాత్రం మాట తప్పడం.. మడమ తిప్పడం సాధారణమైందనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని అమరావతి విషయంతో మొదలు పెడితే తాజాగా జరిగిన ‘దివీస్’ ఘటన వరకు ఎన్నో ఉదంతాలను ప్రత్యర్థి పార్టీలు తెరపైకి తెస్తున్నాయి. ఇక దివీస్ ఘటన విషయానికి వస్తే.. కంపెనీ ఏర్పాటుపై వ్యతిరేకతకు తోడు కంపెనీని తరలిస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్ .. అధికారంలోకి వచ్చాక.. ఆయనే కంపెనీ శంకుస్థాపనకు సిద్ధం కావడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
అప్పుడు జగన్ ఏం చెప్పారంటే..
ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. 2018 ఆగస్టు 11న తూర్పు గోదావరి జిల్లా తునిలో జగన్ మాట్లాడిన మాటలు గుర్తుచేయాల్సి ఉంటుంది. ఆ రోజు జగన్ తునిలో మాట్లాడుతూ ‘ కాకినాడ ఎస్‌ఈజెడ్ గురించి ఇక్కడి వారు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడే ఏరువాక చేశారు. ఆయన రైతులకు భూములు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. చంద్రబాబు బినామీ కంపెనీ అయిన దివీస్ ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడం లేదని ఇక్కడి రైతులపై కేసులు పెడుతున్నారని చెబుతున్నారు. ఆ విషయం వినగానే చాలా బాధ అనిపించింది. గతంలో చంద్రబాబు కాకినాడ SEZ జగన్ ది అని ఆరోపించారు కదా.. ఇప్పుడే ఆ జగన్ నే చెబుతున్నా.. ఆ భూములు రైతులకు ఇచ్చేయండి. ఫార్మా కంపెనీలు రావడం తప్పు కాదు.. కాని అవి ఫార్మాసిటీలో ఉండాలి. అలాంటిది హేచరీస్ పక్కన ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు నష్టం చేస్తున్నారు. మేం అధికారంలోకి రాగానే కంపెనీని తరలిస్తాం. రైతుల భూములు వెనక్కి ఇస్తాం.. రొయ్యల సీడ్ బాగుండాలంటే.. సముద్రపు నీరు స్వచ్ఛంగా ఉండాలి.’ అని చెప్పారు జగన్.
Must Read ;- ‘దివీస్’ వద్దని రైతులు, మత్స్యకారుల నిరసన.. పోలీసులు లాఠీ ఛార్జి
మరి ఇప్పుడేం జరిగింది..
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట- కొత్త పాకల పరిధిలో నిర్మించే దివీస్ లేబొరేటరీపై అప్పట్లో జగన్ హామీ ఇచ్చినా.. అధికారంలోకి వచ్చాక తరలింపు అంశం పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆందోళనకూడా జరుగుతోంది. అయితే డిసెంబరు 7న ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం జగన్ రానున్నారని సమాచారం రావడంతో అధికారులు జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. దీంతో ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వామపక్షాలు కూడా ఆ ఆందోళనకు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే విడుదలచేయాలన్న డిమాండ్ తో ఆందోళనకారులు కంపెనీ ప్రధాన గేటుముందు గురువారం ఆందోళన మొదలుపెట్టారు. దివీస్ వద్దు అని నినాదాలు చేస్తూ.. ప్రహరీని కూల్చివేశారు. కొన్ని కంటైనర్లను, జనరేటర్లను ధ్వంసం చేశారు.
రూ.1500 కోట్లతో 500 ఎకరాల్లో..
ఇక్కడ రూ.1500కోట్లతో ల్యాబొరేటరీ ఏర్పాటుకు దివీస్ సిద్ధమైంది. అందుకు గాను 2015లో 500ఎకరాల భూమి కావాలని అప్పట్లో ఏపీఐఐసీని కోరగా.. 200ఎకరాల సేకరణ జరిగింది. తరువాత ఆందోళనల కారణంగా భూ సేకరణ ఆగిపోయింది. అప్పటికే స్థానికంగా వ్యతిరేకత ఉంది. ఇక 2018లో జగన్ పర్యటన తరువాత రైతులు, మత్య్సకారులు కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఇచ్చిన హామీ మర్చిపోయారని, అధికారంలోకి రాగానే మాటమార్చారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- జగన్ ‘సోషల్’ గా దిగజారాడా.. నేతల బాటలోనే క్యాడర్