దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో పాగా వేసేందుకు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటోంది. పశ్చిమ బెంగాల్ లో పాగాకు 2019లోక్ సభ ఎన్నికలనుంచే వ్యూహాలు అమలుచేస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్లుగానే తమ విభాగాలను రంగంలోకి దింపింది. విద్యార్థి, ఉద్యోగసంఘాలతోపాటు మరికొన్ని తమ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపింది. బీజేపీని అడుగుపెట్టనిచ్చేది లేదని సీఎం మమతా బెనర్జీ పట్టుబడుతోంది. దీంతో అక్కడ రెండు పార్టీల మధ్య ఘర్షణలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఘర్షణల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.
రెండురోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్ పై 24పరగణాల జిల్లాలో దాడి జరగడంతో బీజేపీ దూకుడు మరింత పెంచింది. వెంటనే కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. గవర్నర్ ను కేంద్రం నివేదిక కోరింది. కొన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ సీఎం పోరు అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన నివేదికను ఎలా పంపించి ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ధిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై మమత తీవ్రంగా స్పందించారు. తమ సీఎస్, డీజీపీలు వచ్చే అవకాశం లేదని రిప్లై ఇప్పించారు దీదీ.
అంతేకాదు.. బీజేపీకి వేరే పని లేదు.. ఒకసారి హోం మంత్రి వస్తారు.. మరోసారి నడ్డా.. బడ్డా.. అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో గవర్నర్ ఆ వ్యాఖ్యలు సరికాదని, హుందాగా ఉండాలని చెప్పడంతో దీదీ మరింత రెచ్చిపోయారు. బీజేపీ తరఫున గవర్నర్ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిలిగురిలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆ పార్టీ పశ్చిమబెంగాల్ పర్యవేక్షకుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య డైరక్ట్ అటాక్ కి దిగారు. ‘ఈ ఘటనను మర్చిపోము దీదీ..మీ పోలీసులతో మాపై బాంబులు వేయిస్తారా.. పోలీసుల వల్లే మా కార్యకర్త చనిపోయాడు. మేం ఏంటో చూపిస్తా’మని సవాలుచేశారు.
బీజేపీ ర్యాలీలకు ప్రజలు రాకుంటే.. ఇలా రాద్ధాంతం చేసి రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని టీఎంసీ ప్రతివిమర్శకు దిగింది. ఇలా రోజుకోఘటన జరుగుతుండడంతో రాష్ట్రంలోనూ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది.
Must Read ;- మోదీ దగ్గరవ్వాలంటే.. ప్రశాంత్ కిషోర్ దూరం కావాలా..
టార్గెట్ కోసం బీజేపీ
వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ కొన్నాళ్లుగా వ్యూహాలు రచిస్తోంది. అంతకుముందు అంటే.. 2011కి ముందుకూడా పశ్చిమబెంగాల్ లో ఇదే పరిస్థితి ఉండేది. 34 ఏళ్ల పాటు వరుసగా కమ్యూనిస్టులు పాలించారు. వామపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి దాదాపు దశాబ్దం పాటు పోరాడారు. 2007లో టాటా కార్ల తయారీ కర్మాగారంతో పాటు ఇండొనేషియా కంపెనీలకు భూములిచ్చే వ్యవహారంలో నందిగ్రామ్, సింగూరు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనలకు మమత మద్దతు పలికారు. ఇప్పుడు కూడా పశ్చిమబెంగాల్ లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కారణం వేరైనా.. లక్ష్యం ఒక్కటిగానే ఈ వివాదాలు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ చర్చ మొదలైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 22 టీఎంసీ గెలవగా, 18 బీజేపీ, 2 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి. 18సీట్లు గెలవడం, కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ తమ ఎంపీలను పార్టీ విస్తరణపై లక్ష్యాలను నిర్దేశించినట్లు ప్రచారం జరిగింది.
Also Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు
రంగంలోకి ఓవైసీ
మరోవైపు బీహార్ లో ఐదు సీట్లు గెలవడం, కాంగ్రెస్ కూటమికి చెందిన దాదాపు 22మంది అభ్యర్థుల ఓటమికి కారణంగా చెబుతున్న ఎంఐఎం కూడా రంగంలోకి దిగింది. రానున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు అమలుచేయడం మొదలు పెట్టారనే చర్చ నడుస్తోంది. ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పశ్చిమబెంగాల్ లోని తమ పార్టీ నాయకులను గురువారం హైదరాబాద్ కు రప్పించి మాట్లాడారు. దాదాపు 6గంటలకుపైగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో 60కి పైగా స్థానాల్లో ఓ వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అంటే వాటిల్లో కనీసం 30చోట్ల కచ్చితంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఆ వర్గం ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీని గెలిపించుకోవడం, విస్తరించుకోవడం లక్ష్యంగా ఓవైసీ వ్యూహాలు అమలుచేయడం ప్రారంభించారని తెలుస్తోంది.
మమత అలర్ట్..
బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు మమతకు పాత ప్రత్యర్థులే. కాని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం ఒంటరిగా బరిలోకి దిగే సూచనలు ఉండడం, బీహార్ లో ఆపార్టీ అమలుచేసిన వ్యూహాల నేపథ్యంలో మమత బెనర్జీ అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటివరకు మమత పార్టీ టీఎంసీ గెలిచేందుకు ఆ వర్గాల ఓట్లే కారణం. అందుకోసమే మమత బెనర్జీ సీఏఏలాంటి చట్టాల అమలుకు ససేమిరా అంటున్నారన్న చర్చ కూడా ఉంది. ఇక ఎంఐఎం రంగంలోకి దిగితే.. తమ పార్టీకి రావాల్సిన ఓట్లను ఎక్కడ ఎంఐఎం చీల్చుతుందోనన్న అనుమానం కూడా టీఎంసీలో మొదలైంది. అందుకే భేషజాలు పక్కనపెట్టి మజ్లీస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మమతా బెనర్జీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read ;- గడ్డంపై ఇష్టమా? సెంటిమెంటా? రాజకీయ అవసరమా?