ఎవరు నేర్పేరమ్మ దేవులపల్లికి……
బతుకు పాటలా సాగాలన్నారు దేవులపల్లి క్రష్ణశాస్త్రి గారు. ఆయన రాసిన పాటలు వింటే మాత్రం బతుకు మీద ఆశ పుడుతుంది. బతుకు మీద ప్రేమ పెరుగుతుంది. బతుకు మీద మమకారం ఎక్కువవుతుంది. తెలుగు భాషకి ఇంత తియ్యదనం ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. భావ కవిగా.. అనంతర కాలంలో సినీ కవిగా మారిన దేవులపల్లి క్రష్ణశాస్త్రి గారు తెలుగు సినిమా కోసం రాసిన పాటలు వింటే శ్రీశ్రీ మాటలు నిజమనిపిస్తుంది. క్రష్ణశాస్త్రి గారు స్వర్గస్తులైనప్పుడు శ్రీశ్రీని పత్రికల వారు (మీడియా కాదు.. పత్రికలే.. టివీలొచ్చాకే మీడియా ప్రారంభమైంది) రెండు ముక్కలు చెప్పండి అంటే ^షెల్లీ మళ్లీ మరణించాడు^ అని చెప్పారట. పి.బి. షెల్లీ ఆంగ్ల కవిత్వం చదివిన వారికి.. దేవులపల్లి వారి గొప్పతనం తెలుస్తుంది. సరే ఇంతకీ.. విషయంలోకి వస్తే ఈ ముత్యాల స్వరాలు.. పాటల పందిరిలో ముందుగా దేవులపల్లి వారి పాటతోనే ప్రారంభించాలి అని ఓ ఆశ. ఆయన రాసిన అనేకానేక పాటల్లో అద్భుత గీతం గురించి సమీక్షించడం అనే కంటే గుర్తు చేసుకుందాం. శ్రీశ్రీ కవిత్వాన్ని తూచడానికి తన దగ్గర తూనిక రాళ్లు లేవంటాడు చలం మహాప్రస్థానం ముందు మాటలో. అలాగే దేవులపల్లి వారి కవిత్వం తూచేందుకు కూడా ఎవరి దగ్గరా తూనికరాళ్లు ఉండవు. ఆ సాహిత్యాన్ని అనుభవించి పరవశించాలి. అంతే. దేవులపల్లి వారి అద్భుత గీతం ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ గురించి తెలుసుకుందాం.
ఈ పాట ఈనాటి బంధం ఏనాటిదో సినిమాలోది. ఈ సినిమా 1977 సంవత్సరంలో విడుదలైంది. ఇందులో హీరో క్రష్ణ ఓ వీధి రౌడీ. హీరోయిన్ జయపద్ర రాజవంశానికి చెందినది. అయితే కొన్ని కారణాలతో ఆమె నిరుపేద జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆమె ఆస్తిని కొట్టేయడానికి విలన్లు అనబడే నాగభూషణం వంటి వారి పన్నాగంతో హీరోతో హీరోయిన్ కు పెళ్లి చేస్తారు. మొరటు వాడైన హీరో ఎలా మారాడు అనేది.. విలన్ల భరతం ఎలా పట్టాడనేది చిత్ర కధ. అది మనకు అనవసరం. ఇక ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ పాట విషయానికి వస్తే ఉదయాన్నే నిద్ర లేచిన హీరోయిన్ జయప్రద దేవుడ్ని కొలుస్తూ పాడే పాట ఇది. అద్భుత సాహిత్యం ఉన్న ఈ పాట తెలుగు వారికి గర్వ కారణం. ఇందులో భక్తితో పాటు భర్త పట్ల అనురాగం కూడా మేళవించి రాసారు దేవులపల్లి వారు. బిళహరి రాగంలో సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను సుశీల ఎంతో అద్భుతంగా గానం చేశారు.
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
కొలువైతివా దేవి నాకోసము …..
కొలువైతివా దేవి నాకోసము
తులసీ ….. తులసీ దయాపూర్ణకలశీ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ….. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి …..
మొల్లలివి నన్నేలు నా స్వామికి
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …..
ఏ లీల సేవింతు ఏమనుసు కీర్తింతు …..
ఏ లీల సేవింతు ఏమనుసు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల ….. ఒక దివ్వె నీ మ్రోల …..
ఒక పువ్వు పాదాల ….. ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం …..
ఇదే వందనం …..
ఈ పాటంతా కవిత్వం.. భక్తి.. ప్రేమా నిండిపోయింది. శ్రీహరి పూజకు వేళయ్యిందని ఈ పూరెమ్మలకు ఎవరు చెప్పారో పూలిమ్మని అంటారు దేవులపల్లి. పూరెమ్మలకు చెప్పడం అనే ప్రయోగమే అద్భుతం. ప్రొద్దు పొడవకుండానే పూలిమ్మని కూడా ఎవరు చెప్పారు. అంటే ప్రొద్దు పొడిచిందంటే పూజా సమయం ముగిసినట్లేనట. అందుకే ప్రొద్దు పొడవకుండానే పూలు పూసాయి అంటారు మహాకవి.
మొదటి చరణంలో కొలువైతివా దేవి నా కోసమూ… తులసీ దయాపూర్ణ కలసి
అంటారు. హీరోయిన్ ఈ చరణాన్ని తులసీ కోట దగ్గర నుంచి పాడుతుంది. ఈమె తులసీ కోట దగ్గరకు వెళ్లే సరికి దయకురిపించే ఈ చల్లని తల్లి కొలువై సిద్ధంగా ఉందట. ఈమె చేసే పూజ కోసం అమ్మవారు వేచి చూడడం అనే భావన ఈమె భక్తికి పరాకాష్ట.
రెండు లైనులో ^ మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి.. మొల్లలివి నన్నేలు నా స్వామికి^ అంటారు దేవులపల్లి. తాను కొలిచే ఆ చల్లని తల్లికేమో మల్లె పువ్వులు ఇస్తుందట. తనని ఏలే తన భర్తకి మొల్లలు ఇస్తుందట. మొల్లలు అంటే బొండు మల్లె పూలు. వీటితో దేవుడ్ని పూజించరు. అలంకరించరు. ఎందుకంటే ఇవి స్రష్టికి ప్రతి స్రష్టి చేసిన విశ్వామిత్ర మహర్షి స్రష్టి. మల్లెలకి ప్రతిగా విశ్వామిత్రుడు బొండు మల్లెలు స్రష్టించారు. ఇదీ దేవులపల్లి స్రష్టించిన అద్భుతం.
తులసి కోట నుంచి నడుచుకుంటూ పూజగదిలో ఉన్న సీతారాముల విగ్రహాల ముందు కూర్చుని రెండో చరణం పాడుతుంది.
^ ఏ లీల సేవింతు.. ఏ మనసు కీర్తింతు
ఏ లీల సేవింతు.. ఏ మనసు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల.. ఒక దివ్వెని మ్రోల ^
రాముడ్ని తన్మయత్వంతో… భక్తితో చూస్తూ
ఏ లీల సేవింతు ఏ మనసు కీర్తింతు అంటుంది హీరోయిన్. అంటే శ్రీరాముడ్ని కొలచేందుకు ఏం చేయాలి నేను. ఏ మనసుతో కీర్తించాలి అని ప్రశ్నిస్తూనే..
ఇవన్నీ ఎందుకు కాని నీ సీత మనసే నీకు సింహాసనం అంటుంది. భార్యభర్తల అనురాగానికి ఇది ప్రతీక. ఇక్కడ రాముడంటే తన భర్త.. సీతంటే తానే. ఎంత అద్భుతమైన పోలిక. ఆ తర్వాత లైన్ లో ఒక పువ్వు పాదాల అంటూ ఓ పువ్వుని రాముని పాదాల దగ్గర ఉంచుతుంది. ఒక దివ్వెని మ్రోల అంటే దివ్వె అంటే దీపం.. మ్రోల అంటే ముందుభాగం… దగ్గరగా.. పురోభాగం అని అర్ధం. అంటే ఓ పుష్పాన్ని కాళ్ల దగ్గర ఉంచడం.. ఓ దీపాన్ని ఆ దేవుని సన్నిధికి సమీపంలో ఉంచడం. మొత్తం పూజాక్రతువుని ఈ లైనులో చెప్పిన ధన్యజీవి దేవులపల్లి.
ఈ పాటకి ట్యూన్ చేసిన సాలూరి రాజేశ్వరరావు గారు దీన్ని బిళహరి రాగంలో స్వరపరిచారు. ఈ రాగం ఉదయరాగం. ఉదయాన్నే హాయిగా… ఆహ్లదంగా ఉండే వాతావరణంలో దైవధ్యానం చేయడం… మనసును ఉల్లాసపరిచే రాగాలతో ఆ రోజు ప్రారంభించడం…. ఎంత గొప్పతనం ఉంది ఈ పాటలో.
పాట పాడిన సుశీలమ్మ అయితే భక్తి అంతా తన గొంతులో మేళవించి పాడారా అనిపిస్తుంది. హీరోయిన్ జయప్రద తన నటనలో ఎక్కడా తక్కువ చేయకుండా… పూర్తి భక్తిభావాన్ని తన కళ్లతోనే పలికించారు. ఇన్ని సుగుణాలు ఉన్నాయి కనుకనే నాలుగు దశాబ్దాలు గడినినా పాటకున్న పరిమళం పోలేదు. ఈ పాటని కింద ఇచ్చిన లింక్ లో చూసి ఆనందించండి.
- సాంకృత