గుడిని మింగే వాడికి లింగం అడ్డమా? అన్న సామెత చందాన తయారైంది ఏపీ ప్రభుత్వతీరు. తిరుమల దేవస్థానం ఆస్తులు అమ్మకానికి వచ్చాయని తెలియగానే వెల్లువెత్తిన విమర్శలకు మా తప్పేమీ లేదున్నట్టు చూపించుకోవడానికి వెంటనే జి.వో. 888 ను విడుదల చేసి విక్రయాలు ఆపేస్తున్నాం అని చెప్పింది ప్రభుత్వం. నేడు మళ్లీ మంత్రాలయం ఆస్తుల అమ్మకం కలకలం రేపుతుంది. తిరుమల కాకపోతే ఇంకో గుడి ఆస్తులు, అదీ కాకపోతే మరో గుడివి అమ్ముతాం అన్నట్లు ఉంది దేవాదాయ శాఖ తీరు. దానిపై జనసేనాని తీవ్రంగా స్పందించారు.
అంతా గుడి ఆస్థుల మయం
గత కొంత కాలంగా ఏపీలోని రాజకీయాలు గుడులు, మఠాలు, మఠాధిపతుల చుట్టూ తిరుగుతున్నాయి. గుడిలో రథాలు కాలిపోవడం, గుడిలోని వెండి, బంగారు వస్తువులు కనిపించకపోవడం, మఠాధిపతుల పుట్టిన రోజులు, గుడి ఆస్తుల అమ్మకాలు… ఇలా అంతా దేవాలయం మయంగా ఉన్నాయి ఏపీ రాజకీయాలు. గతంలో తిరుమల ఆస్ధుల అమ్మకం ప్రకటన ఎంత సంచలనమైందో తెలిసిందే. నేడు మళ్లీ మంత్రాలయం అస్తుల అమ్మకాల ప్రకటన మళ్లీ రాజకీయ కాక పుట్టిస్తుందనిపిస్తోంది.
ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే… అమ్మే హక్కు లేదు…
ప్రభుత్వం దేవాలయ ఆస్తులకు ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి కానీ, అస్తులను విక్రయించే హక్కు లేదని అంటూ కోర్టు లెక్కలు చెప్తున్నారు జనసేనాని. మంత్రాలయం గుడికి చెందిన 208 ఎకరాల ఆస్తుల అమ్మకాల ప్రకటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం పై భగ్గుమన్నారు. జి.వో.888 నే అన్ని దేవాలయాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ధర్మ రక్షణ చేయాల్సిన దేవాదాయ శాఖ వత్తిళ్లకు తలొగ్గి, ఇలాంటి ప్రకటనలు చేయడం సబబు కాదని తెలియజేశారు. ఇదిలాగే కొనసాగితే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని వార్నింగ్ జారీ చేశారు పవన్.
Also Read ;- అమ్మా దుర్గమ్మా : వెండి సింహాల దొంగలను పట్టించు తల్లీ…
•మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
— Pawan Kalyan (@PawanKalyan) November 27, 2020
హిందూ దేవాలయాల ఆస్తులే ఎందుకు?
ఏపీలో ఇంతవరకు జరిగిన గుడి రాజకీయాలు గమనిస్తే, ప్రతి సారీ గుడికి సంబంధించి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆస్తుల అమ్మకం విషయంలో కూడా కేవలం హిందూ దేవాలయ ఆస్తుల అమ్ముతున్నాం అంటూ ప్రకటనలు రావడం గమనించవచ్చు. అంటే హిందూ దేవాలయాలకు మాత్రమే ఆస్తులు ఉన్నాయా? లేక ప్రభత్వం హిందూ దేవాలయ ఆస్తులను టార్గెట్ చేసిందా అనే అనుమానం ఎవరికైనా రాక మానదు. అసలు ఏ మతంకు సంబంధించిన ఆస్తులైనా కావచ్చు. వాటిని సంరక్షించే హక్కు, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కానీ, అమ్మేసే హక్కు ఎక్కడ ఉంది? మరి తాజా ప్రకటనకు ప్రభుత్వం సమాధానం ఏమిస్తుందో చూడాలి?
Must Read ;- దేవుని భూములు దోచుకునేందుకు వైసీపీ కుట్ర : అనిత










