కీర్తి సురేశ్ .. ముద్దుగా .. ముద్దబంతిలా కనిపిస్తుంది. చామంతి చెండులా .. ‘మరువం’ కలిసిన మల్లెపూల గుత్తిలా అనిపిస్తుంది. తెరపై కీర్తి సురేశ్ ను తొలిసారిగా చూసిన ప్రేక్షకులు, ఇంతవరకూ ఇంతలా సిగ్గుపడిన అమ్మాయిని చూడలేదనే అనుకున్నారు. ఆమె నవ్వుకు మించిన నజరానా తమకి అవరం లేదనుకున్నారు. మలయాళ సినిమాలతో తన కెరియర్ ను ఆరంభించిన కీర్తి సురేశ్, ప్రస్తుతం తెలుగు .. తమిళ సినిమాలతో తీరికలేకుండా ఉంది.
‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కీర్తి సురేశ్ కి, ‘నేను లోకల్’ .. ‘మహానటి‘ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కీర్తి సురేశ్ కేవలం అల్లరి పిల్ల పాత్రలను మాత్రమే కాదు, బరువైన పాత్రలను కూడా చేయగలదనే విషయాన్ని ‘మహానటి’ నిరూపించింది. ఈ సినిమాతో ఇక కీర్తి సురేశ్ ను ఆపడం కష్టమే .. వరుస సినిమాలతో ఆమె దుమ్మురేపేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆమె వరుస తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అక్కడ ఆమె ప్లానింగ్ సరిగ్గా లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులతో గ్యాప్ వచ్చేసింది.
‘మహానటి’ తరువాత కీర్తి సురేశ్ నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళ్లింది. అలా ఆమె నుంచి ‘పెంగ్విన్’ .. ‘మిస్ ఇండియా‘ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో ‘పెంగ్విన్’ ఫరవాలేదనిపించుకోగా, ‘మిస్ ఇండియా’ పూర్తిగా నిరాశపరిచింది. అసలు కథలే లేనట్టుగా ఈ ‘టీ’ గోల ఏమిటి? అనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ గా ఆమె నుంచి ‘గుడ్ లక్ సఖి’ రానుంది. అయితే ఈ సినిమాపై అంతగా అంచానాలు ఉన్న దాఖలాలైతే కనిపించడం లేదు.
కీర్తి సురేశ్ చేసిన ‘మహానటి’ దారివేరు .. ఆ సినిమా విజయం వెనుక ఆమె నటన మాత్రమే కాదు, సావిత్రి పట్ల జనానికి గల విపరీతమైన అభిమానం కూడా దాగి ఉంది. ఆ సినిమా హిట్ అయింది కదా అని చెప్పేసి, ఆ తరువాత కూడా లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడం కీర్తి సురేశ్ తొందరపాటేనని అభిమానులు అంటున్నారు. అనుష్క .. నయనతార .. త్రిష .. వీళ్లంతా కూడా కథానాయికగా చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత, నాయిక ప్రాధాన్యత గల కథలను అంగీకరించారు. కానీ ఆ పనిని కీర్తి సురేశ్ తొలినాళ్లలోనే మొదలెట్టడం సరి కాదంటున్నారు. ఇక ఎటు వెళితే అటే అన్నట్టుగా కాకుండా కీర్తి సురేశ్ వివిధ భాషల్లో చేస్తున్న సినిమాలను బ్యాలెన్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొంతకాలం పాటు ఆమె హీరోలతో ఆడిపాడే పాత్రలను చేయడమే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆలోచనలు ఎటు వెళతాయో .. అడుగులు ఎటు పడతాయో చూడాలి మరి!
Must Read ;- ఆ.. విషయంలో.. కాజల్ తర్వాత.. కీర్తి సురేషే..!