ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారివిలా ఉన్నాయి.. గెలిచిన వారు మా పార్టీ వారంటే మా పార్టీ వారంటూ గణాంకాలు విడుదల చేస్తున్నారు. టీడీపీ మరో అడుగు ముందుకు వేసి జిల్లాల వారీగా ఏ గ్రామంలో ఎవరు గెలిచారు, గెలిచిన వారి పేరు, అతను ఏ పార్టీ వారు అనే గణాంకాలను కూడా విడుదల చేయడంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచడం లేదు. 94 శాతం పంచాతీల్లో గెలవకపోతే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటామని ప్రకటించిన మంత్రి బొత్స ప్రస్తుతం నోరు మెదపడం లేదు. రెండో విడత పంచాయతీ ఫలితాల్లో విజయనగరం జిల్లాలో వైసీపీకన్నా టీడీపీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ పంచాయతీలు గెలిచారని టీడీపీ గణాంకాలతో సహా ప్రకటించడం విశేషం.
గుర్తులేకపోవడంతో గజిబిజి..
పార్టీ రహితంగా పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఒక్కో పార్టీ ఒక్కో అభ్యర్థిని బలపరుస్తోంది. గ్రామాల్లో సర్పంచ్ లుగా పోటీ చేసేవారు ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా పోరు మాత్రం ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్యే ఉంటుంది. దీంతో ఏ పార్టీ వారు ఎంత మంది గెలిచారనేది చెప్పడం పెద్ద కష్టం కాదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే సోషల్ మీడియాలోనూ ఏ పంచాయతీలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్ధి, ఎంత మెజారిటీతో గెలిచారో పోస్ట్ లు వచ్చేస్తున్నాయి. ఇక పార్టీలకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఇలా టీడీపీ మండలాల వారీగా, తాజా గణాంకాలు సేకరించింది. ఏ గ్రామంలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. అతని పేరు, ఎంత మెజారిటీతో గెలిచారు. అనే వివరాలతో సహా గెలుపోటముల పట్టికను విడుదల చేస్తున్నారు. తాజాగా రెండో విడత పంచాయతీ ఫలితాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు 952 మంది గెలిచారని ప్రకటించింది. అయితే ఈ గణాంకాలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.
Must Read ;- ఎంపీ గోరంట్ల మాధవ్ స్వగ్రామంలో టీడీపీ పాగా..!
ఎవరి లెక్కులు వారివి..
రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 1992 మంది గెలిచారని ఆ పార్టీ అధికారిక వెబ్ సైట్లో పొస్ట్ చేసింది. టీడీపీ వారు చెప్పేవన్నీ అబద్దాలని వారు కొట్టిపారేస్తున్నారు. 90 శాతం గ్రామాల్లో వైసీపీ విజయం సాధించిందని వారు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు ఎక్కడా సంబరాలు చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో వారి గణాంకాలపై అనుమానాలు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చివరకు కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని స్వగ్రామం యలపర్రులోనూ టీడీపీ అభ్యర్థి గెలవడంతో వైసీపీ నేతల నోటికి తాళం పడినట్టయింది. అయితే విజయం మాదేనంటూ గంభీరంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీల్లో వైసీపీ ఓటమి పాలైతే వీటి ప్రభావం రాబోయే అన్ని ఎన్నికల్లో పడే ప్రమాదం ఉందని వైసీపీ అగ్రనేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే మిగిలిన స్థానిక ఎన్నికలు మొత్తం ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రా ష్ట్ర ఎన్నికల సంఘానికి రాయబారం పంపించారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.
అధికార పార్టీ నేతల్లో ఆందోళన..
స్థానిక ఎన్నికలు అధికార పార్టీ నేతలకు పెను సవాల్ గా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 90 శాతం గెలవకపోతే మంత్రి పదవులు ఊడతాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచీ మంత్రులు వారి జిల్లాదాటి వెళ్లడం లేదు. ప్రతిక్షణం పర్యవేక్షించుకుంటూ పంచాయతీల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. వైసీపీకి బాగా పట్టున్న గ్రామాల్లో ఏకగ్రీవం చేయగలిగారు, కానీ టీడీపీ గెలుస్తుందనుకున్న గ్రామాల్లో మాత్రం ఎన్నికలను నిలువరించలేకపోయారు. అందుకే మంత్రులు, ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామాల్లో సైతం టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వైసీపీ 90 శాతంపైగా గ్రామాల్లో గెలిచిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీకి చుక్కలు కనిపించాయనే చెప్పవచ్చు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించిందో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు ఎవరి లెక్కలు వారు ప్రచారం చేసుకునే వీలుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఫలితాలు వస్తే ఏ పార్టీ బలం ఎంతో లెక్క స్పష్టంగా తేలిపోనుంది.
Must Read ;- టార్గెట్ 90% : మంత్రుల గుండెళ్లో రైళ్లు!