రాజకీయ పార్టీలకు కంపెనీలు, వ్యక్తులు విరాళాలు ఇవ్వడం కామన్. అందులోనూ అధికార పార్టీకి సాధారణంగా ఎక్కువగా విరాళాలు వస్తాయి. విరాళం ఎందుకు ఇస్తారు అనే ప్రశ్న తలెత్తితే పైకి కనిపించని జవాబులెన్నో ఉంటాయి. కాంట్రాక్టులు, పోస్టింగ్ లు, బదిలీలు, పదవులు..ఇలా ఎవరికి నచ్చినవి వారు చెబుతారు.. అయితే, గతంలో ఓ పార్టీ..ఓ వ్యక్తికి ఇచ్చిన పదవిపై నానా రాద్ధాంతం చేసి.. అవినీతి మరకతోపాటు బినామీ ముద్ర వేసిన వైసీపీ…తిరిగి అధికారంలోకి వచ్చాక.. అదే వ్యక్తికి అదే పదవి ఇచ్చి రాచమర్యాదలు చేయడం, సదరు వ్యక్తి నుంచి పార్టీకి భూరి విరాళాలు అందడం చర్చనీయాంశమైంది.
రూ.2.5కోట్ల విరాళం..
2019-20 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి రూ.8కోట్ల 92 లక్షలు విరాళాలు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తెలిపింది. అత్యధికంగా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు జె.శేఖర్‌రెడ్డికి చెందిన జేఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2కోట్ల 50లక్షలు విరాళంగా ఇచ్చింది. వీరితోపాటు హోలిమేరీ విద్యాసంస్థల అధినేత, వైసీపీ నేత ఆరిమెండ వరప్రసాద్‌రెడ్డి, ఆరిమెండ విజయసారధిరెడ్డి దంపతులు రూ.1.2కోట్లు, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన పి.శివకుమార్‌రెడ్డి, ఆయన కంపెనీ శివ ఎంటర్‌ప్రైజెస్ కలిపి రూ.1.5కోట్లు ఇచ్చారు. ఎవరికి ఏ పార్టీ నచ్చితే వారు ఆ పార్టీకి విరాళాలు ఇస్తారు. అయితే, శేఖర్‌రెడ్డి విరాళంపైనే చర్చ జరుగుతోంది.
Must Read ;- ‘దివీస్’ ఇష్యూలో లోనూ జగన్ రివర్సేనా
చంద్రబాబు బినామీగా ఆరోపణ..
తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడి ప్రాంతానికి చెందిన శేఖర్‌రెడ్డి అక్కడ చిన్న కాంట్రాక్టుల స్థాయి నుంచి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. వైభవ్ ఇన్‌ఫ్రా, జేఎస్‌ఆర్ ఇన్ ఫ్రా పేరుతో కంపెనీలూ ఏర్పాటు చేశారు. అక్కడ జయలలిత, పన్నీర్ సెల్వం, శశికళతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శేఖర్‌రెడ్డికి టీడీపీ పాలకమండలి సభ్యుడి పదవి ఇచ్చింది. అప్పట్లో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండడం, ఆ ప్రభుత్వం నుంచి సిఫారసు రావడంతో పదవి ఇచ్చినట్టు అప్పటి టీడీపీ ప్రభుత్వం తెలిపింది. అయితే, 2016 నవంబరు8న నోట్ల రద్దు జరిగింది. డిసెంబరు 8న శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సంబంధీకులపైనా సీబీఐ, ఈడీ దాడులు జరిగాయి. భారీ మొత్తంలో డబ్బు (ఆర్‌బీఐ చెస్ట్ తరహాలో రూ.400 కోట్లు అని ఆరోపణ) దొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ప్రతిపక్ష వైసీపీ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై విరుచుకు పడింది. ఆ పార్టీ నేత అంబటి రాంబాబు మొదలు.. చాలా మంది నాయకులు శేఖర్‌రెడ్డిని చంద్రబాబు బినామీ అని వ్యాఖ్యానించారు. అదే ఏడాది డిసెంబరు 15న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు కూడా చేశారు. పెద్దనోట్ల రద్దుతో పేదలు ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు బినామీల వద్ద వందల కోట్లు బయటపడుతున్నాయని శేఖర్‌రెడ్డి చంద్రబాబు కలిసి ఉన్న ఫోటో, బ్యాంకుల వద్ద పేదల క్యూ ఫోటో జత చేసి పోస్ట్ చేశారు. లోకేష్ రూ.వంద కోట్లు తీసుకుని శేఖర్‌రెడ్డికి పదవి ఇచ్చారని కూడా ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. తరువాతి కాలంలో శేఖర్‌రెడ్డిని పదవి నుంచి తొలగిస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శేఖర్‌రెడ్డిపై నమోదైన మూడు కేసుల్లో రెండు కేసులను సాక్ష్యాలు లేవనే కారణంగా హైకోర్టు కొట్టేసింది. మరో కేసులో ఇంకా ఛార్జిషీటు దాఖలు కాలేదు. ఈకేసులోనూ స్టే ఉంది.
మళ్లీ పదవి ఇచ్చిన వైసీపీ
ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆరునెలల్లోపే అంటే సెప్టెంబరు 19న శేఖర్‌రెడ్డి (జీఓ నెంబరు 963) తో పాటు ఏడుగురికి ప్రత్యేక ఆహ్వానితులుగా పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వుల్లో శేఖర్‌రెడ్డి పేరును శేఖర్. ఏ.జే గా పేర్కొనడం గమనార్హం. దీనిపై అప్పట్లోనే టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శేఖర్‌రెడ్డి తిరుమల శ్రీవారి భక్తుడని, కోర్టుల్లో కేసులు రుజువు కాలేదని, రూ.80లక్షల సొంత ఖర్చుతో గోమందిరాన్ని నిర్మించి ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
విమర్శించి మళ్లీ పొగడ్తలు..
శేఖర్‌రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వం పదవి ఇచ్చిన తరవాత వైసీపీ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. అయితే అధికారంలోకి రాగానే శేఖర్‌రెడ్డి వైసీపీకి మంచి వ్యక్తి అయ్యాడు. అంతేకాదు..కేసులు ఇంకా రుజువు కాలేదని కూడా చెప్పారు వైసీపీ నేతలు. దీన్ని బట్టి గతంలో వైసీపీ చేసినవి కేవలం తప్పుడు ఆరోపణలేననే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మొత్తం మీద తిరుమల శ్రీవారికి భక్తుడైన శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలోని కంపెనీలు వైసీపీకి పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడంలో ఉన్న ఆసక్తి ఏంటనే చర్చ మొదలైంది.
Also Read ;- వైసీపీ ‘రివర్స్ టెండరింగ్’.. అయినవారికే పనులు