తెలంగాణలో కేసీఆర్‌పై పోరాటం చేస్తామని,రాజన్న రాజ్యం తెస్తామనే నినాదంతో రాజకీయ వేదిక నుంచి చెప్పిన వైఎస్ షర్మిల త్వరలోనే పార్టీ పెడతామని ప్రకటించారు.జులైలో అన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.అయితే ఐదారురోజుల నుంచి లోటస్ పాండ్‌లోని పార్టీ తత్కాలిక వేదికగా మారిన ద్వారానికి తాళం వేసి ఉండడం,కనీస సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇందుకు సంబంధించి పలు అంశాలు చర్చకు వస్తున్నాయి.
ఆ నెంబరుకు కాల్ చేస్తే..
కొవిడ్ కారణంగా కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని,తమకు ఫోన్ చేస్తే స్పందిస్తామని చెప్పినా..ఆ నెంబరుకు కాల్ చేస్తే రికార్డెడ్ మెస్సేజ్ మాత్రమే వినిపిస్తుండడం కూడా ఈ అనుమానాలకు కారణమైంది. దీనిపై పార్టీ నేతలు మాట్లాడుతూ కొవిడ్ తీవ్రత కారణమని,నిత్యం పార్టీ నాయకులతో షర్మిల టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు.రెండురోజుల క్రితమే వీడియోకాన్ఫరెన్స్ పెట్టారని,కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రశ్నించారని చెబుతున్నారు.కేసీఆర్ అసమర్థ,చేతగాని పాలన వల్లే ఇబ్బందులు వస్తున్నాయని,తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారని చెబుతున్నారు.వివిధ జిల్లాల డ్వాక్రా సంఘాల మహిళలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని చెబుతున్నారు.అదే సమయంలో చికిత్స కోసం కేసీఆర్ యశోధ ఆసుపత్రికి వెళ్లారని,పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రిని సందర్శించారని విమర్శించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈటల బర్తరఫ్‌తో మారిన సీన్
పార్టీకి చెందిన నాయకుల మాటలు ఇలా ఉండగా ఇతర పార్టీల్లో మాత్రం మరో చర్చ నడుస్తోంది.ఆ చర్చ ప్రకారం ‘ తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని,కొత్త పార్టీ పెడిత సక్సెస్ అవడంతో పాటు ఏపీలో పరిస్థితులను బట్టి అటువైపు కూడా స్టెప్ తీసుకోవచ్చని షర్మిల భావించారు.అయితే అనూహ్యంగా తెలంగాణలో ఈటల రాజేందర్ బర్తరఫ్ జరిగింది.తెలంగాణలో,తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్న కీలక నేత ఈటల రాజేందర్.ఆయన టీఆర్ నుంచి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెడతారా వేరే పార్టీలో చేరతారా అనేది క్లారిటీ రాలేదు.ఒక వేళ ఈటల కొత్త పార్టీ పెడితే షర్మిల పార్టీలోకి వచ్చే నాయకుల సంఖ్య తగ్గుతుంది.కేసీఆర్‌ని వ్యతిరేకించే వారిలో చాలామంది ఈటల వైపు లేదా రేవంత్ రెడ్డి వైపు వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి.ఈ నేపథ్యంలో వారి కార్యాచరణ చూసి నిర్ణయం తీసుకోవచ్చనే ఆలోచనలో షర్మిల ఉన్నట్లున్నారు.’అనే చర్చ నడుస్తోంది.
పీకే వ్యవహారం..
అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యవహారం కూడా తెరపైకి వస్తోంది.షర్మిల అనుయాయులు కూడా పీకేను వ్యూహకర్తగా నియమించుకుందామని సూచించినట్టు సమాచారం.పార్టీ కూడా అందుకు సిద్ధమైందని తెలుస్తోంది. గతంలో బీజేపీని అధికారంలోకి తేవడంతోపాటు ధిల్లీ,బీహార్,పశ్చిమబెంగాల్,ఏపీల్లో అధికారంలోకి వచ్చిన పార్టీలకు పీకే వ్యూహాలు కూడా కారణమనే చర్చ నడిచింది.తప్పొప్పుల విషయాలు,నిజానిజాల విషయాలు పక్కన బెడితే సక్సెస్ ఫుల్ వ్యూహకర్తగా పీకేకి పేరుంది.అయితే పశ్చిమబెంగాల్ ఫలితాలు వచ్చాక పీకే కీలక ప్రకటన చేశారు.తాను భవిష్యత్‌లో ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయబోనని వ్యాఖ్యానించారు.పీకేలాంటి వ్యూహకర్త లేకుండా కేసీఆర్‌ను ఢీకొట్టే వ్యూహాలు అమలు చేయడం కష్టమని,సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామని,అప్పటి వరకు వేచి చూడడం బెటర్ అనే ఆలోచనకు షర్మిల వచ్చినట్టు మరో చర్చ కూడా నడుస్తోంది.
కొవిడ్ కారణంగా తాళాలు వేశారన్న చర్చ కూడా నడుస్తోంది.పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలామంది మాస్కులు లేకుండా రావడం,పార్టీ సమావేశాలకు వచ్చిన వారిలో కొంతమంది కొవిడ్ బారిన పడినందున తత్కాలికంగా తాళం వేశారని, ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నారని, పార్టీ సమావేశాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక్కడే మరో చర్చకూడా నడుస్తోంది.ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించి,తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు అండగా ఉంటేనే విశ్వసనీయత పెరుగుతుందని లేని పక్షంలో ఆదిలోనే అనుమానాలు వస్తే పార్టీకి నష్టం జరగడంతోపాటు రానున్న కాలంలో విమర్శలు పెరుగుతాయని చెప్పేవారూ ఉన్నారు. మొత్తం మీద షర్మిల పార్టీకి సంబంధించి తత్కాలిక వేదిక ద్వారానికి తాళం వేసి ఉండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదు : వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు











