తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా వైఎస్ షర్మిల ప్రత్యేక వేదిక ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. శనివారం హైదరాబాద్ –ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. జై తెలంగాణ నినాదంతో షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు తాను ముందుకొచ్చానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదల అభ్యున్నతికి ఎంతో చేశారని, అందుకే తెలంగాణ ప్రజలు వైఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు.
వైఎస్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక తెలంగాణలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రాజన్న రాజ్యం రావాలని, తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలని తన కోరిక అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో దాదాపు 700 మంది అభిమానులకు అనుమతి లభించింది. సమావేశం ప్రారంభం కాగానే 11ప్రశ్నలతో కూడిన ఒక ఫారం ఇచ్చి అది పూర్తి చేయాలని కోరారు. ఆ ఫారంలో వైఎస్ పాలనలో నచ్చిన అంశాలు, టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల ఆచరణ, ప్రస్తుత యువత అభిప్రాయం తదితర అంశాలున్నాయి. కాగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన అభిమానులతో తొలివిడత మాట్లాడిన షర్మిల రానున్న కాలంలో అన్ని జిల్లాల వారితో సమావేశం కానున్నారు. మార్చి 2న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో మరోసారి సమావేశం కానున్నారు. ఏప్రిల్ 10లోపు జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు పూర్తి చేయాలని, మే1నాటికి యాక్షన్ ఫ్రేమ్ వర్క్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

టీం రెఢీ చేసుకుంటున్న షర్మిల..
ఇక అధికారికంగా పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయకున్నా..పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విధానాలే ప్రస్తుతం షర్మిల అనుసరిసున్నారు. ఇప్పటికే కొంతమందిని సలహాదారులుగా నియమించుకోవడం, కొంతమంది మద్దతు కూడగట్టడం జరిగింది. ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు, వార్త, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ రామచంద్రమూర్తి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, నల్గొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు షర్మిలను ఇప్పటికే కలిశారు. మరోవైపు కొందరు మాజీ ఉన్నతాధికారులు కూడా షర్మిలతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా భేటీ అయినట్టు చెబుతున్నా..ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. మాజీ ఐఏఎస్ కొప్పుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సింహా.. షర్మిల పార్టీ సలహాదారులుగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సీఎస్‌వోగా ఉదయ సింహా పనిచేయగా, ఆయన హయాంలోనే సీఎంవోలో ప్రభాకర్‌రెడ్డి అడిషనల్ సెక్రెటరీగా పని చేశారు. వీరు షర్మిలకు సలహాదారులని ప్రచారం జరుగుతోంది.
Must Read ;- షర్మిలతో రాజన్న రాజ్యం సాధ్యమా?
గద్దర్, షఫీ..
మరోవైపు వర్గాల వారీగా కూడా షర్మిల పలువురి మద్దతుకూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడు, నడిచే యుద్దనౌకగా పేరున్న విప్లవ గాయకుడు గద్దర్ పరోక్షంగా తన మద్దతు షర్మిలకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమంయలో ఇస్లాం ప్రబోధకుడు, తెలంగాణ ప్రాంతానికే చెందిన అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ కూడా షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షఫీ మాట్లాడుతూ..తాను మార్పుకోసం కొంతకాలంగా నినదిస్తున్నానన్నారు. తెలంగాణలో అన్నివర్గాల వారు మార్పు కోరుకుంటున్నారన్నారు. షర్మిల మాట్లాడుతుంటే వైఎస్ గుర్తొచ్చారన్నారు. యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ (యూఐఆర్‌సీ) నిర్వాహకుడిగా మహ్మద్ ప్రవక్త విధానాలను, ఇస్లాంకు సంబంధించిన నిగూఢ విషయాలను ప్రచారం చేసిన షఫీ ప్రస్తుతం ‘నేను సైతం సమాజం కోసం’ అనే వేదిక ద్వారా మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తున్నారు. కాగా పలువురు నాయకులతో మాట్లాడిన షర్మిల..తాను తెలంగాణ కోడలినని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పుట్టినిల్లు ఆంధ్ర, మెట్టినిల్లు తెలంగాణగా షర్మిల ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
మే 14 లేదా జులై 8
కాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో ఆత్మీయ సమావేశానికి ముందు ప్రస్తుతం షర్మిల కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ వైసీపీకి చెందిన కొందరు నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో కార్యాచరణకు ప్రణాళికతో పాటు వేదిక పేరు (పార్టీ) ప్రకటన తేదీపై చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ తొలిసారిగా సీఎం అయినప్పుడు మే10న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తేదీని నాయకులు సూచించినట్టు తెలుస్తోంది. మరి కొందరు నాయకులు వైఎస్ జయంతి తేదీ అయిన జులై8ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏప్రిల్ 15తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోగా అన్ని జిల్లాల నాయకులతో సమావేశాలు జరపనున్నారు.
Also Read ;- రాజన్న రాజ్యం కాదు.. రామ రాజ్యం కావాలి!











