ప్రతి పేద విద్యార్దికి ప్రభుత్వం ఫీజులు చెల్లించి చదివించే బాధ్యత తీసుకుంటుందని ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. నేడు ఆ హామీలను తుంగలో తొక్కారు. ఏపీ స్థానికత కలిగిన వేలాది మంది విద్యార్ధులు తెలంగాణలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. అలాంటి వారికి కూడా ప్రభుత్వం 2017 వరకూ ఫీజులు చెల్లించింది. హైదరాబాద్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ, అవసరమైన కోర్సులు నేర్చుకుంటే వెంటనే ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో వేలాది మంది ఏపీ విద్యార్థులు తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం కూడా వీరికి ఫీజులు చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. అయితే మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం లేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాం…
ఏపీ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులతో తెగేసి చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం 2017 వరకూ ఫీజులు చెల్లించింది. ఇక మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఒక్కో విద్యార్థి కనీసం రూ.1,05,000 ఫీజు బకాయి పడ్డారు. ఇక కాలేజీని బట్టి ఈ మొత్తం రూ.2 లక్షల దాకా ఉంటోంది. దీంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సతమతం అవుతున్నారు. బీ.టెక్ పూర్తి చేసినా సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారు.
సాంకేతిక సమస్య ఎదురైందట…
తెలంగాణలో చదువుకుంటున్న ఏపీ విద్యార్ధుల ఫీజు బకాయిలపై అధికారులు కామెడీగా సమాధానం చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు ఎదరయ్యాయని అందుకే చెల్లించలేకపోతున్నామని వారు చెప్పే సమాదానం విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, లేదంటే నిధులు విడుదల చేయడం లేదని చెప్పలేకపోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని సాంకేతిక సమస్య అంటూ అధికారులు కామెడీ చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ సాంకేతిక సమస్య వల్ల ఆగిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి
ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చదువుకుంటే ఫీజులు చెల్లించం అని చెబితే ఇష్టం అయిన వారు అక్కడ చేరతారు లేదంటే ఏపీ కాలేజీల్లో చదువుకుంటారు. అలా కాకుండా అటు తెలంగాణ పట్టించుకోదు, ఇటు ఏపీ ఫీజులు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;-ప్రభువు పుట్టిన రోజునే పేదలకు స్థలాలు.. మతలబేంటి?











