Behind The Scenes Of MAA Elections :
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన అజెండా ఈ అసోసియేషన్ కు సొంత భవన నిర్మాణం. అసలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందే నటుడు ప్రకాష్ రాజ్.
ఈసారి మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోట చేయడమే పెద్ద చర్చనీయాంశం. ఈ రొచ్చులోకి ప్రకాష్ రాజ్ ఎందుకు దిగడం ఎందుకు అన్నవారే ఎక్కువ. ఎందుకంటే ఆయన మంచి నటుడు. పైగా ఎప్పుడూ చేతినిండా సినిమాలు ఉంటాయి. అంత బిజీగా ఉంటూ మా కార్యకలాపాల్లో చురుగ్గా ఉండగలరా? అన్న సందేహాలు ఉన్నాయి. నరేష్ ఈ పదవిని చేపట్టినప్పుడు కూడా ఇదే అంశం తెరపైకి వచ్చింది. ఆయన సినిమాల్లో బిజీగా ఉంటూ మా కార్యకలాపాల్లో యాక్టివ్ గా పాలుపంచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రకాష్ రాజ్ ఈ పదవికి పోటీ పదవికి పోటీ పడటం వెనక రాజకీయ శక్తులు ఉన్నాయన్న మాట మొదటి నుంచీ వినిపిస్తోంది. ఆయనకు రాజకీయాలు అన్నా ఇష్టమే. ఇతర భాషా చిత్రాలు ప్రకాష్ రాజ్ చేసినా తెలుగుకే ఆయన ప్రాధాన్యం ఇస్తుంటారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మళ్లీ ఇప్పుడు సినిమా రాజకీయాల్లో వేలు పెడుతున్నారు.
ప్రకాష్ రాజ్ వెనక ఉన్నదెవరు?
ప్రకాష్ రాజ్ కు తెలంగాణలో రాజీకీయ స్నేహాలు ఎక్కువ. ఇక్కడ ఆయన రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కూడా పాటు పడుతున్నారు. తెలంగాణ మంత్రి కె.టి. రామారావుకు ఆయన సన్నిహిత మిత్రులు. కేటీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తో మంచి స్నేహం ఉంది. కేటీఆర్, రామ్ చరణ్ ల ప్రోద్బలంతోనే ప్రకాష్ రాజ్ మా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని వార్తలొచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉండటానికి కారణం కూడా అదే. చిరంజీవి వాయిస్ ను నాగబాబు వినిపించారు. మా ఎన్నికల రచ్చ జరగ్గానే ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ ముద్ర పడింది. ముందుగా మీడియా ముందుకు తన ప్యానల్ తో వచ్చింది కూడా ప్రకాష్ రాజే. ఈ రచ్చ మొదలైన తర్వాత ప్రకాష్ రాజ్ కు బదులు వేరొక అభ్యర్థి చిరంజీవి ప్యానల్ తరఫున తెరపైకి రావచ్చన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వం వైపే మెగా మద్దతు కొనసాగుతోంది.
మా భవనం రచ్చ ఏమిటి?
మా అసోసియేషన్ ఏర్పడి ఇంతకాలమైనా సొంత భవనం నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదో అర్థం కాదు. ఎన్నికల్లు వస్తున్నాయి కాబట్టి ప్రధాన అజెండాగా భవన నిర్మాణం అంశం తెరపైకి వచ్చింది. ప్రకాష్ రాజ్ తో పోటీ పడబోతున్న మంచు విష్ణు తన సొంత ఖర్చుతోనే భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ కొత్త అంశాన్ని లేవనెత్తారు. మా అసోసియేషన్ కోసం ఇప్పటిదాకా సేకరించిన విరాళాలు ఏమయ్యాయో లెక్క చెప్పాలంటూ కొత్త వివాదానికి తెరతీశారు.
ఇంతకాలం అసోసియేషన్‌కు సొంత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇప్పటివరకు సేకరించిన విరాళాలను ఏం చేశారో చెప్పాలని, నటీనటులంతా కలిసి ముందుకొస్తే ‘మా’ కోసం ఇంద్ర భవనాన్నే నిర్మించవచ్చని, ఆ పనిచేస్తే ఆ భవన నిర్మాణంలో తాను కూడా భాగస్వామిని అవుతానని బాలయ్య ప్రకటించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు నటుడు నాగబాబు స్పందించారు. సేకరించిన విరాళాలు సంక్షేమం కోసమని, భవన నిర్మాణానికి కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘మా’ ఎన్నికల్లో అందరూ భవనం గురించే మాట్లాడుతున్నారు. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు చేయడానికి ఒకప్పటి అధ్యక్షుడు మురళీమోహన్ ఎంతో ప్రయత్నించారు. కాకపోతే రాజకీయ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. సభ్యుల సంక్షేమం, ఇతర కారణాలపై దృష్టి పెట్టడం వల్లే ఇప్పటికీ అది వీలు కాలేదు. భవన నిర్మాణం, అందుకు కావాల్సిన భూమి విషయంలో ప్రకాశ్‌రాజ్‌కి స్పష్టత ఉంది. ఆయన ప్లానింగ్ నాకు బాగా నచ్చింది. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను’అని వివరించారు. మొత్తానికి మా ఎన్నికలు పూర్తయ్యాక మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ అసోసియేషన్ కు సొంత భవనం వస్తుందన్న నమ్మకం మాత్రం అందరిలోనూ ఉంది.
Must Read ;- ‘మా’ లో నిప్పు రాజేస్తున్న మలయాళ ‘అమ్మ‘ భవనం