బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రవీణ్‌రావును, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు మరికొందరు అరెస్టయ్యారు. కాగా పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాపర్లు, బాధితులు, నిందితులు వినియోగించిన ఫోన్ కాల్స్ మీదే కేసు విచారణ ఆధారపడి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఆళ్లగడ్డకు చెందిన మరికొందరిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పార్టీ నేత, ఓ న్యాయవాదిని గత రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక కిడ్నాప్ విషయంలో అఖిల ప్రియను కోర్టు అనుమతితో విచారిస్తున్న పోలీసులు..మిగతా నిదింతుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మాదల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీనుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 11 మందిలో ముగ్గురు పోలీసుల అదుపులో ఉండగా, మిగతా 8మంది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వారిలో కొందరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు చెబుతున్నా..ఇంకా రూఢీ కావాల్సి ఉంది. గోవాలో నలుగురిని, గుంటూరు, విజయవాడల్లో మరో నలుగురిని పట్టుకున్నారని సమాచారం. బుధ, గురువారాల్లో వారిని హైదరాబాద్‌కి తీసుకురానున్నారని తెలుస్తోంది. గోవాలో అదుపులోకి తీసుకున్న నలుగురిలో కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉండగా, మొత్తం వ్యవహారంలో మరో నలుగురు యువకులను కొండపల్లిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
జైల్లో పరిచయం
కిడ్నాప్ కేసులో గుంటూరు శ్రీనుతో పాలు కీలకంగా ఉన్న, ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బాలచెన్నయ్య, బోయ సంపత్‌కుమార్, మల్లిఖార్జునరెడ్డిలు కీలకంగా మారారు. వీరు కాకుండా మరో 8మంది ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బాలచెన్నయ్య విషయానికి వస్తే.. ఈయన లారీ డ్రైవర్. కడప జిల్లా బ్రహ్మాంగారి మఠం మండలానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కడప, బద్వేలు జైళ్లలో గడిపారు. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అప్పటికే కడప జైల్లో శ్రీను శిక్షను అనుభవిస్తున్నాడు. జైల్లో వీరికి పరిచయం ఏర్పడింది. బయటకు వచ్చాక కూడా పలుమార్లు కలిశారు. కొన్ని దందాలూ చేశారు. ప్రవీణ్‌రావు కిడ్నాప్‌కి ముందు రోజు.. లారీలో సరకు రవాణా చేశారు. అయితే శ్రీను ఫోన్ చేసి టాస్క్ చెప్పడంతో లారీని అక్కడే విడిచిపెట్టి.. మిగతా వారిని కలుపుకుని హైదరాబాద్‌కి చేరుకున్నారు.
Must Read ;- అప్పటి భూముల పంచాయితీ.. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ కలిశారా?
ఇంజినీర్లు కాబోయి..కిడ్నాపర్లుగా..
ఈ కేసులో కీలకంగా ఉన్న, అంతా తానై వ్యవహరించిన మాదల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను ఇంజినీరింగ్ మధ్యలో ఆపివేశాడు. తన సహచరులైన ఇంజినీరింగ్ ఆపివేసిన 8మందితో గ్యాంగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారంతా కేవలం టైంపాస్ గ్యాంగ్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి పనులు ఏవైనా ఉన్నప్పుడు, రాజకీయ ప్రచారం లాంటివి ఉన్న సమయంలో వారిని గుంటూరు శ్రీను పిలిపిస్తాడని చెబుతున్నారు. కిడ్నాప్‌లో వీరిని గుంటూరు శ్రీను వినియోగించాడని తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియ తరఫున పనిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో భూమా వర్గం, వారి ప్రత్యర్థులు రాళ్లు రువ్వుకున్న ఇష్యూలోనూ..వీరి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వారిలో ఒకరిని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్ రప్పించారని, అనుకోకుండా సదరు యువకులు ఈ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.
పనివాడిగా చేరి…
బాలచెన్నయ్యతో పాటు సంపత్‌కుమార్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. పనివాడిగా చేరి నమ్మకంగా ఉండడంతో మరికొన్ని బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం భార్గవ్‌రామ్‌కి పీఏగా, బాడీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. క్రషర్ల వివాదంతో పాటు మరికొన్ని వివాదాల్లో భార్గవ్‌తో పాటు అతను పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి.
రెస్టారెంట్ నడిపి..
ఇదే కేసులో అరెస్టైన మరో నిందితుడు మల్లిఖార్జునరెడ్డిది అనంతపురం జిల్లా గుంతకల్లు. గతంలో రెస్టారెంట్ నడిపాడు. నష్టాలు వచ్చాయి. తరవాత స్థిరాస్తి వ్యాపారం కూడా చేసినట్లు తెలుస్తోంది. 2006లో హైదరాబాద్‌కు రావడం, రెస్టారెంట్‌కి తరచూ వచ్చే గుంటూరు శ్రీనుతో పరిచయమయ్యింది. గుంటూరు శ్రీను ద్వారా భార్గవ్ పరిచయం అయ్యారు. ప్రస్తుతం చిన్నచిన్న వ్యవహారాల్లో మల్లిఖార్జున్ కలసి పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో కిడ్నాప్ వ్యవహారంలో మల్లికార్జునరెడ్డి కూడా తోడైనట్లు తెలుస్తోంది.
Also Read ;- భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా అనుమానితుడే!