(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆయనొక డాక్టర్ .. అన్యూహంగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. అంతేవేగంగా మంత్రి అయ్యారు. సామాజిక సమీకరణల పరంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన గెలుపు సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఆయన రాజ్యమే నడుస్తోందట. అటు ప్రతిపక్ష నేతలతో పాటు ఇటు అధికార పక్షం నేతలు కూడా ఆ మంత్రి దూకుడు చూసి అవాక్కవుతున్న పరిస్థితి. అదే తరుణంలో ఆ దూకుడు సమస్యలనూ తీసుకొస్తోందట. ఇంతకు ఆ మంత్రి ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు. సాధారణ డాక్టర్ నుంచి మూడేళ్లలోనే మంత్రి స్థాయికి ఎదిగిపోయారు ఆయన.
ఆరు నెలల క్రితమే ..
ఆరు నెలల క్రిందటే ఆయన లక్ బాగుండి.. సామాజిక సమీకరణలు కలిసొచ్చి మంత్రి అయ్యారు. విపక్షాలపై విరుచుకు పడడమే కాదు.. ఇటు స్వపక్షంలో సీనియర్లకు సైతం చెక్ పెట్టేస్తున్నారని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం అప్పలరాజుపైనే బాణాలు ఎక్కుపెట్టి విమర్శలు చేస్తున్నారు. మంత్రిది అప్పలరాజు రాజ్యం అని… ఆయన ఇలాకాలో అవినీతి, భూ కబ్జాలు పెరిగి పోతున్నాయని అచ్చెన్న విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటు శ్రీకాకుళం వైసీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాయిస్ ఎక్కడా వినపడడం లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌ను సైతం అప్పలరాజు డామినేట్ చేసేస్తున్నారట. ఇక స్పీకర్ తమ్మినేని ఉన్నా ఆయన కూడా అప్పలరాజు దూకుడు ముందు రేసులో వెనుక పడి పోతున్నారని గుసగుసలు వస్తున్నాయి. అదే క్రమంలో అటు విపక్ష పార్టీ నేతలకు డైరెక్టుగా అప్పలరాజు టార్గెట్ అవుతుంటే.. స్వపక్షంలో చాలా మంది నేతలు ఆయన దూకుడుకు తెరవెనుక చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట.
స్వపక్షీయులే రుసరుస ..
నిన్న కాక మొన్న వచ్చి మంత్రి అవ్వడంతో పాటు తమ రాజకీయానికి.. తమ ప్రాభావానికి గండి కొడుతున్నారని లోలోపల స్వపక్షీయులే రుసరుసలాడి పోతున్నారట. మరి ఈ అప్పలరాజు రాజ్యం ఎంత కాలం ఏలతారో ? ఇది ఎలా మలుపు తిరుగుతుందో ? వేచి చూడాల్సిందే.
Must Read ;- మంత్రి అప్పలరాజు గారు ప్రాయశ్చిత్తం చేసుకోండి ..!