కరోనా నుంచి బయటపడేందుకు దేశంలో 18ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. రిజిస్ట్రేషన్లూ మొదలయ్యాయి. రిజిస్ట్రేషన్ల తాకిడికి CO-WIN వెబ్ సైట్ కూడా తత్కాలికంగా నిలిచింది. కాసేపటి అంతరాయం తరువాత మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అంటే దేశ వ్యాప్తంగా కరోనా నుంచి బయటపడేందుకు వ్యాక్సినేషన్ కోసం ప్రజానీకం సిద్ధమయ్యారని చెప్పవచ్చు. కేంద్రం చేసిన ప్రతిపాదనతో పాటు రాష్ట్రాలకు ఆ వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే అంశాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మే 1నుంచి టీకాలు వేస్తారని చెబుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అది సవాలుగా మారింది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇంకా దీనిపై సమీక్ష చేయాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిందని చెప్పవచ్చు. వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి పెంచకుండా అందరికీ వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదని తేల్చేసిందనే వార్తలు వస్తున్నాయి.
ఉత్పత్తి ఇదీ..
దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు మాత్రమే వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. విదేశీ కంపెనీలకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రతి నెలా 6 కోట్ల వ్యాక్సిన్లను, భారత్ బయోటెక్ 1 కోటి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తం కలిపితే నెలకు 7కోట్ల వ్యాక్సిన్ (సింగిల్ డోస్)లు అందుబాటులో ఉంటాయిని చెప్పవచ్చు. ఇందులో నిబంధనల ప్రకారం సగం కేంద్రం తీసుకుంటుంది. మిగతావి రాష్ట్రాలతో పాటు ప్రైవేటుకు సరఫరా చేయవచ్చు. అంటే రాష్ట్రాలకు, ప్రైవేటు సంస్థలకు నెలకు 3.5కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. కేంద్రం పంపిణీ చేసే వ్యాక్సిన్ విషయానికి వస్తే.. పరిస్థితిని బట్టి సరఫరా ఉంటుంది. వాటిపై కచ్చితమైన అంచనాలకు రాలేని పరిస్థితి. దేశంలోని 29 రాష్ట్రాలు కూడా ప్రైవేటుతో పోటీపడి నెలకు 3.5కోట్ల వ్యాక్సిన్లను దక్కించోకోవాల్సి ఉంటుంది. సగటున చూస్తే ఒక్కో రాష్ట్రానికి నెలకు 6లక్షల వ్యాక్సిన్లు వస్తాయని చెప్పవచ్చు.ఇవి కాకుండా మే, జూన్‌లో జరిగే ఉత్పత్తి అంతా కేంద్రంతో చేసుకున్న ఒప్పందం మేరకు కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందని ఉత్పత్తి సంస్థలు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు లభ్యత ఎంతనేది తేలాల్సి ఉంటుంది. దీంతోపాటు వ్యాక్సిన్ ధరల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంటుంది.
Must Read ;- రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ధరలు నిర్ణయించిన కేంద్రం

తెలంగాణలో..
తెలంగాణలో ఇప్పటి వరకు 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. మొదటి డోస్ 37.56లక్షలకు చేరగా రెండో డోసు 5.3లక్షల మంది వేసుకున్నారు. ఇక 18ఏళ్లు పైబడినవారు 3కోట్ల మంది ఉండగా రెండు డోసులు కలిపి 6కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇప్పటికే 42లక్షలు పూర్తి కాగా మరో 5.5కోట్ల డోసులు అవసరం అవుతుంది. ఈ ప్రకారం చూస్తే నెలకు 6లక్షల వ్యాక్సిన్లు వస్తే ఎప్పుడు పూర్తవుతాయనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో ఇదీ పరిస్థితి..
ఏపీలో మొదటి డోసు తీసుకున్న వారు 46 లక్షల మంది కాగా రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 11 లక్షలు. అంటే దాదాపు 57లక్షల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రకారం చూస్తే మొత్తం జనాభాకు గాను 4.8కోట్ల డోసులు అవసరం అవుతుంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిన 57లక్షలను మినహాయిస్తే మరో 4.3కోట్ల వ్యాక్సిన్లు అవసరం అవుతుంది.
దేశ వ్యాప్తంగా..
దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ లభ్యత విషయాన్ని పరిశీలిస్తే 18ఏళ్లు పైబడినవారి జనాభా 94కోట్లు ఉంటుందని అంచనా. వీరికి రెండు డోసుల చొప్పున లెక్కిస్తే 188 కోట్ల డోసులు అవసరం. ఇప్పటివరకు 15కోట్ల మందికి మొదటి డోసు, 2.39కోట్ల మందికి రెండో డోసు పూర్తయింది. మొత్తం కలిపితే 18.39కోట్ల డోసులు పూర్తయ్యాయి. ఇంకా 170కోట్ల డోసులు అవసరం అవుతుంది. ఈ క్రమంలో నెలకు 7కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తే అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే రెండేళ్లు పడుతుందని అంచనా.
మార్గాలు ఇవీ
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులతో వ్యాక్సిన్ల తయారీ జరుగుతున్నా..ఉత్పత్తి పెంచేందుకు పూర్తిస్థాయిలో శీఘ్ర అనుమతులు అవసరం కానుంది. వీటితో పాటు ఇతర వ్యాక్సిన్ల దిగుమతి లేదా విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడం, పేటెంట్ చట్టానికి లోబడి ఇతర కంపెనీల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల తయారీకి అనుమతులు ఇవ్వడం, వ్యాక్సిన్ల కొనుగోలు, పంపిణీ, సేకరణను కేంద్రమే పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుని NHM,NHRM లద్వారా రాష్ట్రాలకు పంపిణీ చేయడం లాంటి మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ తక్షణమే అమల్లోకి తెచ్చినా.. వ్యాక్సినేషన్ పూర్తయ్యేందుకు దాదాపు ఆరునెలల సమయం పడుతుందని అంచనా.
ఉచితం సాధ్యమా..
కాగా దేశంలోని పలు రాష్ట్రాలు వ్యాక్సిన్‌లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చాయి. తెలంగాణ కూడా గతంలో హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్‌లను ఉచితంగా ఇవ్వాలంటే రూ. వందల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుంది. ప్రజలు కట్టే పన్నులతోనే కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రత్యేకంగా ఒక ధర, రాష్ట్రాలకు మరో ధర విధానం సరికాదనే చర్చకూడా మొదలైంది. ఒకే ధర..ఒకే దేశం విధానం అమలు చేయడం, కేంద్రమే రాష్ట్రాలకు ప్రాధాన్యతలు (ఎన్నికలు, పార్టీలను బట్టి కాకుండా) పరిగణనలోకి తీసుకుని సరఫరా చేయడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read ;- తెలంగాణలో లాక్ డౌన్ ఆలోచన లేదు : మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం











