పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఇండియా పంట పండింది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా మూడు స్వర్ణాలను గెలుచుకుంది. భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి తన అద్భుత ప్రదర్శనతో మూడు స్వర్ణాలను సాధించి పెట్టింది. వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల రికర్వ్, మిక్సెడ్ టీమ్‌లోనూ దీపిక సత్తాచాటింది. ఫలితంగా ఒకేరోజు భారత్‌కి మూడు గోల్డ్ మెడల్స్ లభించాయి. మిక్సెడ్ టీమ్ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి దీపిక పతకం గెలుచుకోవడం విశేషం. వ్యక్తిగత విభాగంలో రష్యాకి చెందిన ఎలెనా ఒసిపోవాని 6-0 తేడాతో చిత్తుగా ఓడించింది. ఫైనల్ లో నెదర్లాండ్స్ కు చెందిన గాబ్రియోలా-వాన్ బెర్గ్ గట్టి పోటీనిచ్చినా.. 5-3 తేడాతో ఈ దంపతులు ఓడించారు. గతేడాది జూన్ 30న పెళ్లి చేసుకున్న దీపిక- అతాను.. 2016లో జరిగిన వరల్డ్ కప్ లో రజతం గెలుచుకొని ఆర్చరీపై తమదైన ముద్ర వేశారు.
టోకో ఒలింపిక్స్ కు ముందు..
వరల్డ్ కప్ లో భారత్ ఇప్పటివరకు ఆరు గోల్డ్ మెడల్స్ గెలుచుకోగా.. అందులో దీపిక కీలక పాత్ర పోషించడం విశేషం. అయితే మరో నెల రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దీపిక కుమారి అద్భుత ప్రదర్శన నివ్వడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఇదే పోరాట పటిమ టోక్యో ఒలింపిక్స్ లో చూపితే.. భారత్ కు మరిన్ని పతకాలు గెలుచుకోవడం ఖాయమే. ఇప్పటివరకు ఆర్చరీలో కొరియా టీంకు మంచి రికార్డు ఉంది, పైగా వరల్డ్ కప్ ఛాంపియన్ కూడా. ఒలింపిక్స్ లో కొరియాను దెబ్బ కొడితే కనుక.. ఇండియాకు ఇక తిరుగే ఉండదు.
Must Read ;- ధాబాలో ప్లేట్లు కడిగి.. టోక్యో ఒలింపిక్స్ లో చోటు సాధించి!











