(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచిపోయినప్పటికీ ప్రాంతీయమండళ్ల ఏర్పాటు ఊసే లేకపోవడంతో వాటి ఛైర్మన్‌గిరీ ఆశిస్తున్న వారు నిరాశకు గురవుతున్నారు. కేబినెట్ మంత్రి హోదా కలిగిన ఈ పదవి కోసం చాలా మంది వైసీపీ నాయకులు కాచుకు కూర్చున్నప్పటికీ ఫలితం లేకపోతోంది.
రాష్ట్రంలో నాలుగు ..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని భావించారు. మంత్రి పదవులు, ముఖ్యమైన పదవులు దక్కని నేతలకు ఈ పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదన కేవలం ఫైల్‌కే పరిమితమయింది. దీంతో ఆశావహులు ఎదురుచూపులు చూడటం తప్ప ఏం చేయలేకపోతున్నారు. జగన్ ఇటీవలి కాలంలో ప్రాంతీయ మండళ్ల ఊసే ఎత్తకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
అసమానతలు తొలగింపునకు
ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించేందుకు ఈ ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. ప్రాంతీయంగా అభివృద్ధితో పాటు రాజకీయంగా పార్టీని నమ్ముకున్న వారికి పదవులు వీటి ద్వారా లభిస్తాయి. కేబినెట్ ర్యాంకు కావడంతో సహజంగానే వీటిపై నేతలకు మక్కువ ఏర్పడింది. తమకు పదవి వస్తుందని ఎంతోమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.
రాష్ట్రంలో మొత్తం నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు విజయనగరం కేంద్రంగా ఒక మండలి, కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు కలిపి ఒక మండలి, గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, కడప కేంద్రంగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిపి ఒక మండలిని ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు.
కొత్త జిల్లాల ప్రకటన తరువాతే ..
ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు, ఛైర్మన్ల నియామకం ఇప్పటికీ జరిగిపోవాల్సింది గానీ, తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం. ఉగాది రోజున కొత్త జిల్లాలను ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది. అందువల్ల జగన్ ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ప్రకటన తర్వాతనే ప్రాంతీయ మండళ్ల గురించి మళ్లీ ఓసారి సమీక్షిస్తారని, అప్పుడే ప్రకటన ఉంటుందని నాయకులకు సంకేతాలు అందుతున్నాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఈ పదవుల మీద ఆశలు పెంచుకున్న వారు.. ఈ జాప్యంతో నీరసపడుతున్నారు. ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు జరగడం మాత్రం గ్యారంటీ అని ఆశపడుతున్న నేతలు- ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేక అయోమయంలో ఉన్నారు.