చాలాకాలం క్రితమే తెలుగు తెరకి తాప్సీ పరిచయమైంది. తేట కళ్లతో తెల్లగులాబీలా తెరపై కనిపించింది. ఆమె మేని ఛాయకి తెల్ల తెరకూడా తెల్లబోయింది. మొదటి సినిమాతోనే చాలామంది ఆమె అభిమానులుగా మారిపోయారు. ఆమె సినిమాను మొదటి రోజునే చూసేయాలనే వీరాభిమానులు జాబితాలో చేరిపోయారు. అలాంటి తాప్సీ తెలుగులో కొన్ని చెప్పుకోదగిన సినిమాలు .. పాత్రలు చేసింది. అప్పట్లోనే ఆమె ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ అనే కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో .. హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్ .. పారితోషికం విషయంలో ఇంత తేడాలెందుకూ? అంటూ అప్పట్లో తాప్సీ తన అసహనాన్ని ప్రదర్శించింది. అలా మాట్లాడితే ఏం జరుగుతుందనేది ఆమె చుట్టూ ఉన్నవారందరికీ తెలుసు. ఆ తరువాత ఆమెకి కూడా అర్థమైంది. దాంతో ఇక తనకి ఇక్కడ అవకాశాలు రావనే ఒక క్లారిటీ రాగానే బాలీవుడ్ బాట పట్టేసింది. పట్టుదలతో ప్రయత్నాలు చేసి అక్కడ కొన్ని అవకాశాలను దక్కించుకుంది. తాప్సీ కేవలం గ్లామరస్ పాత్రలకి మాత్రమే పనికొస్తుందని భావించినవారు, హిందీలో ఆమె చేసిన పాత్రలను చూసి కోలుకోవడానికి ఎక్కువ సమయమే తీసుకున్నారు.
అలాంటి తాప్సీ తాజాగా తన మనసులోని మాటను మళ్లీ ధైర్యంగా బయటపెట్టి చర్చల్లో నిలిచింది. ఇటీవల రామాయణంలోని ‘సీత‘ పాత్రకి గాను కరీనాను సంప్రదిస్తే, పారితోషికంగా ఆమె 12 కోట్లు అడిగిందట. ఆ విషయం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా., అక్కడక్కడా విమర్శలు కూడా వినిపించాయి. ఈ విషయంపై తాప్సీ స్పందిస్తూ .. “కరీనా దేశం మెచ్చిన సూపర్ స్టార్ .. ఆమె తన క్రేజ్ కి తగిన పారితోషికం అడగడం ఎలా తప్పు అవుతుంది? హీరో ఎంత అడిగినా ఇచ్చేస్తారు గానీ, హీరోయిన్ అడిగితే మాత్రం నానా రచ్చ చేసేస్తారు ఎందుకు? పౌరాణికం కదా అని స్టార్ హీరోలెవరూ ఫ్రీగా చేయడం లేదే” అంటూ అసహనాన్ని ప్రదర్శించింది.
Must Read ;- మళ్ళీ గ్లామర్ మంత్రం జపిస్తోన్న అందాల తాప్సీ











