మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఈ మధ్యనే ప్రారంభం అయ్యింది. అతిత్వరలోనే చిరు కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’, ‘వేదాళం’ సినిమాలను రీమేక్ చేయనున్నారు. ఆల్రెడీ ‘వేదాళం’ రీమేక్ వెర్షన్ కు మెహర్ రమేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోని ఒక ముఖ్య పాత్రకు హీరోయిన్ కీర్తి సురేష్ ను తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ‘లూసిఫర్’ విషయానికి వస్తే మొదట ఈ సినిమాను ‘సాహో’ దర్శకుడు సుజిత్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కాని సుజిత్ ‘లూసిఫర్’ కథను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చడంలో విఫలం అయ్యాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ను టాలెంటెడ్ డైరెక్టర్ వినాయక్ కు అప్పగించారు చిరు. వినాయక్ చిరుతో తీసిన ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలు మంచి విజయం సాధించాయి.
ఈ రెండూ రీమేక్ సినిమాలే. తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కథలను మన తెలుగువారికి నచ్చే విధంగా వినాయక్ తీర్చిదిద్దిన తీరు చిరును బాగా ఆకట్టుకుంది. అందుకనే చిరు ‘లూసిఫర్’ బాధ్యతలు వినాయక్ కు అప్పగించారు. వినాయక్ కూడా చాలా కష్టపడి ‘లూసిఫర్’ కథను మన ప్రేక్షకులకు నచ్చేలా భారీ మార్పులు చేశాడు. అయితే వినాయక్ మార్పులు చేసి రాసిన కామెడీ ట్రాక్ చిరుకు నచ్చలేదని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కొన్ని కొన్ని సన్నివేశాలలో ఇద్దరి మధ్య పొంతన కుదరలేదని, అందుకనే ఈ ప్రాజెక్ట్ నుండి వినాయక్ ను తప్పించనున్నారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఫైనల్ గా వినాయక్ ను తప్పించి ఆ స్థానంలో కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాను తీసుకొనే ఆలోచనలో చిరు ఉన్నారని సమాచారం. మోహన్ రాజా తమిళంలో ‘తనిఒరువన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమానే మన తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేసారు. ‘లూసిఫర్’ సినిమాకు దర్శకుడిగా మోహన్ రాజా అయితే బాగుంటుందని, తను సినిమాను చాలా స్టైలిష్ గా తీస్తాడని, అందుకనే ఆయన పేరును పరిశీలిస్తున్నారని టాక్. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే .
Must Read ;- ‘లూసిఫర్’ రీమేక్ లో మెగాస్టార్ తో రమ్యకృష్ణ?