టీపీసీసీ పరిస్థితి ప్రస్తుతం చాలా ఘోరంగా దయనీయంగా ఉంది. అయితే ఇంతకంటె దిగజారిపోయేది ఏమీ లేదు కాబట్టి.. పీసీసీ అధ్యక్షస్థానం విషయాన్ని ఇప్పట్లో తేల్చకపోయినా పర్లేదనే ధోరణిలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
పీసీసీ పదవే లక్ష్యంగా ఆవేశంతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు కాంగ్ నేతలు. మూడు నాలుగు రోజుల పాటు అక్కడే తిష్ట వేసుకు కూర్చున్నారు. అదిష్టానం చర్చలకు ఎప్పుడు పిలుస్తుందా అంటూ కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసారు. ఒకరిద్దరు నేతలు సోనియా, రాహుల్ లతో సమావేశం అయ్యారని కూడా పుకార్లు వినిపించాయి. ఎన్ని ముచ్చట్లు ఉన్నప్పటికీ.. సంగతి మాత్రం తేలలేదు. యథోరీతిగా.. అధిష్టానం- ఎప్పటి లాగానే ఈ అంశంపై తరువాత ఆలోచన చేద్దామని చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ పార్టీ నేతలంగా ఢిల్లీ నుంచి తిరుగు టపాలో బయల్దేరినట్టు సమాచారం.
ఇప్పటికే కొంత మంది నేతలు సొంత ఊర్లకు చేరుకున్నారు. దీంతో టీపీసీసీ పదవితోనే వస్తామన్న ధీమాతో వెళ్ళిన నేతలు గుట్టుచప్పుడు కాకుండా ఎవరి ఇంటికి వారు చేరుకోవడంతో ఏం జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ నేతలపై అధిష్టానం గుర్రుగా ఉందా..
ఖాళీ అయిన టీపీసీసీ పదవిని దక్కించుకునేందుకు ఢిల్లీ వెళ్లిన సీనియర్ నేతలపట్ల అధిష్టానం పెద్దలు పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. కనీసం తెలంగాణ నాయకులు ఎవరినీ కలిసేందుకు కూడా ఇష్టపడలేదని ఢిల్లీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తెలంగాణ ఇవ్వక ముందు ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఆ తరువాత కనీసం పత్తా లేకుండా పోవడానికి వారిదే బాధ్యత అనే ఉద్దేశంతో.. తెలంగాణ నేతలపై సోనియా , రాహూల్ సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఇదే అంశాన్ని అధిష్టానాన్ని కలిసిన నేతలవద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీంతో వారు సమాధానం చెప్పుకోలేక పోయారని చెబుతున్నారు పార్టీ నేతలు.
తమకే పీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వాలని లేదంటే పార్టీలో ఏళ్ళతరబడి పనిచేస్తున్న తమలో ఎవరికైనా పీసీసీ పదవి ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కు ప్రయత్నించారు నేతలు. అయితే వారి లాబీయింగ్ ఈ సారి ఏమాత్రం ఫలించలేదు. పార్టీ సారథ్య పదవికి సంబంధించి తాము రకరకాల డిమాండ్లతో అడగడానికి వెళ్తే.. తీరా అక్కడికెళ్లాక.. తమనే కార్నర్ చేసి.. వైఫల్యాలకు బాధ్యులుగా నిలదీయడంతో ఖంగుతినడం వారి వంతు అయింది. అధిష్టానం వద్ద తాము ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా తెలియని కన్ఫ్యూజన్ లో పడిపోయారుట.
అప్పుడేం చేసారు..
తెలంగాణ ఇస్తే తెలంగాణలో పార్టీకి తిరుగుండదని ఉద్యమ సమయంలో అప్పటి నేతలు లాబీయింగ్ చేశారు. అయితే రాష్ట్ర ఏర్పాటు తరువాత కనీసం కంటికి కూడా కనిపించకుండా పార్టీ పూర్తిగా నష్టపోవడం ఏంటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని ప్రజల్లోకి తీసుకు పోవడంతో కాంగ్రెస్ నేతలు విఫలం అయ్యారని.. ఇప్పుడు మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇవ్వవద్దంటూ లాబీయింగ్ చేసేందుకు వచ్చారా అంటూ తలంటినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఎవరికి అధ్యక్ష పీఠం ఇవ్వాలో తమకు తెలుసని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి కిప్పుడు రాష్ట్రంపై దృష్టి సారించలేమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకాస్త ఆలస్యం అయినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని..ఇంత కంటే అధ్వాన్నంగా పార్టీ పరిస్థితి మారదు కాబట్టి.. కొంత ఆలస్యంగా అయినా సమర్దుడైన నాయకుడికి పార్టీ ని అప్పజెప్పే మూడ్ లో అధిష్టానం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తానికి తామే పీసీసీ అటూ హస్తిన వెళ్ళిన హస్తం నేతలు రిక్త హస్తాలతో తిరిగి వచ్చారని టాక్ నడుస్తోంది.










