కరోనా సమయంలో మసాలా కోరుకునే వారి కోసం అన్నట్టుగా వచ్చింది ‘డర్టీ హరి’ చిత్రం. థియేటర్లలో విడుదల కావలసిన ఈ చిత్రం చివరికి ఏటీటీలో విడుదల కావలసి వచ్చింది. భారీ చిత్రాల నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా చేసిన మరో ప్రయత్నం ఇది అని కూడా చెప్పవచ్చు. ఎమ్మెస్ రాజు ఇలాంటి చిత్రానికి దర్శకత్వం వహించడం ఏమిటి అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ సినిమా ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.
కథలోకి వెళితే..
చదరంగం నేపథ్యంలో కథ సాగుతుంది. హరి (శ్రావణ్ రెడ్డి) చెస్ లో నిపుణుడు. అనేక పతకాలు కూడా సాధిస్తాడు. ఆటగాడిగా మంచి పేరుంది కాబట్టి హైదరాబాద్ కు వచ్చి ఓ క్లబ్ లో చెస్ కోచ్ గా చేరతాడు. అక్కడతనికి ఓ ధనవంతుల కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. ఆ కుటుంబానికి చెందిన వైదేహి (రుహాని)తో అతను ప్రేమలో పడతాడు. చివరికి పెళ్లి కూడా జరుగుతుంది.
ఇక్కడే వీరి మధ్య మూడో వ్యక్తి చేరాల్సి వస్తుంది. వైదేహి అన్నయ్యకు లవర్ అయిన జాస్మిన్ కూడా హరికి దగ్గరవుతుంది. రహస్యంగా ఆమెతో రాసలీలలు సాగిస్తాడు హరి. చివరికి జాస్మిన్ గర్భవతి అవుతుంది. భార్యను వదిలేయాలని పట్టుబడుతుంది జాస్మిన్. అక్రమ సంబంధాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. హరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ ట్రాయాంగిల్ శృంగారం ఎలాంటి అనర్థాలకు దారితీసింది అనేది చూడాల్సిందే.
ఎలా తీశారు, ఎలా చేశారు?:
హాలీవుడ్ సినిమా ‘అన్ ఫెయిత్ ఫుల్’ దీనికి ప్రేరణ. ఇలాంటి కంటెంట్ కు థియేటర్లో వస్తే సెన్సార్ తప్పని సరి. ఓటీటీ, ఏటీటీలకు పనికొచ్చే సినిమా ఇది. మితిమీరిన శృంగారంతో యువతను ఆకట్టుకునేందుకే ఈ సినిమా రూపొందించినట్టు అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికే ఇలాంటి కథలు చాలా వచ్చాయి. వాస్తవానికి దూరంగా అనిపించే కథ, ఆకట్టుకోని కథనంతో పేలవంగా సాగుతుంది. కథనం మీద అంతగా దృష్టిపెట్టినట్టు అనిపించదు. కథకు ఓ ముగింపు ఇవ్వాలి కాబట్టి మర్డర్ మిస్టరీని జోడించారు.
ఎమ్మెస్ రాజు దర్శకుడిగా ఇలాంటి కథను ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాదు. ఆయన సినిమా నేపథ్యానికీ, ఈ సినిమాకీ అసలు పోలికే ఉండదు. పైగా ఆయన వయసులో చేయాల్సిన సినిమా కూడా కాదు. కాకపోతే ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కుర్ర దర్శకుడే అనిపిస్తుంది. శృంగార సన్నివేశాలను మాత్రం ఆయన అంతబాగా రక్తికట్టించగలిగారు. నటీనటుల పరంగా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ తరహా కథలకు ఇలాంటి నటులైతేనే బాగుంటుంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా కావివి. హీరోయిన్ సిమత్ బోల్డ్ గా నటించింది.
నటీనటులు: శ్రావణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని వర్మ, అప్పాజీ అంబరీష, సురేఖా వాణి, అజయ్
సంగీతం: మార్క్ .కె. రాబిన్
కెమెరా: బాల్ రెడ్డి
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయిపునీత్, కేదార్ సెలగంశెట్టి, వం శీ కారుమంచి
రచన – దర్శకత్వం: ఎం.ఎస్. రాజు
విడుదల: ఫ్రైడే మూవీస్ యాప్
ఒక్కమాటలో: కొత్త సినిమాలో పాత కథ
రేటింగ్ – 2.5/5
– హేమసుందర్ పామర్తి











