సోనియా సలహాదారు, రాజ్యసభ ఎంపీ, ఏఐసీసీ కోశాధికారి, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. అహ్మద్ పటేల్‌కు కరోనా సోకడంతో నెల రోజులుగా ఆయన గురుగావ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే మృతి చెందినట్లు ప్రకటించిన అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో బుధవారం తెల్లవారు జామున 3:30కి కన్నుమూసినట్లుగా తెలిపారు. అక్టోబర్ 1న అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నవంబర్ 15న గురుగావ్ మేదాంత ఆసుపత్రిలో ఐసీయూలో చేరారు. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ కి రాజకీయ కార్యదర్శిగా అహ్మద్ పటేల్ పనిచేసారు.
సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ పలుమార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీ కోశాధికారిగా ఉన్నారు.
1976లో కాంగ్రెస్ పార్టీలో చేరిన అహ్మద్ పటేల్, 1977 నుంచి 1989 వరకు మూడు సార్లు గుజరాత్ బరూచ్ నియోజకర్గం నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు. 1993 నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో అహ్మద్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా అహ్మద్ పటేల్ కు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ‘అమ్మ’కే స్టార్ క్యాంపెయినర్.. మళ్లీ ఆ పార్టీలోకే..
ప్రధాని మోడీ సంతాపం
అహ్మద్ భాయ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని, ఆయన కుమారుడు ఫైసల్ పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు. అహ్మద్ పటేల్ మరణం బాధ కలిగించిందన్నారు. సమాజసేవ చేస్తూ ప్రజా జీవితంలో అహ్మద్ పటేల్ సంవత్సరాలు గడిపారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో అహ్మద్ పటేల్ పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుందని మోడీ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ సంతాపం
ఇది విచారకరమైన రోజు.. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మూలస్థంభం వంటి వారు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కష్ట సమయాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ఆస్తి అని, అహ్మద్ పటేల్ లేని లోటు ఎప్పికీ తీరనిదని రాహుల్ వ్యాఖ్యానించారు.
రణదీప్ సూర్జేవాలా సంతాపం
అహ్మద్ పటేల్ లేరన్నది నమ్మలేకపోతున్నా, చిన్న పెద్ద రాజకీయ ప్రత్యర్ధులు సైతం ‘అహ్మద్ భాయ్’ అంటూ గౌరవించే వ్యక్తి ఇక లేరు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ఎల్లప్పుడూ విధేయతగా విధిని నిర్వర్తించిన వ్యక్తి అహ్మద్ పటేల్ అని, ఆయన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ తన కుటుంబంగా భావించే వారని అన్నారు. ప్రత్యర్థులు ఎన్ని రాజకీయ దాడులు చేసినా మంచి మనసుతో వాటిని పట్టించుకోని వ్యక్తి అహ్మద్ పటేల్ అని సూర్జేవాలా అన్నారు.
Also Read ;- కాంగ్రెస్ ట్రబుల్ షూటరే బీజేపీ టార్గెట్!











