పాత్ర ఏదైనా దానిని సహజత్వం దిశగా పరుగులు తీయించే పాలకుడు. మూడు దశాబ్దాల పై నుంచి జరుగుతున్న పరిణామం .. మూడు ముక్కల్లో చెప్పలేని ప్రయాణం. ఆయన ప్రాణం .. ధ్యానం .. యోగం .. భోగం అన్నీ సినిమానే. ఒక్క మాటలో చెప్పాలంటే విరామమెరుగని పోరాటమే వెంకటేశ్ .. విజయాలతో ఏర్పడిన విడదీయరాని అనుబంధమే వెంకటేశ్. సినిమాకి కథే ప్రాణం .. బలమైన కథ మాత్రమే సినిమాను నడిపిస్తుంది .. గెలిపిస్తుంది. మంచి కథకు హీరోల స్టార్ డమ్ తోడవుతుంది .. కానీ స్టార్ డమ్ తో మాత్రమే సినిమాలు ఆడవు. తెరపై ఖర్చు కాదు .. కథ కనిపించాలి.
కథను విడిచి సాముచేసిన ఏ సినిమా విజయాన్ని సాధించలేదు .. ఏ ప్రయోగం ఫలించలేదు అనే విషయాన్ని పూర్తిగా విశ్వసించిన కథానాయకుడిగా వెంకటేశ్ కనిపిస్తారు. వెంకటేశ్ తండ్రి రామానాయుడు అగ్రనిర్మాత. ఆయన ఏలుబడిలో ఎన్నో సినిమాలు వెండితెరపై వీర విహారం చేశాయి. .. తెలుగు సినిమా కథా బలాన్ని చాటిచెప్పాయి. కథ సంతృప్తికరంగా వస్తేనే తప్ప అప్పట్లో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు కాదు. సురేశ్ బాబుకు కూడా కథాకథనాలపై మంచి అవగాహన ఉంది. కథ విషయంలో క్లారిటీ వచ్చేంతవరకూ ఆయన కసరత్తు చేయిస్తూనే ఉంటారు. ఆ పద్ధతిని ఫాలో కావడమే వెంకటేశ్ విజయ రహస్యమని చెప్పుకోవాలి.
Must Read ;- టీజర్ టాక్ : ఆవేశంతో గర్జించిన ‘నారప్ప’
ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలుగా కృష్ణ .. శోభన్ బాబు తమ జోరును కొనసాగిస్తూనే వస్తున్నారు. మరో వైపున చిరంజీవి .. బాలకృష్ణ తమ మార్కు సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే వెంకటేశ్ రంగంలోకి దిగారు. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసిన ఆయన, ‘కలియుగ పాండవులు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు.
తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న వెంకటేశ్, ఓ అగ్ర నిర్మాత తనయుడిననే ఆలోచనతో రిలాక్స్ కావడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రతి పాత్రను ఒక పాఠంగా .. ప్రతి సినిమాను ఒక పరీక్షగా భావిస్తూనే ఆయన ముందుకువెళ్లారు. సినిమాకి .. సినిమాకి తన బాడీ లాంగ్వేజ్ లోను .. డైలాగ్ డెలివరీలోను మార్పులు చేసుకుంటూ వెళ్లారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను సెట్ చేసుకున్నారు.
పట్టుమని పది సినిమాలు కూడా పూర్తికాకముందే, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించడానికి వెంకటేశ్ అంగీకరించడం ఆయన చేసిన తొలి సాహసమని చెప్పాలి .. ఆ సినిమానే ‘స్వర్ణకమలం’. ఆ సాహసానికి ప్రతిఫలంగానే ఆయనకి ఉత్తమ నటుడిగా ‘నంది అవార్డు’ లభించింది. కళను ఆరాధించేవాడిగా .. కళాకారిణిని ప్రేమించేవాడిగా .. ఆమెలో అంకితభావాన్ని పెంపొందించేవాడిగా ‘చందూ’ పాత్రలో వెంకటేశ్ శభాష్ అనిపించుకున్నారు.
Also Read ;- ‘ఎఫ్ 3’లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరా ముద్దుగుమ్మలు?
వెంకటేశ్ ను ఎన్నో విభిన్నమైన కథలు .. వైవిధ్యభరితమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎప్పటికప్పుడు జోనర్లను మార్చుకుంటూ, ‘లుక్’ నుంచి మొదలుపెడితే ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఆయన తన దూకుడు పెంచారు. కథల్లో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పాళ్లు ఉండేలా చూసుకున్నారు. అలా వచ్చిన ‘ప్రేమ’ .. ‘బొబ్బిలిరాజా‘ .. ‘కూలి నెం1’ .. ‘క్షణక్షణం’ .. ‘చంటి’ .. ‘సుందరకాండ’ .. వెంకటేశ్ క్రేజ్ ను అంచెలంచెలుగా పెంచుతూ వెళ్లాయి. అప్పటికే స్టార్ హీరోలుగా సాగుతున్నవారి సరసన వెంకటేశ్ స్థానాన్ని సుస్థిరం చేశాయి.
నవరసాల్లో హాస్యరసాన్ని పండించడమే చాలా కష్టం .. అలాంటి హాస్యాన్ని వెంకటేశ్ తనదైన శైలిలో అవలీలగా పండించేవారు. ఆ హాస్యం కూడా ఎంతో సహజంగా ఉండి గిలిగింతలు పెట్టేది. ‘నువ్వునాకు నచ్చావ్’లో ‘జస్ట్ వెంకీ’ అంటూ ఆయన చేసిన అల్లరి .. ‘మల్లీశ్వరి’లో పెళ్లికాని ప్రసాద్ గా చేసిన సందడి .. ‘నమో వెంకటేశ‘లో “సుందరం మాస్టారూ ..” అంటూ తాగిన మైకంలో ఎదుటివారిని ఉతికేసే వెంకటరమణ పాత్రలో ఆయన చేసిన హడావిడి .. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో ఆంగ్లం రాక ఆయన పడిన అవస్థలను ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు.
ఎప్పటిదాకో ఎందుకూ ఈ మధ్య వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమాలో “తరతరాలుగా భార్యలు పెట్టే బాధలకు భర్తలు బలి కావలసిందేనా?” అంటూ ఆయన హాస్యాన్ని హైవేపై పరుగులు తీయించిన తీరును ఇప్పటికీ తలచుకోనివారులేరు. ఈ సినిమాలన్నీ కూడా వెంకటేశ్ హాస్యరస పోషణకు కొలమానంగా నిలుస్తాయి. కెరియర్ తొలినాళ్లలో రీమేక్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపుతూ వచ్చిన వెంకటేశ్, ఆ తరువాత అప్పుడప్పుడు మాత్రమే వాటికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అలాగే కొత్తదనం కోసం మల్టీ స్టారర్లు చేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అలా కూడా ఆయనకి విజయాలే దక్కడం విశేషం.
కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వెంకటేశ్ తన సరసన కొత్త కథానాయికలను ప్రోత్సహిస్తూ వెళ్లారు. అలా ఆయన సినిమాల ద్వారా తెలుగు తెరకి ‘టబు’ .. ‘దివ్యభారతి’ .. ‘గౌతమి’ .. ‘ఆర్తి అగర్వాల్’ .. ‘ప్రీతిజింతా’ .. కత్రినా కైఫ్‘ .. ‘అంజలా జవేరి’ పరిచయమయ్యారు. వెంకటేశ్ జోడీగా ఎంతమంది కథానాయికలు ఆడిపాడినప్పటికీ సౌందర్యతో ఆయన చేసిన సినిమాలకి ఎక్కువ ఆదరణ లభించింది. ఈ ఇద్దరూ ‘హిట్ పెయిర్’ గా ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు. సౌందర్య తరువాత వెంకటేశ్ జోడీగా మెప్పించిన ఘనత ‘మీనా’కే దక్కుతుంది. అందుకు ఉదాహరణగా ‘చంటి’ .. ‘సుందరకాండ’ .. ‘అబ్బాయిగారు’ వంటి సినిమాలను చెప్పుకోవచ్చు.
యాక్షన్ .. ఫ్యాక్షన్ సినిమాల్లో వెంకటేశ్ విశ్వరూపం ఎలా ఉంటుందనే విషయాన్ని ‘ప్రేమంటే ఇదేరా’ .. ‘జయం మనదేరా’ వంటి సినిమాలు నిరూపిస్తాయి. ఇక బలమైన ఎమోషన్స్ కలిగిన పాత్రలను ఆయన ఎంత బాగా చేస్తాడనడానికి నిదర్శనంగా ‘దృశ్యం’ వంటి సినిమాలు నిలుస్తాయి. మూడు దశాబ్దాలకి పైగా తన కెరియర్ ను అప్రతిహతంగా కొనసాగిస్తున్న వెంకటేశ్, ఇంతవరకూ 70కి పైగా సినిమాలను పూర్తి చేశారు. ఉత్తమనటుడిగా పలుమార్లు నంది అవార్డులను అందుకున్నారు.
ఈ తరం ప్రేక్షకులు ఆశిస్తున్న మార్పును అందుకుంటూ, యువదర్శకులతో సినిమాలు చేయడానికి వెంకటేశ్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన తాజా చిత్రంగా ‘నారప్ప’ సెట్స్ పై ఉంది. మొదటి నుంచి కూడా వెంకటేశ్ వివాదాలకు దూరంగా ఉంటూ, విమర్శలకు తావివ్వకుండా వచ్చారు. తన కెరియర్ పై మాత్రమే ఆయన పూర్తి దృష్టి పెట్టారనే విషయం అడుగడుగునా కనిపిస్తుంది. అందువల్లనే ఆయన విజయానికి చిరునామాగా మారారు .. విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయనకు ‘ది లియో న్యూస్’ శుభాకాంక్షలు అందజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
My hero. my friend. My senti half. My Venky. As you celebrate your birthday today, sending you nothing but tons of love, warm wishes, hugs and kisses. God bless you my dear. @VenkyMama 🎂🎂🎂🎂❤❤❤❤🤗🤗🤗🤗💝💝💝💝😍😍😍😘😘😘😘😘 pic.twitter.com/YrCChsXvJP
— KhushbuSundar ❤️ (@khushsundar) December 13, 2020
Also Read ;- సింహాచలంలో ఆ దర్శకుడి ప్రత్యేక పూజలు… ఎందుకు?