ప్రతీ ఏడాది టాలీవుడ్ కు సంక్రాంతి సీజన్ ఎంత స్పెషలో.. ఎండలు మండే మే నెల కూడా అంతకన్నా ఎక్కువ స్పెషల్. ఈ రెండు సీజన్సూ విద్యార్ధులకు శెలవులు ఇచ్చే సమయం. అంతేకాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ సీజన్ లో వచ్చిన సినిమాల్ని ఆస్వాదించాలనుకుంటారు. అందుకే కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీ .. ప్రత్యేకించి ఈ సంక్రాంతి, మే నెల మీద బాగా ఫోకస్ పెట్టింది. ఈ సంక్రాంతికి క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి.. ఇండస్ట్రీకి మంచి బూస్టప్ నిచ్చింది.
అందుకే ఇప్పుడు సీనియర్ హీరోలు .. మరో అతి ముఖ్యమైన సమ్మర్ సీజన్ మీద ఫోకస్ పెట్టారు. కరోనా కారణంగా ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ను మిస్ అయిన సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, వెంకీ లు తమ సినిమాల్ని సమ్మర్ సీజన్ లో విడుదల చేస్తూ .. బాక్సాఫీస్ ను మరింతగా హీటెక్కించబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి .. కొరటాల దర్శకత్వంలో నటిస్తోన్న ఆచార్య సినిమాను మే 13న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. బిఫోర్ లాస్టియర్ సైరా సినిమాతో మెప్పించిన చిరు.. ఈ ఏడాది ఆచార్య తో అదరగొట్టబోతున్నారు. ఇటీవల విడుదలయిన టీజర్ రికార్డు వ్యూస్ తెచ్చుకొని అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే.
అలాగే.. నట సింహ నందమూరి బాలకృష్ణ.. బోయపాటి దర్శకత్వంలో రూపొందిస్తున్న మూడో సినిమాను యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన నేపథ్యంలో ఇప్పుడీ సినిమామీద అంచనాలు రెట్టింపయ్యాయి. రెండు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించబోతున్న బాలకృష్ణ .. ఈ సినిమాతో కూడా బాక్సాఫీస్ ను దడదడలాడిస్తాడని అర్ధమవుతోంది.
ఇక విక్టరీ వెంకటేశ్ సైతం తన తాజా చిత్రం ‘నారప్ప’ తో ఈ ఏడాది సమ్మర్ సమరానికి సిద్ధమవుతుండడం విశేషం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరెకెక్కుతోన్న ఈ సినిమా మే 14న విడుదల కాబోతోంది. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ చిత్రానికిది రీమేక్ వెర్షన్. మరి ఈ సినిమాలతో సీనియర్ హీరోలు.. ఈ సమ్మర్ లో ఏ రేంజ్ లో అభిమానుల్ని అలరిస్తారో చూడాలి.
Must Read ;- టాలీవుడ్ లో 2022 సంక్రాంతికి బిగ్ ఫైట్











