దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. 1990వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో డా.రవి శంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్నగా రానా కనిపించనున్నారు. రానా సరసన సాయిపల్లవి నటిస్తుంటే.. ప్రియమణి కామ్రేడ్ భారతక్క అనే కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాని గత సంవత్సరం సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా కుదరలేదు. అయితే.. డిసెంబర్ నుంచి థియేటర్లు ఓపెన్ చేయడం.. సంక్రాంతికి రిలీజైన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో చిత్ర నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక విరాటపర్వం చిత్రాన్ని ఏప్రిల్ 30 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్టుగా ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేశారు.
డి.సురేష్‌బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. నివేదా పేతురాజ్, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ.. కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవ్ గా నటించి మెప్పించిన రానా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా విభిన్న కథా చిత్రాలనే ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు.
రుద్రమదేవి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, అరణ్య.. ఇలా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్న రానా నక్సలైట్ గా విరాటపర్వం సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా పై ప్రారంభం నుంచి ఆసక్తి ఏర్పడింది. మరి.. కామ్రేడ్ రవన్నగా రానా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Must Read ;- పవన్ కళ్యాణ్, రానాల సినిమా షూటింగ్ కు శ్రీకారం