వైసీపీలో అధికారం ఉన్నా కేడర్ నుంచి లీడర్ వరకూ పూర్తిగా నిస్తేజం అలముకోవడం కనిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, బయటపడితే అరెస్టులు, కేసులు భయం వెంటాడుతుండడంతో మనసులో ఉంచుకుని రగిలిపోతున్నారు. ఈ వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయని వైసీపీ మీడియాలోనూ విశ్లేషణలు వస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులలో తీవ్ర అసంతృప్తి వుందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఓ వైపు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూనే, మరోవైపు అనుబంధ సంఘాలు, పార్టీ కమిటీలన్నీ వేసుకుంటూ దూసుకుపోతోంది. తెలుగుయువత, తెలుగు మహిళ, తెలుగు రైతు, తెలుగునాడు ట్రేడ్‌యూనియన్ , టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీలకు కొత్త కార్యవర్గాలను ప్రకటించి, పార్లమెంటరీ కమిటీలు కూడా వేసేశారు. పెద్దాయన చంద్రబాబు తనశైలికి భిన్నంగా మీడియా ముందుకి ఎక్కువగా రాకుండా, కార్యాచరణ కార్యక్రమాలలోనే ఎక్కువగా ఉంటున్నారు.
నారా లోకేశ్ దూకుడు
తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ మంచి దూకుడు మీదున్నారు. ఓ వైపు విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూనే, మరోవైపు కష్టాలలో ఉన్న రైతుల్ని పరామర్శిస్తూ.. దాడులకు గురైన పార్టీ కేడర్.. లీడర్లలో ఆత్మస్తైర్యం నింపేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సోషల్‌మీడియా టీములు కూడా ఎంతమందిని అరెస్ట్ చేసినా ఒక్కరూ వెనక్కి తగ్గడంలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారిని ఒకవేళ ప్రభుత్వం మూర్ఖంగా అరెస్ట్ చేసినా, క్షణాల్లో లీగల్ టీమ్‌ని అలెర్ట్ చేసి, పార్టీ లీడర్లతో అన్నివిధాలా సాయం అందిస్తున్నారు.
అచ్చెన్న జోరు
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకంతో తెలుగుదేశం బీసీలకిచ్చే ప్రాధాన్యత ఏ స్థాయిలో వుంటుందో అర్థమైన వెనకబడిన వర్గాలకు చెందిన నేతలూ యాక్టివ్ అయ్యారు. అచ్చెన్న కూడా రాజకీయ కదనరంగంలో దూకి తనదైన శైలిలో కార్యక్రమాలు జోరు పెంచారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద అస్సెట్‌గా వున్న సబ్జెక్ట్ నిపుణులు కూడా కొన్నాళ్లు మౌనంగా ఉన్నవారంతా ఫుల్లుగా యాక్టివ్ అయ్యారు.
లెక్కలు సరిచేస్తున్న పయ్యావుల
సర్కారు లెక్కలు.. బొక్కల్ని పట్టుకుని పయ్యావుల కేశవ్ జగన్‌రెడ్డి టీమ్‌కి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ అప్పులు, ఆర్థిక స్థితి, రుణ ఒప్పందాలపై మీడియా ముందుకి ఇటీవల వరసగా వస్తున్న పయ్యావుల కేశవ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీనికంటే ముందు ధూళిపాళ్ల నరేంద్ర ఒక్కసారిగా కదనరంగంలోకి దిగారు. అసైన్డ్ రైతుల పేరుతో అమరావతిపై బురద చల్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ తప్పుడువేనని ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోలు బయటపెట్టి వైసీపీ సర్కారుని ప్రజల ముందు దోషిగా నిలపగలిగారు. దీంతో ఆయనని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకు గురిచేసినా, న్యాయపోరాటంలో విజయమే సాధించారు.
Must Read ;- నేల విడిచి సాము.. ఇన్‌సైడర్ లో జగన్ చేసిందిదేగా
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు అంతా యాక్టివ్‌గా పనిచేస్తూ దూసుకుపోతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజావ్యతిరేకత తీవ్రంగా వుండడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జనంతో మమేకమవుతూ వస్తున్నారు.