కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎట్టకేలకు కాషాయం కండువా కప్పుకున్న విజయశాంతి దేనికైనా రెడీ అంటున్నది. పార్టీ ఆదేశిస్తే ఏ బాధ్యతలు చేపట్టేందుకైనా తాను సిద్ధమేనని రాములమ్మ అంటోంది. కొన్ని రోజుల సస్పెన్స్‌కు తెరదించుతూ బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చేరిన ఆమెకు ఇప్పుడు ఏ పదవి ఇస్తారు? ఎలాంటి బాధ్యతలను అప్పగిస్తారు? అనేది చర్చగా మారింది. రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగిస్తారా? లేదా జాతీయ స్థాయిలో ఆమెకు చోటు కల్పిస్తారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.
సినిమాలో మంచి పేరు సంపాధించుకున్న అనంతరం రాజకీయాలపై విజయశాంతి కన్నేశారు. 1998 జనవరి 26న ఆమె బీజేపీలో చేరారు. అయితే కొన్ని కారణాలతో 2005లో ఆమె బీజేపీ పార్టీని వీడారు. ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించడం అనంతరం ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడం జరిగాయి. తెలంగాణను ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రోజునే తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ ఆ నాడు తొలగించారని ఆమె పేర్కొన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు కేసీఆర్‌తో చేతులు కలిపారని ఆమె సంచలన వ్యాఖ్యలు తాజాగా చేశారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తాను బీజేపీలోకి జాయిన్ అవుతున్నట్లు సంకేతాలను ఇస్తూ వచ్చారు విజయశాంతి. అయితే ఆమె చేరికపై కొన్ని భిన్న వాదనలు కూడా వినిపించాయి. తన రాజకీయ భవష్యత్తుపై ఎలాంటి హామీ రాకపోవడంతోనే బీజేపీలో ఆమె చేరికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోందని చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే.
వీటన్నిటికీ తెరదించుతూ ఢిల్లీలో నిన్న ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఆమెకు ఎలాంటి పదవి కట్టబెడుతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రాజ్యసభ సీటును ఇస్తారనే ప్రచారం ఒకటి వినిపిస్తోంది. అయితే తనను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవాలా? జాతీయ స్థాయిలో చోటు కల్పించాలా? లేకుంటే మరే ఇతర బాధ్యతలనైనా అప్పగించాలా? అనేదానిపై బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మాత్రం పార్టీ ఆదేశిస్తే ఏ బాధ్యతలు తీసుకునేందుకైనా తాను సిద్ధమేనని పేర్కొంటున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం కోసం తనవంతు పాత్ర వహిస్తానని పేర్కొన్నారు. ముందస్తుగా ఆమెను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ సభ్యత్వ రసీదును అందించారు. అనంతరం అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశాక ఆయన కూడా పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కూడా కలిశారు. ఇలా ఆసక్తికరంగా తన ఢిల్లీ పర్యటన సాగింది. విజయశాంతి వెంట కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు.
Must Read ;- బీజేపీ బీహార్ వ్యూహం తమిళనాడులో పనిచేస్తుందా?