పవన్ కల్యాణ్ .. ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లలో పూనకాలు తెప్పించే శక్తి ఈ పేరుకు ఉంది. కథ ఏదైనా .. దర్శకుడు ఎవరైనా .. బడ్జెట్ ఎంతైనా .. ఆయన జోడీ ఎవరైనా .. ఆ విషయాలన్నిటికీ ఆయన అభిమానులు ఇచ్చే స్థానం రెండవదే .. మొదటిస్థానం పవన్ దే. ఆయన పేరు కనిపిస్తే చాలు వాళ్లంతా థియేటర్స్ లో వాలేస్తారు .. హౌస్ ఫుల్ వసూళ్లను అందిస్తారు .. కొత్త రికార్డుల దిశగా ఆయన సినిమా పరుగులు తీస్తుంటే మురిసిపోతారు. అలాంటి పవన్ ఆ మధ్య సినిమాలకి దూరమైనప్పుడు వాళ్లు ఎంతగా బాధపడ్డారో .. తిరిగి సినిమాలకి దగ్గరవుతున్నప్పుడు అంతకంటే ఎక్కువగా ఆనందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్‘ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘దిల్’ రాజు .. బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. కొత్త ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కథ హిందీలోను .. తమిళంలోను కాసుల వర్షం కురిపించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అందువలన తెలుగులో రీమేక్ అవుతోంది. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కథ కావడం వలన, పవన్ కూడా ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిని చూపించాడు. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
పవన్ ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడమనేది తమకి సంతోషాన్ని కలిగించే విషయమే అయినప్పటికీ, ఆయన నుంచి తాము ఆశిస్తున్న సినిమా మాత్రం ‘విరూపాక్ష’ అనే అభిమానులు అంటున్నారు. పవన్ అంటేనే పవర్ఫుల్ .. అది బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొట్టే ఒక శక్తిమంతమైన అస్త్రం. అందువలన ఆయన క్రేజ్ కి .. ఇమేజ్ కి .. హీరోయిజానికి తగిన సినిమా ‘విరూపాక్ష‘ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తుపాకులు .. గుర్రాలతో తెరపై పవన్ ప్రత్యక్షమైతే ఆ కిక్కేవేరప్పా అన్నట్టుగా ఉంటుంది. అలాంటి కథతోనే ‘విరూపాక్ష’ రూపొందనుంది.
క్రిష్ దర్శకత్వంవహించనున్న ఈ సినిమా మొఘల్ పాలనాకాలంతో ముడిపడి నడుస్తుందని సమాచారం. ‘కోహినూర్’ వజ్రం చుట్టూ .. దానిని చేజిక్కించుకునే రాబిన్ హుడ్ పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందువలన మొదట్లో ఈ సినిమాకి ‘కోహినూర్’ అనే టైటిల్ ను కూడా పరిశీలించారు. కథ విభిన్నమైనది కావడంతో .. చారిత్రక నేపథ్యంతో కూడుకున్నది కావడంతో .. భారీ బడ్జెట్ తో నిర్మితం కానుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే వచ్చే ఏడాదిలో ‘విరూపాక్ష’ విజయవిహారం ఒక రేంజ్ లో కొనసాగనుందనే విషయం మాత్రం అర్థమవుతోంది.
Must Read ;- మహేష్, నమ్రతలకు గిఫ్ట్ లు పంపిన పవన్ దంపతులు