మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2 విడుదలకు ముందే వివాదానికి కేంద్రం బిందువుగా మారింది. తన కూతురు అలియా భట్ తో మహేష్ తొలిసారి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలయింది. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ఎక్కువగా డిస్‌లైక్ పొందిన సినిమా ట్రైలర్‌గా అవతరించింది. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ను ఇప్పటి వరకు 15 మిలియన్ల మందికి పైగా చూడగా 2,55,000 లైక్స్ వచ్చాయి. ఈ ట్రైలర్ కు ఏకంగా 4.5 మిలియన్ల ‘డిస్‌లైక్’ రావడం గమనార్హం. 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలో యూట్యూబ్‌లో అత్యధికంగా డిస్‌లైక్ వీడియోగా నిలవడంపై బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు ‘నేపోటిజం’ కారణమంటూ ఆరోపిస్తున్న అతని అభిమానులు ఈ సినిమా ట్రైలర్ ను డిస్‌లైక్ చేయాలని ప్రచారం చేశారు. దీంతో ఎక్కువ మంది ఈ ట్రైలర్ ను డిస్‌లైక్ చేశారు. సుశాంత్ ను బాలీవుడ్ పెద్దలు కావాలనే చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించారని అభిమానులు, నెటిజన్స్, కొందరు సినీ ప్రముఖులు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఎదురుకావడంతో మహేష్ భట్ తన పెద్ద కూతురు పూజ భట్ ద్వారా “సినిమా చివరి ప్రయాణంలో నేను ఎటువంటి కీర్తి కోసం పాకులాడటం లేదు. ఎవరికీ నిరూపించడానికి ఏమీ లేదు. సినిమా విజయం సాధిస్తే అది మీ అందరికీ చెందుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే అది నాది” అంటూ మహేష్ భట్ అభిమానులతో ఓ సందేశాన్ని పంచుకున్నారు.
20 సంవత్సరాలు దర్శకత్వానికి దూరంగా ఉన్న మహేష్ భట్ తిరిగి తెరకెక్కించిన ఈ చిత్రం ‘సడక్’ సీక్వెల్ గా వస్తోంది. సంజయ్ దత్,పూజ భట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 1991లో విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తమిళ, తెలుగులో మహారాణి పేరిట రీమేక్ అయింది. ఈ సినిమాలో అలియా భట్ కు జోడిగా ఆదిత్యరాయ్ కపూర్ నటించారు. గుల్షన్ గ్రోవర్, మకరంద్ దేశపాండే, జిశు సేన్ గుప్తా మిగిలిన పాత్రలో నటించారు. ఈ సినిమాని ముందుగా ఆగష్టు 28న థియేటర్లలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సినిమా డిస్నీ-హాట్ స్టార్ లో విడుదల కానుంది.










