YSRCP MLA Vidadala Rajini’s Portrait As A Tattoo On The Hand Of A Telangana Youth :
అభిమానంలో చాలా రకాలు ఉంటాయి. సినిమా నటులు కేవలం తమ అభిమానుల ఆదరాభిమానాలనే గీటురాయిగా చేసుకుని సాగుతుంటే.. ఓటర్లలో వెల్లువెత్తే అభిమానాన్ని బేరీజు వేసుకుని రాజకీయ నేతలు సాగుతారు. అయితే సినిమా నటులకు దక్కే అభిమానం కంటే రాజకీయ నేతలకు దక్కే అభిమానం చాలా తక్కువేనని చెప్పాలి. ఇటీవలి కాలంలో రాజకీయ నేతల పట్ల జనం అవధులు దాటిపోయే అభిమానాన్ని చూపుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ మహిళా నేత విడదల రజనీకి బొమ్మ.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన దూడం అనిల్ కుమార్ అనే యువకుడి చేతిపై పచ్చబొట్టుగా మారిపోయింది. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
అందరినీ మించిన ఎమ్మెల్యే..
అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీని నిర్వహించి సత్తా చాటిన విడదల రజనీ.. 2019 సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటిదాకా ఆ సీటు తనదేనంటూ ధీమాగా ఉన్న మర్రి రాజశేఖర్‌ను కాదని జగన్ విడదలకే టికెట్ ఇచ్చేశారు. ఎన్నికల్లో వైసీపీ వైపుగా బలంగా వీచిన గాలిలో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత ఏకంగా మంత్రి పదవికే గురి పెట్టిన రజనీ.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా మారిపోయారు. ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా కూడా దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సాగుతున్నారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన అందరు ఎమ్మెల్యేల్లో రజనీకి దక్కినంత పాపులారిటీ మరెవరికీ దక్కలేదనే చెప్పాలి. సీఎం క్యాంపు కార్యాలయంతో పాటుగా రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోనే ఉన్న రజనీ.. సీఎం పాలుపంచుకునే ప్రతి కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటూ తనదైన స్పీడుతో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి చర్చించుకునే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోందనే చెప్పాలి.
పచ్చబొట్టు కథేంటంటే..?
ఈ క్రమంలోనే ఆమె వీడియోలు చూసిన చాలా మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారట. ఈ తరహా అభిమానులు ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆమెకు అభిమానులున్నారట. ఆ అభిమానుల్లో ఒకడైన అనిల్ కుమార్.. ఆమె చిత్రాన్ని తన చేతిపై నిండుగా పొడిపించేసుకున్నాడు. ఈ యువకుడిది కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం చాట్లపల్లి గ్రామం. అతడు తన చేతి నిండా విడదల రజిని రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. అనిల్ కుమార్ శుక్రవారం అకస్మాత్తుగా చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు. అనిల్ చేతిని చూసిన ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత అభిమానమా..? అని ఆమె ప్రశ్నించగా.. అనిల్ మాట్లాడుతూ “ఎమ్మెల్యేగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి మీకు అభిమానిగా మారాను. మహిళ అయినా ఎంతో ధైర్యంతో మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీ ధైర్య సాహసాలు, సేవా గుణానికి మీ అభిమానిగా మారాను. మీతో కలిసి మీ అడుగుజాడల్లో నడవాలని ఉంది” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ యువకుడి కుటుంబ పరిస్థితులను ఆరా తీయగా.. అతడో నిరుపేద. కూలి పనిచేసుకుని బతుకుతున్నాడు. అతడి తల్లిదండ్రులు కూడా దినసరి కూలీలే. ఈ వివరాలన్నీ తెలుసుకున్న రజనీ.. తానే మంచి ఉద్యోగం ఇస్తానని అనిల్‌కు హామీ ఇచ్చారు.
Must Read ;- టీచరమ్మగా వైసీపీ ఎమ్మెల్యే రోజా











