ఎన్నికలకు ముందు.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానని జగన్ ప్రకటించారు. కానీ.. ఇప్పుడు కొత్త జిల్లాల విషయంలో ప్రజాభిప్రాయం తీసుకుంటాం అంటున్నారు. ప్రజాభిప్రాయం అనగానే.. రకరకాల డిమాండ్లు వస్తాయి. ఒక శాస్త్రీయమైన పద్ధతి లేకుండా పోతుంది. రాజకీయ అవసరాలన్నీ ఆ ముసుగుకిందికి వెళతాయి. జిల్లాల సంఖ్య ఎంపీ నియోజకవర్గాల ప్రకారం 25 కాదుకదా.. ఎక్కడికో వెళ్లిపోయే అవకాశం ఉంది.
ఊపందుకున్న ప్రక్రియ
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. దీనిపై ఉన్నతాధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పురోగతిపై సమీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలనే విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. పార్లమెంటు స్థానాల ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని సీఎం గతంలో ప్రకటించారు.
అయితే అది అన్ని ప్రాంతాల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకే జిల్లాల ఏర్పాటుకు ముందే ప్రజల అభిప్రాయాలను సేకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ అవసరం మేరకు జిల్లాల సంఖ్యను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read ;- కొత్త జిల్లాలకు కసరత్తు షురూ….
కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం పూర్తి
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నీలం సాహ్ని ఆధ్వర్యంలో ఇప్పటికే అధ్యయనం పూర్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో తలెత్తుతున్న సమస్యలు, డిమాండ్లపై సీఎస్ నీలం సాహ్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల విషయంలోనే అనేక జిల్లాల్లో రకరకాల డిమాండ్లు వస్తున్నాయని సీఎస్ అధ్యయనంలో తేలింది. గుంటూరు జిల్లాలో నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే అధికారులు నరసరావుపేటలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకోసం కొన్ని భవనాలు, స్థలాలను పరిశీలించారు.
అయితే నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఎవరూ పెద్దగా డిమాండ్ చేయడం లేదు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు, ప్రతిపక్షాలు, వామపక్షాలు, ప్రజాసంఘాలు, స్థానికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. గురజాల కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం చేపట్టేందుకు కూడా ప్రజాసంఘాలు జేఏసీ ఏర్పాటు చేసుకున్నాయి. ఇలాంటి సమస్యలు అనేక జిల్లాల్లో తలెత్తుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాను విభజించేందుకు స్థానికులు అంగీకరించడం లేదు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇవన్నీ సీఎస్ నీలం సాహ్ని, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ విన్న సీఎం కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం సేకరించాలని ఆదేశించారు.
Also Read ;- ప్రకాశం జిల్లాలో టీడీపీ దుస్థితికి కారణం ఈ నిర్ణయాలేనా??
ప్రజాభిప్రాయమే కీలకం కానుంది
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయమే కీలకంగా మారనుంది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే వైసీపీ రాజకీయంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది గమనించిన ఆ పార్టీ అధినేత జనాభిప్రాయానికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ తరహాలో జిల్లా కేంద్రాలకు ప్రజామోదం లభించేలా ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా జిల్లాల ఏర్పాటు విషయంలో తేడావస్తే, వైసీపీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇది గమనించిన సీఎం ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేయాలని భావిస్తున్నారు. రాజకీయంగా వచ్చే ఒత్తిళ్లను పరిశీలించి, ప్రజాభిప్రాయానికే మొగ్గు చూపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అధికారులు, సిబ్బంది విభజన లెక్కింపు షురూ..
కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే అధికారులను, సిబ్బందిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేలోపే ఏ జిల్లా పరిధిలోకి ఎవరు వస్తారనే విషయాలను సేకరిస్తున్నారు. ఇక ఏపీలో నాలుగు జోన్లు ఉన్నాయి. వీటిని ఇప్పట్లో మార్చే అవకాశాలు కనిపించడం లేదు. జోన్లు మార్చాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. అందుకే జోన్లను పెంచే విషయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు సాఫీగా సాగిపోతే, ఆ తరవాత జోన్లపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read ;- పార్లమెంట్ యూనిట్‌గా ససేమిరా.. సొంత నేతలే అసంతృప్తి











