నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుతో దేశ వ్యాప్తంగా అప్రతిష్టను మూట గట్టుకున్న జగన్ సర్కారు మరో మారు అందరికీ మెయిల్స్ పంపటం ద్వారా అభాసుపాలవుతుందా అన్న వాదనలు సాగుతున్నాయి. వైసీపీ తరఫున పోటీ చేసి నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామరాజు తర్వాత జరిగిన పరిణామాలతో ఏపీలో ఆ పార్టీ పాలనా తీరుపై తరచూ విమర్శలు చేసేవారు, సీఐడీ ఆయన్ను అరెస్టు చేయటం, తదంతనంతరం జరిగిన పరిణామాలపై ఆయన దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులందరికి లేఖలు రాసి జగన్ సర్కారు పరువును బజారున పెట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఆయనపై కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టి బెయిల్ షరతులు ఉల్లంఘించి పారిపోయారంటూ ప్రముఖులకు మెయిల్స్ పంపింది.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌తో..
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామరాజు పిటిషన్ వేయడంతో ఆయనపై సర్కారు చర్యలకు ఉపక్రమించిందన్న ఆరోపణలున్నాయి. దేశద్రోహం కేసు కింద ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, సుప్రీంకోర్టు బెయిల్‌పై ఆయన బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మిలటరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన ఢిల్లీ చేరుకుని అక్కడ నుంచి జగన్ సర్కారుపై లేఖల యుద్ధం ప్రారంభించారు. సీఐడీ అధికారులు తనను హించించిన తీరుపై ప్రముఖలను ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా, దేశంలోని రాజకీయ ప్రముఖులందరికీ లేఖలు రాసి తనకు మద్దతు కోరారు. అంతేకాకుండా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రతిరోజు సీఎం జగన్‌కు లేఖలు రాస్తూ సర్కారును ఇరుకున పెడుతున్నారు.
రూటు మార్చిన వైసీపీ..
ఎంపీ రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోవడంతో వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన రఘురామరాజు సొంత పూచీకత్తు సమర్పించకుండా పారిపోయారంటూ కోర్టులు, ప్రధాని తదితరులకు మెయిల్స్ పంపారు. వైసీపీ లీగల్ సెల్ సభ్యుడిగా ఉన్న విజయవాడ న్యాయవాది కోటంరాజు వెంకటేష్ శర్మ రఘురామరాజు పరారయ్యారంటూ సుప్రీంకోర్డు, హైకోర్టు, ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవెగౌడ తదితరులు 18 మందికి మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు షరతుల మేరకు రఘురామరాజు సొంత పూచీకత్తు సమర్పించ లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన పారిపోయారంటూ ప్రముఖులకు మెయిల్స్ పంపారు. అలాగే గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ పేపర్లపై రఘురామరాజు సంతకాలు తీసుకోవాలని గుంటూరు జైలుకు పంపగా జైలు సూపరింటెండెంట్ సంతకాలు లేకుండా వెనక్కి పంపారని వైసీపీ న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీఐడీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగించగా రఘురామరాజు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. రిమాండ్ గడువు ఈ రోజుతో పూర్తవుతున్నందున ఏమి జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.
సుమోటోగా విచారణ చేపట్టాలంటూ..
బెయిల్ షరుతులను ఉల్లంఘించిన ఎంపీ రఘురామరాజు వ్యవహారంపై సుమోటోగా విచారణ చేపట్టాలంటూ వైసీపీ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఈ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Must Read ;- ముంచుడా,మద్దతా.. RRR లేఖతో కదిలికొస్తే చాలా మంది పదవులు ఊస్టే..!











