ఒకరు సినిమాల్లో బుట్టబొమ్మ.. ఇంకొకరు దేశానికి పట్టుకొమ్మ. ఆ పట్టుకొమ్మకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆమె పేరు పాపమ్మాళ్.. ఊరు కోయంబత్తూర్ కు సమీపంలోని తెక్కంపట్టి గ్రామం.
పాపమ్మాళ్ కు ఇంతటి గౌరవంగా దక్కగానే పూజా హెగ్డే స్పందించేసింది. వయసుతో నిమిత్తం లేకుండా మనసుతో సాగుచేస్తున్న ఈ భూమిపుత్రికను పొగడ్తలతో ముంచెత్తింది. తన ట్విట్టర్ లో స్పందిస్తూ ఆమెలోని అంకిత భావానికి హ్యాట్యాఫ్ చెప్పేసింది. ఒక్క పూజా హెగ్డేనే కాదు కోయంబత్తూరుకు చెందిన ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీవాసుదేవ్, ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్. లక్ష్మణ్ లాంటి ప్రముఖులంతా పాపమ్మాళ్ కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించగానే స్పందించారు. అసలీ పాపమ్మాళ్ ప్రత్యేకత ఏమిటి? ఆమెకు వ్యవసాయం మీద ఇంతటి మమకారం ఎందుకు పెరిగింది? లాంటి విశేషాలను తెలుసుకుందాం.
శతాధిక వయసు.. సాగు మీదే మనసు
తమిళనాడులో నీలగిరి పర్వత ప్రాంతాల సమీపంలో భవానీ నది ఒడ్డున ఉంది తెక్కంపట్టి గ్రామం. ఈసారి గణతంత్ర దినోత్సవం ఈ గ్రామస్తులకు ప్రత్యేకం. ఎందుకంటే పాపమ్మాళ్ ది ఈ గ్రామమే కాబట్టి ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించగానే ఆనందోత్సాహాలతో ఈ ఉత్సవాన్ని జరుపుకొన్నారు. ఆమె రంగమ అయినా పాపమ్మాళ్ అంటేనే అందరికీ తెలుసు. పాపమ్మాళ్ వయసు ఇప్పుడు 105 ఏళ్లు. చిన్నప్పటి నుంచి ఆమెకు వ్యవసాయం అంటే ఆసక్తి. ఆ కారణంగానే అరవై ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం మీద ఆమె దృష్టికేంద్రీకరించింది. అందులో అద్భుతాలు సాధించింది.

Also Read ;- విజయ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ
తమిళనాడులోని కోయంబత్తూర్ ప్రాంతానికి చెందిన పాపమ్మాళ్ వ్యవసాయం చేయించడం కాదు ఆమె తాను స్వయంగా పొలంలోకి దిగి చేస్తుంది. పలుగూ పారా పట్టుకుని భూమిని చదును చేయడం, పొలం పనులు చేయడం ఆమె ప్రత్యేకత. మనసు ఉండాలే కానీ ఇలాంటి పనులకు వయసు అడ్డం కాదని ఆమె అంటోంది. ఆమె పెద్దగా చదువుకోలేదు. కానీ అన్ని విషయాలనూ ఆకళింపు చేసుకోగలదు. లెక్కల్లో దిట్ట. తన చిన్నప్పుడు బడిలేకపోవడం వల్ల అన్ని విషయాలనూ ఆటల ద్వారానే తెలుసుకున్నానని ఆమె వివరించింది. చిన్నతనం నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగి పెద్దయ్యిందట. ఆమె చనిపోయాక బతుకు తెరువు కోసం బడ్డీ కొట్టు నడిపింది.
వ్యవసాయం చేయాలన్న కోరిక బలంగా ఉండటంతో సొంతంగా కొంత భూమికొనుక్కుంది. కొంత డబ్బును సమకూర్చుకుని 10 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అందులో వివిధ రకాల పంటలు పండించింది. అంత భూమిని సాగుచేయాలంటే మాటలు కాదు. దాంతో ఏడున్నర ఎకరాల భూమిని అమ్మేసిందట. మిగిలిన రెండున్నర ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపట్టింది. చాలా మంది సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణం ఎక్కువ ఆదాయం రాదన్న ఒకేఒక్క కారణం అంటుందామె. లాభాపేక్ష మానుకుని మంచి పంటలు పండించాలన్న తపన అందరిలోనూ ఉండాలంటుందామె.

ఆమె వందేళ్ల పుట్టిన రోజును ఊరి వారంతా ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంలో పాపమ్మాళ్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడామె వయసు 105 పైబడినా ఇప్పటికే పొలం వెళ్లి పనిచేస్తూనే ఉంటుంది. ఆమె ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆమె పండించిన కూరగాయలు, పండ్లేనట. ఈ వయసులోనూ మటన్ బిర్యానీ లాగించేస్తుందామె. అలాగే అంబలి అంటే చాలా ఇష్టమట. పాపమ్మాళ్ ఆరోగ్య రహస్యం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇష్టమైన పని దొరికితే అది కష్టం కాదని కూడా పాపమ్మాళ్ విషయంలో రుజువవుతోంది. ఇంతటి ఆదర్శవంతురాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడం వల్లే ఈరోజు పద్మశ్రీ పురస్కారం దక్కింది.
Also Read ;- చరణ్ .. పూజా హెగ్డే పాటేసుకోవడానికి మెలోడీ రెడీ!
ఇంకా ఆమె గురించి చెప్పాలంటే..
పాపమ్మాళ్ గురించి చెప్పాలంటే వ్యవసాయంలో ఆనుపానులన్నీ బాగా తెలుసు. అందుకే సెంటెనరియన్ టి.ఎన్. అగ్రికల్చరల్ యూనివర్శిటీ సలహా కమిటీలోనూ ఆమెకు చోటు దక్కింది. రాజకీయాలన్నా కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువే. తెక్కంపట్టి పంచాయితీ వార్డ్ సభ్యురాలిగానూ పనిచేసింది. కరామడై పంచాయతీ యూనియన్ లో కౌన్సిలర్ గానూ ఎన్నికైంది. ఆమెకు పద్మశ్రీ ప్రకటించగానే డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. తన ట్విట్టర్ నుంచి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకే వ్యవసాయ రంగంలో పాపమ్మాళ్ లాంటి లెజండ్ లు ఇంకా రావాలి. చదువు పుస్తకాల్లో కాదు జీవితానుభవాల్లో నుంచి రావాలని ఇలాంటి వ్యక్తుల ద్వారా నిరూపించాలి.
– హేమసుందర్ పామర్తి
Hats off to such dedication and enthusiasm👏🏻 Agriculturist Pappammal from Coimbatore has undoubtedly proved that age is just a number. Congratulations on being honoured with the Padma Shri. #Respecthttps://t.co/bQd6DKYnIN
— Pooja Hegde (@hegdepooja) January 29, 2021
Age is only a number. 105 year old Pappammal is a legend in organic agriculture. She works at her field in Thekkampatti, TN and cultivates millets,pulses & vegetables across 2.5 acres & runs a provision store & eatery. She has been honoured with the #PadmaShri award. Naman 🙏🏼 pic.twitter.com/39kpwxIknL
— VVS Laxman (@VVSLaxman281) January 26, 2021
Pappammal – a most worthy recipient of the esteemed #PadmaShri. An exemplary role model of organic farming both to India and the world. You have made #Coimbatore proud. -Sghttps://t.co/9VddPoCDgE
— Sadhguru (@SadhguruJV) January 27, 2021











