ఆరు రాష్ట్రాల్లో రోజుకు ఒక్కో రాష్ట్రాలో 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మరో 12 రాష్ట్రాల్లో రోజుకు ఒక్కో స్టేట్ లో 10 వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, గోవాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇక ఢిల్లీ, హైదరాబాద్ నగరాలతోపాటు పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తీసుకు వచ్చాయి. అయినా కరోనా వేగం ఏ మాత్రం మందగించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మే మొదటి వారం నాటికి రోజుకు పది లక్షల మంది కరోనా భారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంచనా వేశారు. ఇదే జరిగితే రోజుకు పది వేల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
దేశ వ్యాప్త లాక్ డౌన్ తప్పదా….
లాక్ డౌన్ వేయడంతో మొదటి విడత కరోనాను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కరోనా రూపు మార్చుకోవడంతో కరోనా కట్టడి సాధ్యం కావడం లేదు. మహారాష్ట్రలో రోజుకు 67వేలకుపైగా కేసులు నమోదువుతున్నాయి. లాక్ డౌన్ అమల్లో ఉన్నా అక్కడ కోవిడ్ కేసులు ఏ మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ గాలిలోకి చేరిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఇక కరోనాతో శాశ్వితంగా సహవాసం తప్పదని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ, గోవా, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఢండ్ రాష్ట్రాల్లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా రోగులకు ఎక్కడా బెడ్లు దొరకడం లేదు. అత్యవసర సేవలు కూడా అంతంత మాత్రంగా నే అందుతున్నాయి. ఆక్సిజన్ కొరత కొనసాగుతోంది. దేశంలో ఆక్సిజన్ కొరతను అదిగమించేందుకు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
ఏపీలో కరోనా కలవరం
ఏపీలో ఇప్పటికే కరోనా భారిన పడ్డ వారి సంఖ్య పది లక్షలు దాటిపోయింది. 7500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్ లో రోజుకు 11 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కందుకూరు బాలుర పాఠశాలలో ఓ టీచర్ కరోనాతో మృతిచెందారు. మరో 12 మంది టీచర్లు కరోనా భారిన పడ్డారు. పరుచూరు మండలం చెరుకూరులో హైస్కూల్ లో అత్యధికంగా ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. గడచిన 28 రోజుల్లోనే ఏపీలో లక్షకుపైగా కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలోనూ దొరకని బెడ్లు
ప్రభుత్వ కరోనా ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రాణాలు నిలుపుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి చివరకు అప్పుల పాలవుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవ పరిస్థితికి చేలా తేడా ఉందని హైకోర్టు మొటిక్కాయలు వేసింది. రోజుకు 40 వేల కరోనా టెస్టులు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం టెస్టులు సరిగా జరగడం లేదని తెలుస్తోంది. ఇక కరోనా నిర్థరణ అయినా వారికి ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించడం లేదు. దీంతో కొందరు కరోనా రోగులు యదేచ్ఛగా తిరుగుతున్నారు. వీరి వల్ల వందల మందికి కరోనా వ్యాపిస్తోంది. తెలంగాణలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు కూడా కరోనా భారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వేగంగా టీకా కార్యక్రమం
దేశంలో ఇప్పటికే 14 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. రాబోయే నెల రోజుల్లో మరో 5 కోట్ల మందికి కరోనా టీకా వేయాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు పలు రాష్ట్రాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో కరోనా టీకా మందు సరైన మోతాదులో అందుబాటులో లేకపోవడం ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. లక్ష్యం మేరకు టీకాలు వేయాలంటే మందు సరఫరా భారీగా పెంచాల్సి ఉంది. ఇందు కోసం విదేశాల నుంచి మరో 3 రకాల టీకాలు దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కరోనా మందు సరఫరా పెరిగితే టీకా కార్యక్రమం కూడా ఊపందుకునే అవకాశం ఉంది. కనీసం 30 కోట్ల మందికి కరోనా టీకా అందిస్తేనే కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆక్సిజన్ కోసం అగచాట్లు
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా రోగులకు ఆక్సిజన్ లభించిక ప్రాణాలు విడుస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్రం విమానాలను రంగంలోకి దింపింది. ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలను కూడా అంబులెన్సుగా పరిగణించాలని, ఎక్కడా వాటిని ఆపవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఆక్సిజన్ సరఫరా పెరగడంతోపాటు, వేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు రైల్వే సేవలను కూడా వినియోగించుకుంటోంది. అయితే ఆక్సిజన్ అవసరాలకు మేర ఉత్పత్తి లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ విళయం సృష్టిస్తోందని చెప్పవచ్చు.
Must Read ;- కరోనా మానవాళిపై ఎంత పగబట్టిందో.. ఎటు చూసినా ఇబ్బందులే











